‘ఆప్‌’కు వరుస షాక్‌లు.. రెండ్రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా! | AAP MLA Kunwar Vijay Pratap Singh resigns from Punjab Assembly | Sakshi
Sakshi News home page

‘ఆప్‌’కు వరుస షాక్‌లు.. రెండ్రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా!

Nov 2 2026 11:45 AM | Updated on Nov 2 2026 11:49 AM

AAP MLA Kunwar Vijay Pratap Singh resigns from Punjab Assembly

అమృత్‌సర్: పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. 2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రెండ్రోజుల వ్యవధిలో రాజీనామా చేయడం  చర్చనీయాంశమైంది. తాజాగా అమృత్‌సర్ నార్త్ ఎమ్మెల్యే కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అమృత్‌సర్ ప్రజలు తనపై చూపిన ప్రేమ, గౌరవానికి జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా తనకు నిర్దేశించుకున్న లక్ష్యాల్లో 90 శాతం పూర్తి చేశానని తెలిపారు.

పంజాబ్‌ను పట్టిపీడిస్తున్న డ్రగ్స్, దోపిడీలు, గ్యాంగ్‌స్టరిజం, అవినీతి సమస్యల నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కున్వర్ విజయ్ ప్రతాప్ గతంలో ఐపీఎస్ అధికారిగా పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉద్యోగానికి రాజీనామా చేసి ఆప్‌లో చేరారు. ఇంతకుముందు సమానా ఎమ్మెల్యే చేతన్ సింగ్ జౌరామజ్రా, సనౌర్ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్‌మజ్రా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. డ్రగ్స్ సమస్య, రాష్ట్ర అప్పులు, మతపరమైన అంశాలకు సంబంధించిన చట్టంలో సవరణలు చేయకపోవడంపై ప్రభుత్వాన్ని వారు విమర్శించారు. 2027 ఎన్నికల కోసం ఆప్ 40 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన మరుసటి రోజే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వరుస రాజీనామాలతో పంజాబ్ ‘ఆప్‌’లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

ఇదీ చదవండి: శబరిమలలో శాకాహారం అందుబాటు ధరల్లో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement