రోమ్: బాంబు బెదిరింపులు బుధవారం ఇటలీ మొత్తాన్ని కుదిపేశాయి. ఈమెయిల్ ద్వారా దాదాపు 6,300 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. వందలాది స్కూళ్ల నుంచి విద్యార్థులను ఖాళీ చేయించారు. ఇటలీతోపాటు ఐర్లాండ్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్‌లలోనూ పాఠశాలలు లక్ష్యంగా చేసుకుని బాంబు బెదిరింపు మెయిళ్లు వచ్చినట్లు సమాచారం. అయితే ఇతర దేశాల్లో పాఠశాలలను ఖాళీ చేయించలేదు.
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు పాఠశాలలకు వచ్చిన ముప్పేమీ లేదని స్పష్టం చేశారు. భయాందోళనలు సృష్టించేందుకే ఎవరో ఈ తప్పుడు బెదిరింపులకు దిగారని ఆరోపించారు. అధికారులు విచారణ చేపట్టారని తెలిపిన ఆమె ఈ అంశంపై మంత్రులతో సమావేశమవుతున్నట్లు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపిన ఆ మెయిల్‌లో ప్రధాని మెలోనీని కూడా బెదిరించినట్లు మీడియా సంస్థలు వెల్లడించాయి.
మహిళా వ్యతిరేకమైన పేరున్న, అనామక గ్రూపు నేత పేరుతో ఈ మెయిల్ వచ్చిందని, హింసాత్మక ధోరణిలో బెదిరించారని తెలిపాయి. ఇటలీ విద్యాశాఖ మంత్రి జ్యూసెప్పే వాల్డితారా ప్రకారం మొత్తం 6,300 పాఠశాలలకు బెదిరింపు ఈమెయిళ్లు రాగా భద్రతా కారణాల వల్ల కొన్నింటినీ ఖాళీ చేయించారు. ఇదేతరహా బెదిరింపులు వచ్చిన ఉత్తర ఐర్లాండ్‌లో పోలీసులు విచారణ చేపట్టగా.. స్కాట్లాండ్.. అవి బూటకపు హెచ్చరికలుగా కొట్టివేసింది. యూరప్ దేశాల్లో గత వారం విమానాలకు బాంబు బెదిరింపులు రాగా.. ఈ వారం వంతు పాఠశాలలది.


