శంకర నేత్రాలయ సేవా కార్యక్రమాలకు సియాటెల్‌లో విశేష స్పందన | Sankara Nethralaya USA musical events in Seattle | Sakshi
Sakshi News home page

శంకర నేత్రాలయ సేవా కార్యక్రమాలకు సియాటెల్‌లో విశేష స్పందన

Nov 18 2026 12:08 PM | Updated on Nov 18 2026 12:08 PM

Sankara Nethralaya USA musical events in Seattle

అంధత్వ నివారణే లక్ష్యంగా, గ్రామీణ భారతదేశంలోని నిరుపేదలకు నాణ్యమైన కంటి వైద్య సేవలను అందిస్తున్న శంకర నేత్రాలయ సేవా కార్యక్రమాలకు అమెరికాలోని సియాటిల్ తెలుగు భారతీయ సమాజం మరోసారి అండగా నిలిచింది.

శంకర నేత్రాలయ యూఎస్ఏ ఆధ్వర్యంలో అక్టోబర్ 31వ తేదీ శనివారం సాయంత్రం వాషింగ్టన్ రాష్ట్రంలోని బెల్లేవ్యూ నగరంలో ఉన్న వాసా పార్క్ రిసార్ట్‌లో నిర్వహించిన సంగీత విభావరి ఘనంగా జరిగింది. సుమారు 80 మంది అతిథులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో 45 వేల అమెరికన్ డాలర్ల విరాళాలు సేకరించడం విశేషం.

ముఖ్యంగా ఈ వేడుకలో ప్రముఖ గాయకులు చెన్నైకి చెందిన రాము, అంజనా సౌమ్య తమ మధుర గానంతో ప్రేక్షకులను అలరించారు. సంగీత మాధుర్యానికి సేవా సంకల్పం తోడవడంతో కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. 

మూడు గ్రామాల్లో కంటి వైద్య శిబిరాలకు చేయూత
ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన 45 వేల డాలర్ల విరాళాలతో శంకర నేత్రాలయ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU), అడాప్ట్-ఎ-విలేజ్ కార్యక్రమాల ద్వారా మూడు గ్రామాల్లో కంటి వైద్య శిబిరాలను నిర్వహించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు అందుబాటులో లేని నిరుపేదలకు కంటి పరీక్షలు, అవసరమైన చికిత్సలు అందించి, వారి జీవితాల్లో వెలుగులు నింపడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం.

ఈ సేవా కార్యక్రమానికి సుహాగ్ గండికోట, నందకిశోర్ గాజుల, రామ్ కొట్టి ప్రధాన దాతలుగా నిలిచి ఉదారంగా విరాళాలు అందించారు. అలాగే WATS, WATA, WAIA, SWECHA సంస్థలు సంయుక్తంగా 5 వేల డాలర్ల విరాళాన్ని ప్రకటించి తమ సామాజిక బాధ్యతను చాటుకున్నాయి.

కాగా, ఈ సంగీత విభావరిని విజయవంతంగా నిర్వహించిన శంకర నేత్రాలయ యూఎస్ఏ సియాటిల్ చాప్టర్ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ట్రస్టీలు సోమ జగదీశ్ పెతకంశెట్టి, వినోద్ పర్నా, సీవీపీ జయపాల్ రెడ్డి దొడ్డా, చాప్టర్ ప్రతినిధులు రాజశేఖర్ చెన్నుపాటి, అనిల్ కుమార్ జామి, శశి యేజియు, మోహన్ మద్ది, అరుణ్ కుమార్ అనపర్తి కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.

అదేవిధంగా శంకర నేత్రాలయ ప్రధాన బృంద సభ్యులు బాలరెడ్డి ఇందుర్తి, శ్యామ్ అప్పాలి, వంశీకృష్ణ ఎరువరం, మూర్తి రేకపల్లి, డాక్టర్ రెడ్డి ఊరిమిండి, రత్నకుమార్ కావుటూరు, గిరి కోటగిరి అందించిన విలువైన సహకారానికి నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే దాతలకు, సహకరించిన సంస్థలకు, ఈ వేడుకలో పాల్గొన్ని ప్రతి ఒక్కరికీ శంకర నేత్రాలయ సియాటిల్ బృందం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

ఇదీ చదవండి: దుబాయ్‌లో అనంతపురం మేయర్ చిట్లూరు రమేష్ గౌడ్‌కు ఘన సన్మానం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement