వాషింగ్టన్: అమెరికాకు ఇరాన్ నుంచి ముప్పు గణనీయంగా పెరిగిందని యూఎస్ జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ జే క్లేటన్ వెల్లడించారు. అమెరికా లోపల, వెలుపల ఇరాన్‌కు సంబంధించిన ప్రాణాంతక కుట్రలు ఎక్కువయ్యాయని హెచ్చరించారు. బుధవారం అమెరికా ప్రతినిధుల సభ హోంల్యాండ్ సెక్యూరిటీ కమిటీ నిర్వహించిన విచారణలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమ పౌరులపై ఇరాన్‌కు చెందిన వ్యక్తులు దాడులకు కుట్రలు పన్నుతున్నారని, వాటిని గుర్తించడం, అడ్డుకోవడం, ఎదుర్కోవడంపై అమెరికా దృష్టి సారించిందని తెలిపారు.
అమెరికాలో డర్టీ బాంబు పేల్చేందుకు ఇరాన్ కుట్ర పన్నుతోందంటూ వచ్చిన వార్తలపై ప్రశ్నించగా క్లేటన్ స్పందించారు. అయితే నిఘా సమాచారానికి సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు. ఆన్‌లైన్ ద్వారా తీవ్రవాద భావజాలం వ్యాప్తి చెందడం కూడా ప్రమాదకరమని పేర్కొన్నారు. విదేశీ తీవ్రవాద నెట్‌వర్క్‌లు అమెరికాలో నివసిస్తున్న వ్యక్తులపై ప్రభావం చూపుతున్నాయని, ఈ ముప్పు ఊహాజనితం కాదని, వాస్తవమని స్పష్టం చేశారు.
అయితే ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ క్రిస్టోఫర్ రైయా మరో కోణాన్ని వివరించారు. దాడులకు సంబంధించిన సమాచారం అందినంత మాత్రాన వాటిని అమలు చేసే సామర్థ్యం నిందితులకు ఉందని అర్థం కాదన్నారు. కొన్ని నివేదికలు కేవలం ప్రణాళికల స్థాయిలోనే ఉన్నాయని, అయినప్పటికీ వాటిని తేలిగ్గా తీసుకోవడం లేదని చెప్పారు.
ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీర్, అమెరికా సెంట్రల్ కమాండ్ అధిపతి అడ్మిరల్ బ్రాడ్ కూపర్ బుధవారం టెల్ అవీవ్‌లో సమావేశమయ్యారు. మధ్యప్రాచ్య పరిణామాలు, భద్రతాపరమైన సవాళ్లు, ఇరు దేశాల సైనిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ఈ సమావేశంలో ఇజ్రాయెల్ మొసాద్ చీఫ్ రోమన్ గోఫ్మన్ కూడా పాల్గొన్నారు.
మరోవైపు ఇరాన్‌పై తిరిగి సైనిక చర్యలు చేపట్టే అంశంపై అమెరికా, ఇజ్రాయెల్ చర్చిస్తున్నాయి. ఇరాన్ బహ్రెయిన్‌పై ఈ వారంలో పలుమార్లు విఫల దాడులకు ప్రయత్నించిన నేపథ్యంలో, మంగళవారం అమెరికా ఖేష్మ్ ద్వీపంపై దాడి చేసింది. దీనిని ఆత్మరక్షణ చర్యగా అమెరికా వర్గీకరించింది.
ఇదీ చదవండి: ఇమ్రాన్‌ఖాన్‌కు బిలావల్ మద్దతు!


