స్వరాల విందుతో అలరించిన ‘టుగెదర్‌ రీలోడెడ్‌’ | Shivamani Mandolin Srinivas Music Tribute Together Reloaded Frisco USA | Sakshi
Sakshi News home page

స్వరాల విందుతో అలరించిన ‘టుగెదర్‌ రీలోడెడ్‌’

Nov 17 2026 9:34 AM | Updated on Nov 17 2026 9:54 AM

Shivamani Mandolin Srinivas Music Tribute Together Reloaded Frisco USA

అమెరికా, టెక్సాస్, ఫ్రిస్కో నగరంలో శనివారం శుభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ‘టుగెదర్ రీలోడెడ్’ (Together Reloaded) సంగీత విభావరి ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ప్రపంచ ప్రఖ్యాత సంగీత విద్వాంసులు, స్థానిక యువ సంగీత కళాకారులు కలిసి అందించిన ఈ అపూర్వ సంగీత కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. ప్రముఖ మాండలిన్ విద్వాంసుడు, దివంగత సంగీత సామ్రాట్ మాండలిన్ యు. శ్రీనివాస్ అపూర్వ సంగీత ప్రతిభను, ఆయన సంగీత వారసత్వాన్ని స్మరించుకుంటూ ఈ ప్రత్యేక సంగీత నివాళి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫ్రిస్కో ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ (Frisco ISD) నూతనంగా నిర్మించిన అత్యాధునిక విజువల్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్ (VPAC) ఈ సంగీత మహోత్సవానికి వేదికగా నిలిచింది.

ప్రపంచ ప్రఖ్యాత సంగీత విద్వాంసుల అద్భుత ప్రదర్శన - ఈ సంగీత విభావరిలో ప్రపంచ ప్రఖ్యాత డ్రమ్మర్ పద్మశ్రీ శివమణి, మాండలిన్ రాజేష్, స్వామినాథన్ సెల్వగణేష్, ప్రవీణ్ నారాయణ్, బాలు రాజేంద్ర కురుప్, ముద్దు పాయ్, ప్రియ వసంత్ తదితర ప్రముఖ సంగీత కళాకారులు పాల్గొన్నారు.వీరితోపాటు ఫ్రిస్కో పరిసర ప్రాంతాలకు చెందిన వివిధ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 25 మంది యువ సంగీత కళాకారులు వేదికను పంచుకోవడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కర్ణాటక, హిందుస్థానీ, ప్రపంచ సంగీతం, ఫ్యూజన్ సంగీతం, ప్రజాదరణ పొందిన సినీ సంగీతం వంటి విభిన్న సంగీత ప్రక్రియల సమ్మేళనంగా ఈ కార్యక్రమం సాగింది.

‘గిరిరాజ సుత తనయ’, ‘గీత గోవిందం’ చిత్రంలోని ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే’, ‘దళపతి’ చిత్రంలోని ‘రాకమ్మ’, హాలీవుడ్ చిత్రాలు ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’, ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ తదితర ప్రసిద్ధ సంగీత స్వరాలను కళాకారులు అద్భుతంగా ఆవిష్కరించారు. ముఖ్యంగా ‘శంకరాభరణం’ చిత్రంలోని ‘శంకరా నాదశరీరాపరా’ గీతాన్ని వాద్యబృందం సమష్టిగా ప్రదర్శించిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. పద్మశ్రీ శివమణి అందించిన ప్రత్యేక డ్రమ్స్ సోలో ప్రదర్శన, ఇతర తాళవాద్య కళాకారులతో కలిసి నిర్వహించిన జుగల్‌బందీ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. సంగీత లయలకు అనుగుణంగా ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.

ప్రముఖ ప్రవాస భారతీయ నాయకుడు డా. ప్రసాద్ తోటకూరకు “కమ్యూనిటీ ఇమ్పాక్టర్” అవార్డ్ ప్రదానం: గత మూడు దశాబ్దాలగా డా. ప్రసాద్ తోటకూర సమాజానికి చేస్తున్న విశిష్ట సేవలకు, మానవతా దృక్పథంతో చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు, భారతీయ సంగీత, సాహిత్య, నృత్య కళల ప్రోత్సాహకునిగా, అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారక స్థలిని నిర్మించిన కార్యదక్షత, అందరినీ కలుపుకు పోయే తత్వం, సమర్థవంతమైన నాయకత్వాన్ని గుర్తిస్తూ శుభం ఫౌండేషన్ ప్రత్యేకంగా సత్కరించి దుశ్శాలువా, సన్మాన జ్ఞాపికలతో ఈ గౌరవాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా డా. ప్రసాద్ తోటకూర తనకు జరిగిన గౌరవానికి నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ “లలిత కళలు, విద్య, వైద్య ఆరోగ్య రంగాల్లో శుభం ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఇతర సంస్థలకు ప్రేరణ అన్నారు.”ఫ్రిస్కో ఐఎస్డీ మాజీ సూపరింటెండెంట్ డా. మైక్ వాల్డ్రిప్ విద్యారంగానికి అందించిన విశిష్ట సేవలకు, దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గుర్తింపుగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డా. వాల్డ్రిప్ మాట్లాడుతూ, సమాజ అభివృద్ధిలో సమర్థవంతమైన నాయకత్వం అత్యంత కీలకమని, మంచి నాయకత్వం సమాజంలో సానుకూల మార్పులు తీసుకురాగలదని పేర్కొన్నారు.

శుభం ఫౌండేషన్ సేవలను ప్రశంసించిన ఫ్రిస్కో మేయర్: ఈ సంగీత కార్యక్రమానికి 800 మందికి పైగా సంగీతాభిమానులు హాజరయ్యారు. ఫ్రిస్కో నగర మేయర్ మార్క్ హిల్ మాట్లాడుతూ, సమాజం నుంచి పొందిన ప్రయోజనాలను తిరిగి సమాజానికి అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. సమాజసేవలో ముందుండి నాయకత్వం వహిస్తున్న శుభం ఫౌండేషన్‌ సంస్థ అధ్యక్షుడు గోపాల్ పోణంగిని ప్రత్యేకంగా అభినందించారు.

యువ సంగీత కళాకారులకు అరుదైన అవకాశం: ప్రపంచ ప్రఖ్యాత సంగీత విద్వాంసులతో కలిసి యువ కళాకారులు వేదికను పంచుకునే అవకాశాలను కల్పించడం శుభం ఫౌండేషన్ ప్రధాన లక్ష్యాలలో ఒకటి. ఈ కార్యక్రమంలో ఫ్రిస్కో పరిసర ప్రాంతాలకు చెందిన 25 మంది యువ సంగీత కళాకారులు పాల్గొన్నారు. సంగీత బృంద నిర్వాహకురాలు (కండక్టర్): అపూర్వ మామిడెన్న; వయోలిన్: శంకర్ ఉమామహేష్, తేజస్విని జగన్నాథన్, అద్వైత్ గణేష్, హృద్య గరిమెళ్ల, సంజయ్ వెంకటేశన్, శ్రీ భార్గవ పుసులూరి, లక్ష్మీ మయూఖ, శ్రుతి కోటంరాజు, అనిక దొప్పలపూడి, సింధుజ కోడెబోయిన; వయోలా: ధన్విన్, దీక్ష, శ్రేయాంశ్, సంజయ్, కేదార్, అంకిత్; సెల్లో: ఇనియా కార్తిక్, ఓజస్ ధార్వాడ; హార్ప్: అదితి బట్టిప్రోలు; ఫ్లూట్: సింధు గుడిమెళ్ల, సంస్కృతి జంధ్యాల; క్లారినెట్: రాఘవి అర్ల; బాస్: శ్రావ్య అరవ, అదిత్రి శంకరనారాయణన్; కీబోర్డ్: సూర్య కైలాసం; గాత్ర సంగీతం: ప్రియ వసంత్.

శుభం ఫౌండేషన్ సేవా కార్యక్రమాల వివరణ: శుభం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గోపాల్ పొనంగి అతిథులకు, సంగీత కళాకారులకు, ప్రేక్షకులకు స్వాగతం పలికి తాము చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలను వివరించారు. కళలను ప్రోత్సహించడం, క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించడం, ఫ్రిస్కో ఐఎస్డీ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడం ప్రముఖమైనవి అన్నారు. 
కార్యక్రమ వ్యాఖ్యాత అనీషా పోణంగి తన చక్కటి వ్యాఖ్యానంతో సంగీత విభావరికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పలువురు ప్రముఖుల హాజరు: ఈ కార్యక్రమానికి ఉత్తర టెక్సాస్ ప్రాంతానికి చెందిన పలువురు ప్రముఖులు, సామాజిక సంస్థల ప్రతినిధులు, విద్యారంగ నాయకులు హాజరయ్యారు.

వారిలో రావు కల్వల (మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్), డాక్టర్ ప్రకాశరావు వెలగపూడి (GHHF), రఘువీర్ బండారు (TPAD), మాజీ పార్లమెంట్ సభ్యుడు ఆత్మచరణ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర అమెరికా పెట్టుబడుల ప్రధాన అనుసంధానకర్త సతీష్ మండువ, ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ అధ్యక్షుడు మహేంద్రరావు, శ్రీలత సూరి, IFAA DFW అధ్యక్షురాలు రాధిక కొడెల, రేడియో సురభి ప్రతినిధి రాజేశ్వరి ఉదయగిరి, టీవీ9 ప్రతినిధి వెంకట్ ములుకుట్ల, శ్రీని గుర్రపు (YEC), డాక్టర్ గారెట్ జాక్సన్ (Frisco ISD), మాజీ సిటీ కౌన్సిల్ సభ్యుడు, సైనిక సేవానుభవం కలిగిన జాన్ కీటింగ్ తదితరులు ఉన్నారు. అలాగే ఫ్రిస్కో ఐఎస్డీ ట్రస్టీలు సురేష్ మండువ, రెనీ శాంపిల్, షెర్రీ సలాస్, ఫ్రిస్కో సిటీ కౌన్సిల్ సభ్యులు ఆన్ ఆండర్సన్, లారా రమ్మెల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

సంగీత కళాకారులకు ఘన సన్మానం: శుభం ఫౌండేషన్ డైరెక్టర్లు, ప్రధాన కార్యనిర్వాహక బృంద సభ్యులు మధుమతి వైశ్యరాజు, రాజా వైశ్యరాజు, విజయశ్రీ పోణంగి, మహేష్ చొప్పా తదితరులు సంగీత కళాకారులను ఘనంగా సత్కరించారు. స్టేజ్ మేనేజర్, కార్యక్రమ డైరెక్టర్ విజి అయ్యంగార్ కార్యక్రమం సజావుగా జరిగేలా సమర్థవంతంగా నిర్వహించారు. శుభం ఫౌండేషన్ ప్రధాన బృంద సభ్యుడు రవి భట్టిప్రోలు మాట్లాడుతూ, మాండలిన్ శ్రీనివాస్ సంగీతం నేటి యువతరం సంగీత కళాకారులపై చూపుతున్న ప్రభావాన్ని వివరించారు. సీమారావు సంగీత ప్రదర్శనలకు అనుగుణంగా దృశ్యరూప స్లైడ్లను రూపొందించి కార్యక్రమానికి సహకరించారు.

ఈ సంగీత మహోత్సవాన్ని విజయవంతం చేయడానికి శ్రీకుమార్ గోమఠం, జ్యోత్స్న కొండపులి, మనోజ్ఞ ఆలమూరు, బ్రాడ్ షార్ప్, సుదర్శన్ అయ్యంగార్, రాకేష్ చెరాల, శిరీష గోమఠం, ఆనంద్ చెల్లప్ప, కోషి శామ్యూల్, సతీష్ కంది, భాస్కర్ ఆలూరు, మాలిని రత్నం, నాగరాజు నలజుల, గణేష్ నలజుల తదితర స్వచ్ఛంద సేవకులు ఎన్నో గంటలపాటు శ్రమించారు. కార్యక్రమం ఆద్యంతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సంగీత కళాకారుల ప్రతిభకు ప్రేక్షకులు హర్షధ్వానాలతో అభినందనలు తెలిపారు.

శుభం ఫౌండేషన్ గురించి: టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో నగరంలో 2018లో స్థాపించబడిన శుభం ఫౌండేషన్ అమెరికాలోని 501(c)(3) పన్ను మినహాయింపు హోదా కలిగిన లాభాపేక్షలేని సేవా సంస్థ. ఈ సంస్థ ప్రధానంగా కళల ప్రోత్సాహం, విద్యార్థులకు ఆర్థిక సహాయం, ఆరోగ్య పరిరక్షణ, క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

ఫ్రిస్కో ఐఎస్డీలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడంతోపాటు, టెక్సాస్‌లోని రిచర్డ్‌సన్ నగరంలో ఉన్న GDAS క్యాన్సర్ క్లినిక్ కార్యకలాపాలకు, క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలకు సంస్థ సహకారం అందిస్తోంది. సంగీతం ద్వారా తరాలను అనుసంధానిస్తూ, కళల ద్వారా సమాజానికి సేవలందిస్తూ శుభం ఫౌండేషన్ నిర్వహించిన ‘టుగెదర్ రీలోడెడ్’ సంగీత మహోత్సవం ప్రేక్షకుల మదిలో చిరస్మరణీయ అనుభూతిని మిగిల్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement