అమెరికా రాడార్‌పై ఇరాన్‌ గురి.. యూఎస్‌ ప్రతీకార మెరుపు దాడులు | US strikes Iranian missile site after Tehran Bahrain radar Incident | Sakshi
Sakshi News home page

అమెరికా రాడార్‌పై ఇరాన్‌ గురి.. యూఎస్‌ ప్రతీకార మెరుపు దాడులు

Nov 18 2026 7:16 AM | Updated on Nov 18 2026 7:16 AM

US strikes Iranian missile site after Tehran Bahrain radar Incident

వాషింగ్టన్‌: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరోసారి తీవ్రరూపం దాల్చింది. అమెరికా, ఇరాన్‌ మధ్య కాల్పుల విరమణ ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం పరస్పర దాడులు ఆగడం లేదు. తాజాగా హార్మూజ్‌ జలసంధిలో ఇరుదేశాల మధ్య మరోసారి సైనిక ఘర్షణ చోటుచేసుకుంది. బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక రాడార్‌ వ్యవస్థపై ఇరాన్‌ దాడి చేసిందన్న ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే.. అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్‌పై విరుచుకుపడ్డాయి. క్వెష్మ్‌ ద్వీపంలోని క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి.

అమెరికా సైనిక అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కార్ప్స్‌ (IRGC) క్షిపణి ప్రయోగ కేంద్రంపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. అమెరికా సిబ్బంది, సైనిక ఆస్తులపై ఇరాన్‌ దూకుడుకు ప్రతిస్పందనగానే ఈ చర్య తీసుకున్నట్లు అధికారి పేర్కొన్నారు. అయితే ఈ దాడుల్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు దెబ్బతినలేదని ఇరాన్‌ మీడియా ఓ అధికారిని ఉటంకిస్తూ వెల్లడించింది.

అమెరికా రాడార్‌పై ఇరాన్‌ గురి
అంతకుముందు బహ్రెయిన్‌లోని షేక్‌ ఇసా వైమానిక స్థావరంలో ఉన్న అమెరికా సైనిక రాడార్‌ వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ ప్రకటించింది. అమెరికా ఐదో నౌకాదళ ప్రధాన కార్యాలయం బహ్రెయిన్‌లోనే ఉంది. ఇరాన్‌ దాడిని అడ్డుకున్నామని, ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరగలేదని బహ్రెయిన్‌ వెల్లడించింది. అమెరికాతో సైనిక భాగస్వామ్యం కొనసాగించడం, షియా మత పెద్దల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై బహ్రెయిన్‌ను ఇరాన్‌ హెచ్చరించింది. తమకు వ్యతిరేకంగా అమెరికాతో కలిసి పనిచేయడం ప్రాంతీయ భద్రతకు ముప్పుగా మారుతుందని వ్యాఖ్యానించింది.

ఒకవైపు దౌత్యం.. ఇటు దాడులు
మరోవైపు యుద్ధానికి ముగింపు పలికేందుకు దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఖతార్‌, ఇరాన్‌ అధికారులు మంగళవారం చర్చలు జరిపారు. యుద్ధాన్ని ముగించేందుకు ప్రతిపాదనల మధ్య ఉన్న విభేదాలను తగ్గించే మార్గాలపై చర్చించినట్లు ఖతార్‌ అధికార ప్రతినిధి మాజెద్‌ అల్‌ అన్సారీ తెలిపారు. ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ ఒమన్‌లో పర్యటించి ఆ దేశ విదేశాంగ మంత్రితో సమావేశమయ్యారు. సముద్ర భద్రత, అంతర్జాతీయ నౌకాయానం, వాణిజ్యం, యుద్ధ తీవ్రతను తగ్గించే చర్యలపై చర్చించారు. ఒమన్‌ సుల్తాన్‌ హైతమ్‌ బిన్‌ తారిఖ్‌తోనూ సమావేశమైన అరాఘ్చీ.. యుద్ధం ముగింపు కోసం ఇరాన్‌ చేపట్టిన దౌత్య ప్రయత్నాలను వివరించారు.

బహ్రెయిన్‌పై ఇరాన్‌ హెచ్చరికలు..
బహ్రెయిన్‌లో ఇటీవల 64 మందికి, వారిలో ఎక్కువమంది షియా మత పెద్దలకు, ఇరాన్‌తో కుమ్మక్కై దేశ భద్రతకు ముప్పు కలిగించారనే ఆరోపణలపై జీవిత ఖైదు విధించారు. ఈ తీర్పును ఇరాన్‌ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఆరోపణలు నిరాధారమని పేర్కొంది. బహ్రెయిన్‌ అమెరికా భద్రతా వ్యవస్థలో భాగస్వామిగా కొనసాగడం, ఇరాన్‌పై దాడులకు సహకరించడం వంటి అంశాలను ఇరాన్‌ తప్పుబడుతోంది. ఈ విధానాలు కొనసాగితే ప్రాంతీయ భద్రతలో బహ్రెయిన్‌ మనుగడకే ముప్పు ఏర్పడుతుందని ఐఆర్‌జీసీ ప్రతినిధి హొస్సేన్‌ మొహెబ్బీ హెచ్చరించారు.

ఇదీ చదవండి: హసీనా అప్పగింతపై బిగ్‌ ట్విస్ట్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement