కార్మికుల ఆగ్రహజ్వాలలు.. బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత | Bangladesh Wage Protests Turn Violent | Sakshi
Sakshi News home page

కార్మికుల ఆగ్రహజ్వాలలు.. బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత

Nov 2 2026 12:47 PM | Updated on Nov 2 2026 12:47 PM

Bangladesh Wage Protests Turn Violent

ఢాకా: బంగ్లాదేశ్‌లో మరోసారి కార్మికుల ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. కనీస వేతనాన్ని 12,500 టాకాల నుంచి 30 వేల టాకాలకు పెంచాలంటూ వస్త్ర పరిశ్రమ కార్మికులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఢాకా, గాజీపూర్ ప్రాంతాల్లో కార్మికులు పోలీసులతో ఘర్షణకు దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు బాష్పవాయువు, సౌండ్ గ్రెనేడ్లు ప్రయోగించారు. పలు ప్రాంతాల్లో ఫ్యాక్టరీలపై దాడులు, విధ్వంసం చోటుచేసుకున్నాయి.

ప్రభుత్వ వేతనాల పెంపుతో అసంతృప్తి
ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త వేతన విధానాన్ని ప్రకటిస్తూ జీతాలు, ప్రయోజనాలను దాదాపు రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో వస్త్ర పరిశ్రమ కార్మికులు తమ వేతనాల పెంపును డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం తమకు నెలకు 12,500 టాకాలు మాత్రమే కనీస వేతనంగా లభిస్తున్నాయని, దానిని 30 వేల టాకాలకు పెంచాలని పట్టుబడుతున్నారు.
 

ఢాకాలో రహదారుల దిగ్బంధం
నవంబర్ 1న ప్రారంభమైన ఆందోళనలు మీర్పూర్, ఢాకా, గాజీపూర్‌లోని కొనాబరి ప్రాంతాలకు విస్తరించాయి. మీర్పూర్-10 కూడలిని ఉదయం 9 గంటల నుంచి కార్మికులు దిగ్బంధించారు. దీంతో మీర్పూర్-11 నుంచి అగర్గావ్, మీర్పూర్-2 నుంచి మీర్పూర్-13 మార్గాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

గాజీపూర్‌లోనూ హింసాత్మక ఘటనలు
గాజీపూర్‌లోని పల్లి విద్యుత్, కొనాబరి, భోగ్రా, నౌజోర్, సఫీపూర్, మౌచాక్ ప్రాంతాలకు నిరసనలు వ్యాపించాయి. కార్మికులు పోలీసులపై ఇటుకలు, రాళ్లు విసిరారు. ఢాకా-టాంగైల్, ఢాకా-మైమెన్‌సింగ్ జాతీయ రహదారులను టైర్లు, కర్రలతో అడ్డుకున్నారు. ఫలితంగా రవాణా వ్యవస్థ స్తంభించింది.

మంటల్లో ఫ్యాక్టరీలు.. అగ్నమాపక సిబ్బంది అడ్డగింత
కొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్టరీలకు నిప్పంటించడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. మంటలను ఆర్పేందుకు వస్తున్న అగ్నిమాపక సిబ్బందిని సైతం నిరసనకారులు అడ్డుకున్నట్లు సమాచారం. పోలీస్ ఔట్‌పోస్టులపై దాడులు చేయడంతో పాటు పోలీసు వాహనాలకు నిప్పంటించినట్లు బంగ్లాదేశ్ మీడియా కథనాలు వెల్లడించాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సరిహద్దు భద్రతా దళాలను (బీజీబీ) రంగంలోకి దించింది.

ఇదీ చదవండి: 2027లోనూ ‘అదే నీట్’.. మార్పులకు బ్రేక్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement