తిరుపతిలో శ్రీవారి భూమి కేటాయింపుపై హైకోర్టు వ్యాఖ్య
ఇందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి..
కేటాయింపు విధి విధానాలను పరిశీలిస్తాం..
స్టేటస్ రిపోర్టు దాఖలు చేయండి.. రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీకి ఆదేశం
భూమి కేటాయింపుపై హైకోర్టులో వైఎస్సార్‌సీపీ నేత భూమన పిల్
ప్రభుత్వ ఖజానాకు, టీటీడీకి భారీగా ఆర్థి క నష్టమని వివరణ
రూ.400 కోట్ల విలువైన భూమికి బదులుగా తీసుకుంది రూ.20 కోట్ల విలువైన భూమే
సాక్షి, అమరావతి: తిరుపతి అర్బన్ మండలం ఆర్‌ఎస్ గ్రామం పరిధిలోని సర్వే నంబర్ 588(ఏ4)లో తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ)కు చెందిన 20 ఎకరాల భూమిని ఒబెరాయ్ గ్రూపునకు చెందిన స్వర హోటల్స్‌కు కేటాయించడం పూర్తిగా వ్యాపార నిర్ణయంగా కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇందుకు ప్రాథమిక ఆధారాలు కనిపిస్తున్నాయని చెప్పింది. ఈ నేపథ్యంలో సదరు భూ కేటాయింపు విధి విధానాలను పరిశీలిస్తామని స్పష్టం చేసింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీవారి భూమిని ఒబెరాయ్‌కి కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు, ఈ కేటాయింపులపై స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
శ్రీవారి భూమిని విలాసవంత హోటల్‌కు కేటాయించడమా?
అంతకు ముందు భూమన తరఫు న్యాయవాది రాయప్రోలు శ్రీకాంత్ వాదనలు వినిపిస్తూ.. కోట్ల రూపాయల విలువైన భూమిని టీటీడీ తొలుత పర్యాటక శాఖకు బదలాయించి, ఆ తర్వాత ఒబెరాయ్ గ్రూప్‌నకు చెందిన ’స్వర హోటల్స్ లిమిటెడ్’కు కేటాయించారన్నారు. దీని వల్ల టీటీడీకి రూ.వందల కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. రూ.400 కోట్ల విలువైన భూమిని పర్యాటక శాఖకు కేటాయించి, దానికి బదులుగా కేవలం రూ.20 కోట్ల విలువైన భూమిని మాత్రమే టీటీడీ తీసుకుందని వివరించారు.
ఒబెరాయ్ గ్రూప్‌కు స్టాంప్ డ్యూటీ, రిజి్రస్టేషన్ ఫీజు కింద కోట్లాది రూపాయల మేర మినహాయింపు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు, టీటీడీకి భారీగా ఆర్థి క నష్టం వాటిల్లిందన్నారు. అలిపిరి పాదాల వద్ద శ్రీవారికి చెందిన పవిత్ర భూమిని లగ్జరీ హోటల్ నిర్మాణానికి కేటాయించడం ‘తిరుమల దివ్య క్షేత్రం’ నిబంధనలకు, హిందూ ధార్మిక విశ్వాసాలకు విరుద్ధమన్నారు. ఈ నేపథ్యంలో స్వర హోటల్‌కు కేటాయించిన భూమి విషయంలో యథా తథస్థితి (స్టేటస్ కో) కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
అనంతరం టీటీడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, అలిపిరి వద్ద బేస్ క్యాంప్ నిర్మించాలని మొదట్లో భావించామన్నారు. అయితే సాంకేతిక కారణాలతో అది కార్యరూపం దాల్చలేదని తెలిపారు. స్వర హోటల్‌కు టీటీడీ భూమిని కేటాయించాలన్నది ప్రభుత్వ నిర్ణయమని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ఈ మొత్తం భూ కేటాయింపులపై స్టేటస్ రిపోర్ట్‌ను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని, టీటీడీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.


