గాడిదల సంతలో అమ్మకానికి బాలీవుడ్ స్టార్స్‌ | Donkey Named Chunky Pandey sell Rs 72000, no one buy Amitabh | Sakshi
Sakshi News home page

గాడిదల సంతలో అమ్మకానికి బాలీవుడ్ స్టార్స్‌

Nov 10 2026 10:52 AM | Updated on Nov 10 2026 11:00 AM

Donkey Named Chunky Pandey sell Rs 72000, no one buy Amitabh

చిత్రకూట్‌: బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, మిథున్ చక్రవర్తి వంటి స్టార్ హీరోలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ‘చిత్రకూట్‌’లో మాత్రం సీన్ రివర్స్ అయింది. అక్కడ అమితాబ్‌కు అంత డిమాండ్ లేదు.. షారుఖ్‌కూ అంతగా గిరాకీ రాలేదు. చివరకు అందరినీ వెనక్కి నెట్టి ‘చంకీ పాండే’ బంపర్ హిట్ కొట్టాడు! అదీ వెండితెరపై కాదు.. గాడిదల సంతలో! ఏకంగా రూ.72 వేల ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో బాలీవుడ్ స్టార్ల పేర్లతో వచ్చిన గాడిదల్లో ఈసారి చంకీ పాండేనే అసలైన సూపర్ స్టార్‌గా నిలిచాడు.

మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని చిత్రకూట్‌లో దీపావళి మరుసటి రోజు ఈ వింతైన సంత నిర్వహించారు. మందాకిని నది ఒడ్డున ఉదయం ఆరు గంటలకే ప్రారంభమైన ఈ చారిత్రక గాడిదల మేళాకు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు తరలివచ్చారు. గాడిదలను అమ్మకానికి తీసుకొచ్చారు. కొనుగోలుదారులు వాటి కాళ్లు, కదలికలు,  సామర్థ్యాన్ని పరిశీలిస్తూ బేరసారాలు సాగించారు.

ఈ సంతలో మరో ప్రత్యేకత ఏమిటంటే.. గాడిదలకు పెట్టే పేర్లు.. వ్యాపారులు తమ గాడిదలకు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, మిథున్ చక్రవర్తి, సంజయ్ కపూర్, చంకీ పాండే వంటి సినీ ప్రముఖుల పేర్లు పెడతారు. దీంతో సంతలో సినిమా స్టార్ల పేర్లు మారుమోగుతుంటాయి. అయితే ఇక్కడ అభిమానుల ఓట్లు, ఫ్యాన్ ఫాలోయింగ్ పనిచేయవు. గాడిద జాతి, ఎత్తు, పొడవు, కదలికలు, బరువు మోసే సామర్థ్యమే అసలైన అర్హతలు!

ఈసారి అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, మిథున్ చక్రవర్తి పేర్లతో ఉన్న గాడిదలు రూ.50 వేల లోపే అమ్ముడయ్యాయి. కానీ నల్లరంగులో ఉన్న చంకీ పాండే మాత్రం అందరినీ వెనక్కి నెట్టేశాడు. ఏకంగా రూ.72 వేల ధర పలికి సంతలోనే అత్యంత ఖరీదైన గాడిదగా నిలిచింది.

చిత్రకూట్‌లో ఈ గాడిదల సంతకు 200 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలన కాలం నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతున్నదని స్థానికులు చెబుతుంటారు. అప్పట్లో సైన్యానికి అవసరమైన ఆహార పదార్థాలు, ఇతర సామగ్రిని తరలించేందుకు గాడిదలు ఉపయోగించేవారని చెబుతారు. ఆ అవసరాల నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో గాడిదల కొనుగోలు, అమ్మకాల సంప్రదాయం మొదలైందని తెలుస్తున్నది.

ఇంతటి చరిత్ర ఉన్న ఈ సంతలో ఇప్పుడు వ్యాపారం అంతగా ఆశాజనకంగా లేదని వ్యాపారులు చెబుతున్నారు. కొత్త తరం యువత గాడిదల వ్యాపారంపై ఆసక్తి చూపడం లేదని, దీంతో గతంతో పోలిస్తే సంతలో సందడి తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రతి దీపావళి తర్వాత ఈ సంప్రదాయం కొనసాగుతున్నదన్నారు.

ఇదీ చదవండి: సోనియా పుస్తకం: ‘సింగ్ చేతుల్లో ప్రభుత్వం.. నా సైగల్లో కాంగ్రెస్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement