చంద్రబాబు కేసుల క్లోజర్‌పై హైకోర్టులో కీలక వాదనలు
తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ధర్మాసనం
బాబుపై ఏడు కేసుల దర్యాప్తును సీబీఐకి, ఈడీకి అప్పగించాలని దాఖలైన వ్యాజ్యాలు
ఫిర్యాదులు చేసినవారు వేరు.. ఎన్‌వోసీలు ఇచ్చినవారు వేరు!
కేసులు మూసివేయొచ్చని చెప్పింది అధికారులే
వారంతా చంద్రబాబు కింద పనిచేసే వారే
ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వెళ్లే పరిస్థితి అధికారులకు ఉండదు
అందుకే వారు కేసుల మూసివేతకు అభ్యంతరం లేదని చెప్పారు
హైకోర్టుకు నివేదించిన పిటిషనర్ల తరఫు న్యాయవాది
కేసుల మూసివేతకు అధికారులు ఎన్‌వోసీలు ఇచ్చారు
ఆళ్ల ఒక్కరే అభ్యంతరం చెప్పి ప్రొటెస్ట్ పిటిషన్ వేశారు
ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చిన సీఐడీ న్యాయవాది అహ్లువాలియా
సాక్షి, అమరావతి: కుంభకోణాలపై ఫిర్యాదులు చేసింది ఒకరు.. కేసుల మూసివేతకు క్లీన్‌చిట్ ఇచ్చింది మరొకరు! చంద్రబాబు హయాంలో నమోదైన ఏడు కీలక కేసుల మూసివేత వెనుక అధికారుల పాత్ర ఇప్పుడు హైకోర్టులో తీవ్ర చర్చకు దారితీసింది. ఫిర్యాదుదారులకు సంబంధం లేని అధికారులు ఎన్‌వోసీలు ఇవ్వడమే ప్రాతిపదికగా కేసులను మూసివేయడంపై పిటిషనర్ల తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేసే అధికారుల నిరభ్యంతర పత్రాలతో కేసుల మూసివేతను ఎలా సమర్థిస్తారన్న ప్రశ్నను లేవనెత్తారు. గత ప్రభుత్వ హయాంలో నమోదైన స్కిల్ డెవలప్‌మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్, అసైన్డ్ భూములు, ఏపీ ఫైబర్ నెట్, మద్యం, ఇసుక విధానాలకు సంబంధించిన ఏడు కేసుల దర్యాప్తును సీబీఐ, ఈడీలకు అప్పగించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి.
వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే )జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత వారం ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు, ఆయా కేసుల్లో ఫిర్యాదుదారుల వైఖరి, క్లోజర్ రిపోర్టుల దాఖలు, వాటి ఆమోదం, ప్రొటెస్ట్ పిటిషన్ల వివరాలను కేసుల వారీగా సమగ్ర పట్టిక రూపంలో సీఐడీ సమరి్పంచింది. వాటిని ధర్మాసనం సమగ్రంగా పరిశీలించింది.
చంద్రబాబుపై కేసుల్లో దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ వ్యాజ్యాలు
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసు దర్యాప్తుని సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ హైకోర్టులో 2023లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్ ) దాఖలు చేశారు. అలాగే చంద్రబాబు తదితరులపై వివిధ ఆర్థిక నేరాలకు సంబంధించి నమోదైన ఏడు కేసుల దర్యాప్తును సీబీఐ, ఈడీలకు బదిలీ చేయాలని కోరుతూ స్వర్ణాంధ్ర తెలుగు డైలీ ఎడిటర్ కె.బాలగంగాధర్ తిలక్ 2024లో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు వ్యాజ్యాలపై మంగళవారం సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది.
కేసుల మూసివేతకు అభ్యంతరం లేదన్నది అధికారులే
ఈ సందర్భంగా తిలక్, అరుణ్ కుమార్ తరఫు న్యాయవాది చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ, చంద్రబాబు తదితరులపై కేసుల మూసివేతకు ఫిర్యాదుదారులు అభ్యంతరం లేదని చెప్పారన్న దాంట్లో వాస్తవం లేదన్నారు. వాస్తవానికి చంద్రబాబు కుంభకోణాలపై ఫిర్యాదు చేసిన వ్యక్తులు వేరని, కేసుల మూసివేతకు నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) ఇచ్చిన వారు వేరని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
చంద్రబాబు తదితరులపై కేసులు మూసివేయాలని నిరభ్యంతర పత్రం ఇచ్చిన వారంతా కూడా అధికారులేనన్నారు. ఆ అధికారులందరూ చంద్రబాబు ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేసేవారని తెలిపారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వ్యవహరించే పరిస్థితి అధికారులకు ఉండదన్నారు. కేసుల మూసివేతపై ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేసిన వారిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారన్నారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డి మినహా మిగిలిన వారంతా కేసుల మూసివేతకు ఓకే చెప్పారు
అంతకు ముందు సీఐడీ తరఫు న్యాయవాది అనురాగ్ అహ్లూవాలియా వాదనలు వినిపిస్తూ, చంద్రబాబు తదితరులపై నమోదైన ఏడు కేసుల్లో ఆరు కేసులను మూసివేసేందుకు ఫిర్యాదుదారులు నిరభ్యంతర పత్రం ఇచ్చారని వివరించారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఫిర్యాదిదారుగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి మినహా మిగిలిన వారెవ్వరూ కూడా కేసుల మూసివేతపై ఏసీబీ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రొటెస్ట్ పిటిషన్లు దాఖలు చేయలేదన్నారు. ఆళ్ల ప్రొటెస్ట్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టేసిందని, దానిపై ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, అది పెండింగ్‌లో ఉందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఆ మేర ఉత్తర్వులిచ్చింది.


