అమితాబ్‌తో పాటు, అభిషేక్‌కు కూడా బెదిరింపుల కలకలం | Amitabh Bachchan Abhishek Receive Death Threats From Gangster Goldy Dhillon | Sakshi
Sakshi News home page

అమితాబ్‌తో పాటు, అభిషేక్‌కు కూడా బెదిరింపుల కలకలం

Nov 16 2026 5:41 PM | Updated on Nov 16 2026 5:59 PM

Amitabh Bachchan Abhishek Receive Death Threats From Gangster Goldy Dhillon

సాక్షి, ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్  బతికి బయటపడ్డాం అంటూ  సోషల్‌ మీడియాలో అలా ప్రకటించారో లేదో మరో వార్త సంచలనం రేపుతోంది. అమితాబ్ బచ్చన్‌తోపాటు అభిషేక్ బచ్చన్‌ను కూడా చంపేస్తామంటూ ఒక గ్యాంగ్‌నుంచి వచ్చిన హత్యాబెదిరింపులు కలకలం రేపుతున్నాయి. గ్యాంగ్‌స్టర్ గోల్డీ ధిల్లాన్ నుండి హత్య బెదిరింపులు వచ్చినట్టు తెలుస్తోంది. 

ఇటీవల ఢిల్లీ పోలీసులు తన అనుచరులిద్దరినీ అరెస్టు చేసినప్పటికీ, ముంబైలో  అమితాబ్‌ను మట్టుబెట్టాలనే తమ ప్లాన్‌ను మార్చలేరని  సోషల్ మీడియాలో  హెచ్చరించాడు. వికాస్ ఠాకూర్, దీపక్ సింగ్‌ల అరెస్టుతో తమ ప్రణాళికలో ఎలాంటి మార్పు ఉండదని, ముంబైలో తమ ముఠాకు చెందిన దాదాపు 200 మంది సిద్ధంగా ఉన్నారని ఆ గ్యాంగ్‌స్టర్ హెచ్చరించాడు. సిక్కు సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని కూడా ఆ పోస్ట్‌లో బెదిరిస్తూ, అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్ పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఎన్ని భద్రతా ఏర్పాట్లు చేసుకున్నా అమితాబ్, అభిషేక్‌లను కాల్చి చంపుతామని ఆ పోస్ట్‌లో హెచ్చరించాడు. "వారు ఎన్ని బుల్లెట్‌ప్రూఫ్ క్యాబిన్‌లు కట్టుకున్నా సరే, వారిపై కాల్పులు జరుగుతాయి" అని ఆ పోస్ట్‌లో రాశాడు. 

ఇదీ చదవండి: 14 ఏళ్ల బంధానికి ముగింపు : మంత్రి భార్య ప్రకటన


1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లను తన పోస్ట్‌లో ప్రస్తావించిన ధిల్లాన్, ఆ హింసకు కారణమైన వారిని ఎప్పటికీ క్షమించబోమని అన్నాడు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే, సిక్కు సమాజానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేసే వారిని బాధ్యులను చేస్తామని అతను పేర్కొన్నాడు.

కాగా ముంబైలోని అమితాబ్ బచ్చన్ నివాసం 'జల్సా' వెలుపల కాల్పులు జరిపే కుట్రలో భాగస్వాములని అనుమానిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన ఇద్దరు షూటర్లను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్టు నేపథ్యంలో ఈ బెదిరింపులొచ్చాయి. వీరిని  పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన వికాస్ ఠాకూర్ అలియాస్ విక్కీ , తార్న్ తరణ్‌కు చెందిన దీపక్ సింగ్ అలియాస్ దీప్‌గా గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం, ఢిల్లీకి చెందిన ఒక వ్యాపారవేత్తను కాల్చి చంపే మరో కుట్రను కూడా   ఈ సందర్బంగా ఛేదించినట్లు తెలుస్తోంది.   ఢిల్లీలో వ్యాపారవేత్తపై కాల్పులు జరిపే బాధ్యతను వికాస్ ఠాకూర్‌కు అప్పగించగా, ఆ పని కోసం అతను ముంబై నుండి వచ్చాడని, దీపక్ సింగ్ తర్వాత అతనితో కలవాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: రూ. 12 లక్షల సంపాదన చాలు : హౌస్ హస్బెండ్‌గా ఉండిపోతా!
గత నెల రోజుల్లో అమితాబ్ బచ్చన్ ముంబై నివాసం 'జల్సా'కు మూడు వేర్వేరు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో   నవంబర్ 1న జల్సా వెలుపల అభిమానులకు అభివాదం చేసే సమయంలో అమితాబ్‌ బుల్లెట్‌ప్రూఫ్ అద్దాల వెనుక నిలబడి కనిపించారు.సాధారణంగా అభిమానులకు స్పష్టంగా కనిపించేందుకు చక్రాలు అమర్చిన ఒక పీఠంపై నిలబడి అభివాదం చేయడం అలవాటు. కానీ ఇటీవల ఆ పీఠానికి మూడు వైపులా బుల్లెట్‌ ప్రూఫ్‌ అద్దాలను అమర్చుకుని మరీ ఫ్యాన్స్‌ను పలకరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement