వెలగపూడిలో కంచర్ల సాంబశివరావు విక్రయించిన 25,000 చదరపు గజాల్లో చంద్రబాబు నిర్మీస్తున్న ప్యాలెస్.. ఇందుకు ప్రతిగా సాంబశివరావు కుటుంబ భూమికి గ్రామ కంఠం పేరుతో భూ సమీకరణ నుంచి ప్రభుత్వ మినహాయింపు దక్కింది.
రాజధాని భూసమీకరణలో.. రూ.12 వేల కోట్ల కుంభకోణం
చంద్రబాబు ప్యాలెస్‌కు భూములిచ్చిన వారికి గ్రామకంఠం నజరానా
ఆ ప్యాలెస్ పక్కనే బ్రాహ్మణి నిర్మించే భవనానికి భూములు ఇచ్చిన వారికీ మినహాయింపు
లోకేశ్, నారాయణ సన్నిహితులకు గ్రామకంఠం పేరుతో మినహాయింపులు
సమీకరణ నుంచి సుమారు 3వేల ఎకరాలను తప్పించారు
ఇళ్లు, వాణిజ్య భవనాలు నిర్మించుకుని, విక్రయించుకునే వెసులుబాటు కల్పించారు
2014 డిసెంబర్ 8న గుర్తించిన ప్రాంతాలనే గ్రామకంఠాలుగా మినహాయించాలి
కానీ చంద్రబాబు అండ్ కో భూములనే మినహాయించారు
అర్హత ఉన్న 698 మంది రైతులు దరఖాస్తు
అందులో 17మందికే మినహాయింపు ఇస్తామన్న చంద్రబాబు సర్కార్
తీవ్ర మనోవ్యథతో మందడం రైతు రంజిత్‌కుమార్ మరణం
టీడీపీ నేతలకో న్యాయం.. మాకో న్యాయమా అంటూ రైతుల ఆగ్రహం
సాక్షి, అమరావతి: కుంభకోణాలకు మారుపేరుగా భాసిల్లుతున్న రాజధాని అమరావతిలో మరో భారీ భూకుంభకోణం బట్టబయలైంది. గ్రామకంఠం అంటే.. గ్రామంలో ప్రజలు నివసిస్తున్న ప్రాంతం, దానికి అనుబంధంగా ఉన్న ప్రాంతం (పశువుల పాక, గడ్డివాము, పొగాకు బ్యారెన్లు ఉన్న ప్రదేశం). రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో 2014, డిసెంబరు 8 నాటికి ఉన్న నిర్మాణాలు, వీజీటీఎం యూడీఏ (విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ఆమోదించిన లేఅవుట్లలోని ప్లాట్లను మాత్రమే భూసమీకరణ పథకం (ల్యాండ్ పూలింగ్ స్కీం) కింద మినహాయింపు ఇవ్వాలని 2015, మార్చి 1న సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) కమిషనర్ మార్గదర్శకాలు జారీ చేశారు.
ఊరికి దూరంగా విడివిడిగా ఉన్న ఇళ్లు, వీజీటీఎం అనుమతి లేని అనధికారిక లేఅవుట్లకు, వ్యవసాయానికి ఉపయోగించే ఖాళీ భూములకు భూసమీకరణ నుంచి మినహాయింపు వర్తించదని తేల్చిచెప్పింది. ఆ మార్గదర్శకాల ప్రకారమే 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ స్కీం కింద 6,473.72 ఎకరాలను భూసమీకరణ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు సీఆర్‌డీఏ చెబుతోంది. కానీ.. అందులో సుమారు 3 వేల ఎకరాల భూమిని ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులైన టీడీపీ నేతలు, టీడీపీ కార్యకర్తలు, ముడుపులు ఇచ్చిన వారికి గ్రామకంఠం కింద పరిగణించి భూసమీకరణ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు రాజధాని రైతులు చెబుతున్నారు.
చంద్రబాబు ప్యాలెస్ నిర్మాణం కోసం కొనుగోలు చేసిన భూమి ధర ప్రకారం చూస్తే.. గ్రామకంఠం కింద మినహాయించిన 3 వేల ఎకరాల భూమి విలువ అక్షరాల రూ.12 వేల కోట్లు. గ్రామకంఠంగా పరిగణించి.. భూసమీకరణ నుంచి మినహాయింపు ఇచ్చిన భూమిని రాజధాని మాస్టర్ ప్లాన్‌లో భాగంగా రోడ్లు, మురుగునీటి వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం సేకరిస్తే.. అంతే పరిమాణంలో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటుంది. గ్రామకంఠం కింద మినహాయింపు ఇచ్చిన ప్రాంతంలో ఇళ్లు, వాణిజ్య భవనాలు వంటివి నిర్మించుకోవచ్చు.
అటు ఇన్‌సైడర్ ట్రేడింగ్.. ఇటు గ్రామకంఠం ముసుగు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఓత్ ఆఫ్ సీక్రసీకి తిలోదకాలు ఇచ్చి.. రాజధాని ఏర్పాటుచేసే ప్రాంతాన్ని ముందే తన బినామీలు, వందిమాగధులకు లీకులు ఇచ్చారు. వారు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి రైతుల నుంచి తక్కువ ధరలకే భారీ ఎత్తున భూములు కాజేశారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి తక్కువ ధరలకే రైతుల నుంచి భూములు లాగేసుకున్నాక గుంటూరు జిల్లాలో తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో 29 గ్రామాలను రాజధాని ప్రాంతంగా ప్రకటించారు.
ల్యాండ్ పూలింగ్ స్కీం కింద రాజధాని నిర్మాణం కోసం భూములు సమీకరిస్తామని చెప్పారు. ఈ క్రమంలో 2014, డిసెంబర్ 8 నాటికి గ్రామం, ఆ గ్రామంలో నిర్మించిన ఇళ్లు, గ్రామకంఠాలు, విస్తరించిన గ్రామకంఠాల పరిధుల్ని గ్రామకంఠంగా పరిగణిస్తూ ఉపగ్రహ ఛాయాచిత్రాలు, రెవెన్యూ రికార్డుల ఆధారంగా నిర్ణయించి భూసమీకరణ నుంచి మినహాయించారు. వాటితోపాటు గ్రామాలను ఆనుకుని ఉన్న పొగాకు బ్యారెన్‌లు, పశువుల కొట్టాలు వంటివి ఉన్నా మినహాయింపులు ఇచ్చారు.
ఈ క్రమంలో తమ భూములను గ్రామకంఠంగా పరిగణించి భూసమీకరణ నుంచి మినహాయింపు ఇవ్వలేదంటూ రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు దామినేని శ్రీనివాసరావు, బెల్లకొండ నరసింహరావు, ఆలూరు చంద్రశేఖరరావు, నూతక్కి నాగకిశోర్ తదితరులు సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేశ్, నారాయణలకు ఫిర్యాదులు చేశారు. దాంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు గుంటూరు జిల్లా అప్పటి జాయింట్ కలెక్టర్, సీఆర్‌డీఏ ఎక్స్ అఫీషియో అడిషనల్ కమిషనర్ సీహెచ్ శ్రీధర్, సీఆర్‌డీఏ అడిషనల్ కమిషనర్‌లు ప్రసన్న వెంకటేశ్, ఎ.మల్లికార్జునలకు అప్పగిస్తూ ప్రభుత్వం 2016, మార్చి 16న ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందులో ల్యాండ్ పూలింగ్ స్కీం కింద ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలును సీహెచ్ శ్రీధర్ పర్యవేక్షించారు. ఉన్నత స్థాయి ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు.. టీడీపీ నేతలు, కార్యకర్తలు, ముడుపులు ఇచ్చిన వారికి సంబంధించిన వ్యవసాయ భూములను కూడా గ్రామకంఠం కింద మినహాయింపు ఇచ్చారు. ప్రధాన రాజధాని ప్రాంతంలోని వెలగపూడి, నేలపాడు, తుళ్లూరులలో గ్రామానికి చాలా దూరంలో ఉన్న వ్యవసాయ భూములను కూడా గ్రామకంఠం కింద పరిగణించి.. భూసమీకరణ నుంచి మినహాయింపు ఇవ్వడం గమనార్హం.
ఎకరాలకు ఎకరాలు గ్రామకంఠం కింద మినహాయింపు..
⇒ తుళ్లూరులో టీడీపీలో అత్యంత కీలకంగా వ్యవహరించే అనుమోలు ప్రభావతి కుటుంబానికి సర్వే నెంబరు 61/ఏలో 1.83, సర్వే నెంబరు 61/బీలో 1.69 ఎకరాలు ఉంది. ఇందులో ల్యాండ్ పూలింగ్ స్కీం కింద సర్వే నెంబరు 61/ఏలో ఎకరం, సర్వే నెంబరు 61/బీలో 0.92 ఎకరాలు వెరసి 1.92 ఎకరాలను సీఆర్‌డీఏకు అప్పగించారు. మిగులుగా 1.6 ఎకరాల భూమి ఉంటుంది. కానీ.. 1.92 ఎకరాలు భూమి మిగులుగా ఉన్నట్లు.. అది గ్రామకంఠం కింద పరిగణిస్తూ భూసమీకరణ నుంచి సీఆర్‌డీఏ మినహాయింపు ఇచ్చేసింది.
⇒ మందడంలో అలూరు చంద్రశేఖర్‌రావు టీడీపీ నేత. భూసమీకరణ కింద రైతుల నుంచి సీఆర్‌డీఏకు భూముల అప్పగింతలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆయనకు సర్వే నెంబరు 343లో 4.68 ఎకరాల భూమి ఉంటే.. ఆ భూమిని అంతటినీ గ్రామకంఠం కింద పరిగణిస్తూ భూసమీకరణ నుంచి సీఆర్‌డీఏ మినహాయింపు ఇచ్చేసింది.
⇒ మందడంలో టీడీపీలో కీలకంగా వ్యవహరించే నాయకులు బెజవాడ రమేష్ కు సర్వే నెంబరు 341/బీలో 0.72 ఎకరాలు.. నూతక్కి కొండయ్య, శ్రీధర, నాగేశ్వరరావు, రమేష్, అనంతరామయ్య తదితరులకు సర్వే నెంబరు 119లో 4.96 ఎకరాలు.. నూతక్కి లక్ష్మణ్‌రావు, రాజేంద్రప్రసాద్ తదితరులకు సర్వే నెంబరు 118/1లో 1.46 ఎకరాలను గ్రామకంఠం కింద పరిగణిస్తూ భూసమీకరణ నుంచి సీఆర్‌డీఏ మినహాయింపు ఇచ్చేసింది.
⇒ తుళ్లూరులో టీడీపీ కీలక నేత జమ్ముల కిరణ్‌కుమార్‌కు సర్వే నెంబరు 96లో 0.84 ఎకరాలు.. నేలపాడులో గుజ్జర్లపూడి సీతారామయ్యకు సర్వే నెంబరు 85/2లో 0.33, పెద్ద కోటయ్యకు సర్వే నెంబరు 143లో 0.32 ఎకరాలు, తరిగొప్పుల నాగేశ్వరరావుకు సర్వే నెంబరు 88/5లో 0.32 ఎకరాలు గ్రామకంఠం కింద పరిగణిస్తూ భూసమీకరణ నుంచి సీఆర్‌డీఏ మినహాయింపు ఇచ్చింది.
⇒ వెంకటపాలెంలో టీడీపీ కీలక నాయకుడు, రాజధాని రైతుల జేఏసీలో కీలకంగా వ్యవహరించిన బెల్లంకొండ నరసింహారావుకు సర్వే నెంబరు 118లో 0.24 ఎకరాలు, జమ్ముల శ్రీనివాసరావుకు సర్వే నెంబరు 133లో 0.25 ఎకరాలు, గుర్రం నాగేశ్వరరావుకు సర్వే నెంబరు 124/బీలో 0.24 ఎకరాలను గ్రామకంఠం కింద పరిగణిస్తూ భూసమీకరణ నుంచి సీఆర్‌డీఏ మినహాయింపు ఇచ్చింది.
⇒ రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులు, టీడీపీ నేతలకు ముడుపులు ఇచ్చిన రైతులకు మాత్రమే సుమారు 3 వేల ఎకరాల భూమిని గ్రామకంఠం కింద పరిగణిస్తూ భూసమీకరణ నుంచి సీఆర్‌డీఏ మినహాయించింది.

బాబు ప్యాలెస్‌కు భూమిచ్చినందుకు గ్రామకంఠం నజరానా..
రాజధాని ప్రధాన ప్రాంతం (కోర్ కేపిటల్ ఏరియా)లో తాత్కాలిక సచివాలయం వెనుక.. ప్రస్తుతం నిర్మీస్తున్న శాశ్వత సచివాలయానికి కూత వేటు దూరంలో వెలగపూడిలో సర్వే నెంబరు 111, 112, 113, 122, 150, 152, 239లలో 25 వేల చదరపు గజాల(5.16) రెసిడెన్షియల్ ప్లాట్ (నివాస స్థలాన్ని) కంచర్ల సాంబశివరావు, కంచర్ల శాంతికిరణ్, కంచర్ల ఓంకార్, కాట్రగడ్డ గీతాశ్రీ నుంచి సీఎం చంద్రబాబు కోడలు, మంత్రి నారా లోకేశ్ భార్య నారా బ్రాహ్మణి ట్రస్టీగా వ్యవహరిస్తున్న నివాస ట్రస్టు పేరుతో రూ.18.75 కోట్లకు అంటే.. చదరపు గజం రూ.7,500 చొప్పున కొనుగోలు చేసి 2025, ఏప్రిల్ 2న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
అంటే ఎకరం రూ.3.63 కోట్ల చొప్పున కొనుగోలు చేశారు. అందులోనే సీఎం చంద్రబాబు ఇంద్రభవనాన్ని తలపించే రీతిలో వందలాది కోట్లు వ్యయం చేస్తూ ప్యాలెస్‌ను నిర్మీస్తున్నారు. ఇది చూసినవారికి రాజధాని ప్రధాన ప్రాంతంలో రెసిడెన్షియల్ ప్లాట్ ధర అంత తక్కువగా ఉందా అన్న అనుమానం రాకమానదు.
ఇక చంద్రబాబుకు భూమి విక్రయించిన కంచర్ల సాంబశివరావు కుటుంబానికి సర్వే నెంబరు 91/1ఎఫ్‌లో 1.76 ఎకరాల (8,518.4 గజాలు) భూమిని గ్రామకంఠం కింద మినహాయింపు ఇచ్చారు. ప్యాలెస్ నిర్మాణానికి చంద్రబాబు భూమి కొనుగోలు చేసిన ధర ప్రకారం చూస్తే.. 1.76 ఎకరాల విలువ రూ.6.38 కోట్లు. చంద్రబాబు ఈ స్థలాన్ని తక్కువకు కొనడం.. అమ్మినవారికి గ్రామకంఠం కింద మినహాయింపు ఇవ్వడాన్ని బట్టి ఏం జరిగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

బ్రాహ్మణికి భూమి అమ్మినవారికీ మినహాయింపులు..
వెలగపూడిలో సీఎం చంద్రబాబు నిర్మిస్తున్న ప్యాలెస్‌కు ఆనుకునే ఆయన కోడలు, మంత్రి లోకేశ్ భార్య బ్రాహ్మణి ట్రస్టీగా వ్యవహరిస్తున్న నివాస ట్రస్టు పేరుతో సర్వే నం. 152లో 930 చదరపు గజాల రెసిడెన్షియల్ ప్లాట్‌ను చదరపు గజం రూ.5,750 చొప్పున రూ.53,47,500లకు మల్కాపురానికి చెందిన గద్దె శివరాంప్రసాద్ తనయుడు నిషాంత్ నుంచి కొనుగోలు చేసి 2025, అక్టోబర్10న రిజి్రస్టేషన్ చేసుకున్నారు. ఇందులో భారీ భవనాన్ని నిర్మీస్తున్నారు.
ప్యాలెస్ నిర్మాణానికి కంచర్ల సాంబవశిరావు నుంచి చదరపు గజం రూ.7,500లకు కొనుగోలు చేస్తే.. దాని పక్కనే ఉన్న 930 గజాల రెసిడెన్షియల్ ప్లాట్‌ను చ. గజం రూ.5,750లకే గద్దె నిషాంత్ నుంచి బ్రాహ్మణి కొనుగోలు చేశారు. అంటే.. చ. గజం రూ.1,750లు తక్కువకే కొన్నారు. బ్రాహ్మణికి కంచర్ల సాంబశివరావు కంటే తక్కువ ధరకు రెసిడెన్షియల్ ప్లాట్‌ను విక్రయించిన గద్దె నిషాంత్ తండ్రి గద్దె శివరాంప్రసాద్‌కు మల్కాపురంలో సర్వే నెంబరు 9/3లో 2.64 ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే.. అందులో 2 ఎకరాల భూమిని గ్రామకంఠం కింద ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది.
ప్యాలెస్ నిర్మాణం కోసం బ్రాహ్మణి కొనుగోలు చేసిన ధర ప్రకారం చూసుకుంటే.. శివరాంప్రసాద్‌కు గ్రామకంఠం కింద మినహాయింపు ఇచ్చిన 2 ఎకరాల భూమి విలువ రూ.7.26 కోట్లు. పశువుల పాక ఉన్న రెండు మూడు సెంట్లను తమకు గ్రామకంఠం కింద మినహాయింపు ఇవ్వని ప్రభుత్వం.. శివరాంప్రసాద్‌కు 2 ఎకరాలను మినహాయింపు ఇవ్వడంలో ఆంతర్యమేమిటని రాజధాని రైతులు ప్రశి్నస్తున్నారు.

దామినేనికి ఏ ప్రాతిపదికన మినహాయింపునిచ్చారు?
మండల కేంద్రం తుళ్లూరుకు చెందిన దామినేని శ్రీనివాసరావు అటు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్.. ఇటు మంత్రి పి.నారాయణకు అత్యంత సన్నిహితుడు. ఆ మండల టీడీపీ కీలక నాయకుడు.. రాజధాని రైతుల జేఏసీ నాయకుడు. దామినేని శ్రీనివాసరావు భార్య దామినేని కృష్ణవేణికి తుళ్లూరులో సర్వే నెంబరు 22/3లో 1.28 ఎకరాల భూమిని గ్రామకంఠం కింద ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది.
చంద్రబాబు ప్యాలెస్ నిర్మాణం కోసం కొనుగోలు చేసిన భూమి విలువ ప్రకారం చూస్తే.. దామినేని శ్రీనివాసరావుకు గ్రామకంఠం కింద 1.28 ఎకరాలను మినహాయింపు ఇవ్వడం ద్వారా రూ.4.64 కోట్ల లబ్ధి చేకూరింది. తమ పొగాకు బ్యారెన్ ఉన్న ఐదారు సెంట్ల భూమిని గ్రామకంఠం కింద మినహాయింపు ఇవ్వాలని కోరితే దాన్ని బుట్టదాఖలు చేసి.. దామినేని శ్రీనివాసరావుకు మాత్రం 1.28 ఎకరాల భూమిని గ్రామకంఠం కింద ఏ ప్రాతిపదికన మినహాయింపు ఇచ్చారంటూ ప్రభుత్వాన్ని రాజధాని రైతులు నిలదీస్తున్నారు.
రైతు అర్ధించినా ఒత్తిడి చేసి ప్రాణం తీశారు..
మందడం గ్రామానికి చెందిన ఆలూరి రంజిత్‌కుమార్‌ది 25 ఎకరాల రైతు కుటుంబం. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో భూసమీకరణ కింద సీఆర్‌డీఏకు తమ భూములు అప్పగించేశారు. తన ఇంటికి సమీపంలో ఉన్న భూమి.. అందులో నిర్మించుకున్న అమ్మవారి ఆలయాన్ని గ్రామకంఠంగా పరిగణిస్తూ భూసమీకరణ నుంచి మినహాయింపు ఇవ్వాలని అనేక మార్లు మంత్రులు, సీఆర్‌డీఏ అధికారులు, జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీకి విన్నవించుకున్నారు. కానీ.. వాటికి స్పందన లేకపోవడం.. మరో వైపు భూసేకరణ, వివిధ రకాల ఒత్తిళ్లకు తాళలేక ఆలూరి రంజిత్‌కుమార్ ప్రాణాలు కోల్పోయారని రైతులు చెబుతున్నారు.
అర్హత ఉన్నా మినహాయింపు ఇవ్వరా?
రాజధాని ప్రాంతంలో తమకు అర్హత ఉన్నప్పటికీ తమ స్థలాన్ని గ్రామకంఠాలుగా పరిగణించలేదంటూ రైతులు ఆందోళన బాటపట్టారు. ఆందోళన తీవ్రరూపం దాల్చుతుండటం.. మలి విడత భూసమీకరణకు రైతులు భూములు ఇచ్చేందుకు మొగ్గుచూపకపోవడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. గుంటూరు జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో గ్రామకంఠం కింద తమకు మినహాయింపు ఇవ్వాలని కోరుతున్న రైతుల సమస్యల పరిశీలనకు కమిటీని నియమిస్తూ జనవరి 23న ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కమిటీకి తమ స్థలాల్ని గ్రామకంఠాలుగా పరిగణించి భూసమీకరణ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ 698 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించిన ఆ కమిటీ 17 మందికి మాత్రమే గ్రామకంఠం కింద మినహాయింపు ఇచ్చేందుకు అర్హత ఉందని తేల్చింది. దీనిపై రాజధాని రైతులు మండిపడుతున్నారు.
టీడీపీ నేతలు, కార్యకర్తలు, ముడుపులు ఇచ్చిన వారికైతే ఒక న్యాయం.. తమకో న్యాయమా అంటూ నిలదీస్తున్నారు. మందడంలో ఆలూరి రంజిత్‌కుమార్ అనే రైతు గ్రామకంఠం అంశానికి సంబంధించి.. ఆ భూమిలో నిర్మించిన అమ్మవారి ఆలయానికి సంబంధించి భూసమీకరణ నుంచి మినహాయింపు ఇవ్వాలని మంత్రులు, సీఆర్‌డీఏ అధికారులు, జాయింట్ కలెక్టర్ అధికారులను కోరారని.. వారు దానికి స్పందించకపోవడంతో మనోవ్యథకు గురై మరణించాడని రైతులు చెబుతున్నారు.


