వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో అధికార రిపబ్లికన్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అటు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, ఇటు సెనేట్‌లో ఆ పార్టీ తన పట్టును కోల్పోయింది. ప్రతిపక్ష డెమోక్రాటిక్ అభ్యర్థులు దూసుకుపోతూ.. అధికార పార్టీకి చెందిన సెనేట్ సిట్టింగ్ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు అమెరికా రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించడంతో పాటు, మరో రెండేళ్లలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలపై ఇప్పుడే తీవ్ర చర్చకు తెరలేపాయి. ఈ క్రమంలో, ప్రెసిడెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ తరఫున బరిలోకి దిగేందుకు మరో బరాక్ ఒబామా దొరికారని అమెరికన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఎవరా బరాక్ ఒబామా?
అంటే.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వయంగా మరో దఫా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారనుకుంటే పొరబడినట్లే! అచ్చం ఒబామాను తలపించే ప్రసంగ శైలి, యువతను ఆకట్టుకునే నాయకత్వ లక్షణాలతో అమెరికన్లను ఆకట్టుకుంటున్న ఆ యువ నాయకుడే.. థామస్ జోనాథన్ ఆసాఫ్
రైజింగ్ స్టార్‌గా జోనాథన్ ఆసాఫ్
తొలిసారిగా 2020-2021లో జరిగిన జార్జియా సెనెట్ రన్‌ఆఫ్ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డేవిడ్ పెర్డూపై విజయం సాధించి థామస్ జోనాథన్ ఆసాఫ్ సెనెట్‌లోకి అడుగుపెట్టారు. ఆ ఎన్నికల్లో ఆయన విజయం సాధించడం ద్వారానే డెమొక్రాట్ పార్టీ సెనెట్‌లో మెజారిటీని సాధించగలిగింది. ఇప్పుడు సెనేట్ పదవీ కాలం పూర్తవుతున్న తరుణంలో వచ్చిన ఈ మధ్యంతర ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి ఘన విజయం సాధించడంతో, అమెరికన్లు ఆయన్ని రైజింగ్ స్టార్‌గా అభివర్ణిస్తున్నారు. మరో రెండేళ్లలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థిగా జోనాథాన్ ఆసాఫ్ బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మిడ్‌టర్మ్ ఎన్నికల్లో అత్యంత పిన్న వయస్సులో సెనేట్ స్థానానికి ఆయన తిరిగి ఎన్నిక కావడం ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
ట్రంప్‌నకు ఎదురుదెబ్బ..
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీకి ఈ ఎన్నికలు అత్యంత సవాలుగా మారాయి. ముఖ్యంగా 2024 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన జార్జియా రాష్ట్రంలో, డెమొక్రాటిక్ పార్టీ తరఫున రీ-ఎలక్షన్ కోసం బరిలో నిలిచిన ఏకైక సెనేటర్ జాన్ ఆసాఫ్ కావడం గమనార్హం. రిపబ్లికన్లు ఈసారైనా ఆ సీటును కైవసం చేసుకోవాలని సర్వశక్తులు ఒడ్డినా, ఆసాఫ్ వారి వ్యూహాలను తిప్పికొట్టి అఖండ విజయం సాధించారు.
ఆయన అద్భుతమైన ప్రసంగ శైలి, యువతను ఆకట్టుకునే నాయకత్వ లక్షణాలు, కఠినమైన రాజకీయ పరిస్థితుల్లోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించే తీరును చూసిన విశ్లేషకులు ఆసాఫ్‌ను అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పోలుస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వ విధానాలకు బలమైన ప్రతిపక్ష గళంగా మారుతున్న జాన్ ఆసాఫ్, భవిష్యత్తులో అమెరికా జాతీయ రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి చేరే నాయకుడిగా ప్రశంసలు అందుకుంటున్నారు.


