యూరప్‌లో విమానాలకు బాంబు బెదిరింపులు  | Bomb threats have disrupted flights across Europe, forcing emergency landings | Sakshi
Sakshi News home page

యూరప్‌లో విమానాలకు బాంబు బెదిరింపులు 

Nov 6 2026 5:24 AM | Updated on Nov 6 2026 5:24 AM

Bomb threats have disrupted flights across Europe, forcing emergency landings

మిలన్‌: ఐరోపా ఖండంలో గురువారం పలు విమానాలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. ఫ్రాన్స్, ఇటలీ, బల్గేరియాలోని విమానాశ్రయాల్లో విమానాలను అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. తనిఖీలు చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యగా వాటికి సైనిక భద్రత కల్పించారు. కోపెన్‌హాగన్, డబ్లిన్, హెల్సింకి, మాడ్రిడ్, మిలన్, వార్సా వంటి నగరాల నుంచి బయలుదేరిన డజనుకు పైగా విమానాలపై బాంబు బెదిరింపులు వచ్చాయి. 

వాటిలో చాలావరకు అత్యవసర ల్యాండింగ్‌ కోసం ఇతర ఎయిర్‌పోర్టులకు మళ్లించారు. మరికొన్ని తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకున్నాయి. ఇప్పటివరకు జరిగిన తనిఖీల్లో ప్రమాదకరమైన లేదా అనుమానాస్పద పదార్థాలు ఏవీ బయటపడలేదని అధికారులు వెల్లడించారు. యూరప్‌ వ్యాప్తంగా విమాన సర్వీసులు ‘దురుద్దేశపూర్వక బూటకపు బెదిరింపుల’బారిన పడ్డాయని బ్రిటన్‌ రవాణా శాఖ కార్యదర్శి హైడీ అలెగ్జాండర్‌ బ్రిటిష్‌ తెలిపారు.

 ఇలాంటి తప్పుడు బెదిరింపులను సహించే ప్రసక్తే లేదని యూరోపియన్‌ యూనియన్‌ రవాణా కమిషనర్‌ అపోస్టోలోస్‌ జిట్జికోస్టాస్‌ హెచ్చరించారు. ఈయూ కార్యనిర్వాహక విభాగం ప్రభావిత సభ్య దేశాలతో సంప్రదింపులు జరుపుతోందని అన్నారు. యూరప్‌లో విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు ఎదురుకావడం కొత్తేమీ కాదు. కానీ, అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది. వారం రోజుల క్రితం కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement