లాస్ ఏంజెలెస్‌ మేయర్‌గా నిత్యా రామన్.. కేరళతో అనుబంధమిదే.. | Nithya Raman wins LA mayoral race | Sakshi
Sakshi News home page

లాస్ ఏంజెలెస్‌ మేయర్‌గా నిత్యా రామన్.. కేరళతో అనుబంధమిదే..

Nov 5 2026 10:52 AM | Updated on Nov 5 2026 11:15 AM

Nithya Raman wins LA mayoral race

లాస్ ఏంజెలెస్:  అమెరికాలోని లాస్ ఏంజెలెస్ మేయర్ ఎన్నికల్లో కేరళకు చెందిన నిత్యా రామన్ సంచలన విజయం సాధించారు. ప్రస్తుత మేయర్ కరెన్ బాస్‌ను ఓడించి,  నగర చరిత్రలో తొలి ఆసియా-అమెరికన్ మేయర్‌గా రికార్డు సృష్టించారు. కేరళలో జన్మించి అమెరికాలో స్థిరపడిన నిత్యా రామన్ అరుదైన రాజకీయ ఘనత సాధించారు. లాస్ ఏంజెలెస్ మేయర్ ఎన్నికల్లో 51.1 శాతం ఓట్లు సాధించి విజయం అందుకున్నారు. ప్రస్తుత మేయర్ కరెన్ బాస్‌కు 48.33 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. డెసిషన్ డెస్క్ హెచ్‌క్యూ ఎన్నికల అంచనాల ప్రకారం నిత్యా రామన్ విజయం ఖాయమైంది. దీంతో ఆమె లాస్ ఏంజెలెస్‌కు 44వ మేయర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ పదవిని చేపట్టనున్న రెండో మహిళగానూ గుర్తింపు పొందనున్నారు.

సిట్టింగ్ మేయర్‌కు షాక్
నిత్యా రామన్ ఎన్నికల బరిలోకి చివరి నిమిషంలో ప్రవేశించడం విశేషం. ఎన్నికలకు కొన్ని వారాల ముందు వరకు కరెన్ బాస్ తిరిగి ఎన్నిక కావాలని ఆమె మద్దతు ప్రకటించారు. అయితే అనూహ్యంగా తానే పోటీలోకి దిగి ఆమెను ఓడించారు. డెమోక్రటిక్ సోషలిస్ట్ ఉద్యమానికి చెందిన అభ్యర్థులు అనుసరించిన ప్రచార వ్యూహాలను తన ఎన్నికల ప్రచారంలో ఉపయోగించారు.

2020లోనే రాజకీయ అరంగేట్రం
లాస్ ఏంజెలెస్ రాజకీయాల్లో నిత్యా రామన్‌కు మంచి అనుభవం ఉంది. 2020లో తొలిసారిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె.. అప్పటి సిట్టింగ్ సిటీ కౌన్సిల్ సభ్యుడు డేవిడ్ ర్యూను ఓడించారు. పదేళ్లకు పైగా కాలంలో తొలిసారిగా ఒక సిట్టింగ్ కౌన్సిల్ సభ్యుడు తిరిగి ఎన్నికల్లో ఓడిపోవడం అప్పట్లో సంచలనంగా మారింది. డెమోక్రటిక్ సోషలిస్ట్స్ ఆఫ్ అమెరికా (DSA) మద్దతుతో లాస్ ఏంజెలెస్ సిటీ కౌన్సిల్‌కు ఎన్నికైన తొలి అభ్యర్థిగానూ ఆమె చరిత్ర సృష్టించారు.

కేరళలో జననం.. హార్వర్డ్, ఎంఐటీలో చదువు
1981లో కేరళలో జన్మించిన నిత్యా రామన్ ఆరేళ్ల వయసులోనే అమెరికాకు వెళ్లారు. 22 ఏళ్ల వయసులో అమెరికా పౌరసత్వం పొందారు. హార్వర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన ఆమె.. అనంతరం మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అర్బన్ ప్లానింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు.

పారిశుద్ధ్యం, నిరాశ్రయుల సమస్యలపై పనిచేసి..
నిత్యా రామన్ సామాజిక సమస్యల పరిష్కారంపై కూడా దృష్టి సారించారు. చెన్నైలో 'ట్రాన్స్‌పరెంట్ చెన్నై' అనే పట్టణ పరిశోధన సంస్థను స్థాపించారు. పారిశుద్ధ్య వ్యవస్థను మెరుగుపరిచేందుకు కృషి చేశారు. 2013లో లాస్ ఏంజెలెస్‌కు వెళ్లిన తర్వాత అక్కడి నగర పరిపాలనా అధికారితో కలిసి పనిచేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీకాలం చివరి సంవత్సరాల్లో నిత్యా రామన్ లాస్ ఏంజెలెస్ నగరానికి నాయకత్వం వహించనున్నారు. 2028లో జరగనున్న సమ్మర్ ఒలింపిక్స్‌కు నగరాన్ని సిద్ధం చేయడం ఆమె ముందున్న కీలక బాధ్యతల్లో ఒకటి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement