సాయికుమార్, వెంకటరావు, ఏడుకొండలు
సీనియర్ అధికారి ఐడీతో భూ రికార్డుల తారుమారు
ప్రభుత్వ అనుమతులు లేకుండానే డేటాబేస్‌లో మార్పులు
30 రికార్డుల్లో అక్రమంగా మార్పులు
నలుగుర్ని అరెస్ట్ చేసిన సీఐడీ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ భూ రికార్డుల భద్రతకే సవాల్ విసురుతూ వెబ్‌ల్యాండ్‌లో డేటాబేస్ లాగిన్ లూటీ కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్‌ఐసీ) సీనియర్ అధికారి లాగిన్‌ను ఉపయోగించి భూ రికార్డులను తారుమారు చేసిన వ్యవహారంపై ఏపీ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్‌ఏ) నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నలుగురు నింతులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు.
పేర్లు మార్చి..
ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో నాలుగు భూ పార్శిళ్లకు సంబంధించిన 6.55 ఎకరాల రికార్డుల(డేటాబేస్)ను ప్రభుత్వ అనుమతి లేకుండా మార్పులు చేసినట్టు ప్రాథమికంగా గుర్తించారు. తహసీల్దార్ కార్యాలయ రికార్డుల్లో ఎలాంటి మ్యుటేషన్ ప్రొసీడింగ్స్, మంజూరు ఉత్తర్వులు లేకుండానే వెబ్‌ల్యాండ్‌లో కొత్త పట్టాదారుల పేర్లు ప్రత్యక్షమైనట్టు సీఐడీ గుర్తించింది. ఇండ్లచెరువు, పడమర లక్ష్మీపురం గ్రామాలకు చెందిన నాలుగు భూముల్లో ఈ అక్రమ మార్పులు జరిగినట్టు కేసు నమోదు చేసింది.
భూ రికార్డుల్లో మార్పులు చేయించుకోవాలనుకున్న వారిని గుర్తించడం నుంచి డేటాబేస్‌లో నేరుగా మార్పులు చేయడం వరకు ఒక పద్ధతి ప్రకారం నెట్‌వర్క్ పనిచేసినట్టు సీఐడీ తెలిపింది. విజయవాడ ఎన్‌ఐసీలో ఔట్‌సోర్సింగ్ వెబ్‌ల్యాండ్ జూనియర్ డెవలపర్‌గా పనిచేస్తున్న సాయికుమార్ సీనియర్ అధికారి జీవీఎస్‌ఆర్ శర్మకు తెలియకుండా లాగిన్‌ను అక్రమంగా ఉపయోగించి సాధారణ దరఖాస్తు, పరిశీలన, రెవెన్యూ ఆమోద ప్రక్రియలను దాటవేసి డేటాబేస్‌లో నేరుగా మార్పులు చేసినట్టు సీఐడీ పేర్కొంది. ఇందుకు సంబంధించి రూ.50 వేలు, రూ.25 వేల డిజిటల్ చెల్లింపుల ఆధారాలను కూడా సేకరించింది.
ఈ నెట్‌వర్క్ ద్వారా దాదాపు 30 మంది తమ వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో మార్పులు చేయించుకున్నట్టు దర్యాప్తులో వెల్లడైనట్లు సీఐడీ తెలిపింది. ఇప్పటివరకు సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలోని 30 భూమి ప్లాట్లను పరిశీలన కోసం గుర్తించింది. రికార్డు మార్పు కోసం ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు వసూలు చేయగా.. మొత్తం లావాదేవీల విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసింది.
ఈ అక్రమాలపై పూర్తిస్థాయి, లబ్ధిదారుల వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో వడ్లమూడి ఏడుకొండలు, రంగయ్యగారి సాయికుమార్, వేముల వెంకటరావు అలియాస్ వెంకట్, షేక్ బాషాలను నిందితులుగా గుర్తించి సీఐడీ అరెస్ట్ చేసింది. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, డిజిటల్ చెల్లింపుల వివరాలు, భూమి సమాచారం, ఆధార్ చిత్రాలు, అడంగల్ వివరాలతో కూడిన డిజిటల్ పత్రాలను సీఐడీ స్వాదీనం చేసుకుంది.


