ముంబై: ముంబైలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరుపుతామంటూ గురువారం ఓ బెదిరింపు ఈ-మెయిల్ రావడంతో కలకలం రేగింది. ముంబై విమానాశ్రయం, మేయర్ కార్యాలయం, బాలీవుడ్ నటుడు, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నివాసం ‘జల్సా’, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) శాఖలను లక్ష్యంగా చేసుకుని ఈ బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఉదయం 10.52 గంటలకు వచ్చిన ఈ-మెయిల్‌లో మధ్యాహ్నం 1.11 గంటలకు బ్యాంకులో పేలుడు జరుగుతుందని పేర్కొన్నారు. అందులో నవంబర్ 27, డిసెంబర్ 31 తేదీలను ప్రస్తావిస్తూ.. ఈ బాంబు బెదిరింపులు చేశారు. మహాలక్ష్మి స్టేడియం, ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పలు కీలక ప్రాంతాలు కూడా వారి టార్గెట్‌గా ఉన్నట్టు అందులో పేర్కొన్నారు. ఖలిస్థాన్, ‘ఖలిస్థాన్ నేషనల్ ఆర్మీ’ అనే సంస్థ పేర్లను కూడా ఈ సందేశంలో ప్రస్తావించారు.
అయితే ఈ బెదిరింపుల వెనుక ఉన్నది ఎవరు? ఈ-మెయిల్‌లో పేర్కొన్న హెచ్చరికలు నిజమైనవేనా? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇటీవల అమితాబ్ నివాసానికి వచ్చిన బెదిరింపులు, బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌కు సంబంధించిన కాల్పుల ఘటన నేపథ్యంలో ముంబైలోని కీలక ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇదీ చదవండి: డీలిమిటేషన్ బిల్లుపై కీలక అడుగు


