కార్మికుల ఆగ్రహజ్వాలలు.. వందలాది ఫ్యాక్టరీలు బంద్! | Hundreds of Bangladesh garment factories close as workers clash | Sakshi
Sakshi News home page

కార్మికుల ఆగ్రహజ్వాలలు.. వందలాది ఫ్యాక్టరీలు బంద్!

Nov 5 2026 11:10 AM | Updated on Nov 5 2026 11:10 AM

Hundreds of Bangladesh garment factories close as workers clash

ఢాకా: బంగ్లాదేశ్‌లో వస్త్ర పరిశ్రమ కార్మికుల ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. వేతనాలు పెంచాలంటూ వేలాది మంది కార్మికులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి టియర్ గ్యాస్, స్టన్ గ్రెనేడ్లను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. నిరసనల ప్రభావంతో దేశవ్యాప్తంగా వందలాది వస్త్ర పరిశ్రమలు మూతపడ్డాయి.

కార్మికులు తమ కనీస నెలవారీ వేతనాన్ని ప్రస్తుతం ఉన్న 12,500 టాకాల నుంచి 30,000 టాకాలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం కారణంగా ప్రస్తుత వేతనాలతో జీవించడం కష్టంగా మారిందని వారు చెబుతున్నారు. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు వస్త్ర పరిశ్రమ కీలకం. ఈ రంగం ద్వారా ఏటా సుమారు 40 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరుగుతున్నాయి. దేశంలో దాదాపు 2,500 వస్త్ర పరిశ్రమలు ఉండగా, వీటిలో సుమారు 40 లక్షల మంది పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువమంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలే.

రాజధాని ఢాకాలో కొన్ని రోజులుగా నిరసనలు కొనసాగుతుండగా, నగర శివార్లలోని పారిశ్రామిక ప్రాంతాలకు కూడా ఆందోళనలు విస్తరించాయి. నారాయణ్‌గంజ్ జిల్లాలోని ఫతుల్లాలో కార్మికులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు. పలువురు నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఢాకా సమీపంలోని సవార్ ప్రాంతం అషులియాలో సుమారు 100 ఫ్యాక్టరీలు మూతపడినట్లు అక్కడి ఇండస్ట్రియల్ పోలీస్ సూపరింటెండెంట్ మొమినుల్ ఇస్లాం భుయాన్ తెలిపారు. మరోవైపు గాజీపూర్ జిల్లాలో కార్మికులు ప్రధాన రహదారిని దిగ్బంధించారు.

నిరసనలను అదుపు చేసేందుకు ఢాకాలోని మీర్పూర్ ప్రాంతంలో 10 వేల మందికి పైగా పోలీసులను మోహరించారు. కార్మికుల వేతన డిమాండ్లపై ప్రభుత్వం కొత్త వేతన బోర్డును ఏర్పాటు చేసింది. ఈ బోర్డు ఛైర్మన్ సయ్యద్ ఆజాద్ సుభానీ మాట్లాడుతూ.. కొత్త వేతన విధానం ప్రకారం కార్మికులకు వచ్చే ఏడాది జనవరిలో తొలి జీతాలు అందుతాయని తెలిపారు. అప్పటివరకు ఆందోళనలు ఏ స్థాయికి చేరుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. 
 
ఇదీ చదవండి: లాస్ ఏంజెలెస్‌ మేయర్‌గా నిత్యా రామన్.. కేరళతో అనుబంధమిదే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement