జెరూసలేం: ఇజ్రాయెల్ రాజకీయాల్లో ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠకు తెరలేపాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ ఏ కూటమికీ రాకపోవడంతో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రాజీనామా చేయాలంటూ ప్రజలు రోడ్డెక్కారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై అరబ్ పార్టీలతో కలిసి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఇజ్రాయెల్‌లో గురువారం రాత్రి జరిగిన నిరసనల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. నగరంలోని ప్రధాన రహదారులపై బైఠాయించి ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు. నెతన్యాహుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన ఎన్నికల ప్రచార పోస్టర్లను తొక్కుతూ నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. కాగా, నెతన్యాహు నివాసం ఎదుట కూడా నిరసనలు జరిగాయి. ఈ సందర్భంగా గాజాపై యుద్ధానికి ముగింపు పలకాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. యూదులు, అరబ్బులు కలిసి రాజకీయ భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. ‘అరబ్బులు, యూదులు.. కలిసుంటేనే విజయం సాధిస్తాం’ అంటూ నిరసనకారులు నినాదాలు చేశారు.
ఐసెన్‌కాట్‌కు ప్రతిపక్షాల పిలుపు
మరోవైపు యాషర్ పార్టీ అధినేత గాడి ఐసెన్‌కాట్ నివాసం ఎదుట కూడా నిరసన జరిగింది. అరబ్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు రావాలని ఆందోళనకారులు ఆయనను కోరారు. ‘భాగస్వామ్యం లేకుండా మార్పు సాధ్యం కాదు’ అంటూ వారు నినాదాలు చేశారు. టెల్ అవీవ్-జాఫా డిప్యూటీ మేయర్ అమీర్ బద్రాన్ కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపారు.
Live ▶️ left-wing Israelis protest in Tel Aviv, demanding Prime Minister Netanyahu's resignation and formation of joint Jewish-Arab government https://t.co/KJ52GPQjUK
— Emiraa Air - Sea Defence (@DenizEmiraa) October 29, 2026
ప్రభుత్వ ఏర్పాటుకు 61 సీట్లు అవసరం
ఇజ్రాయెల్ పార్లమెంట్ నెస్సెట్‌లో మొత్తం 120 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 61 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే తాజా ఎన్నికల్లో నెతన్యాహు కూటమికి 53 స్థానాలు మాత్రమే వచ్చాయి. ప్రధాన నాలుగు ప్రతిపక్ష పార్టీలకు కలిపి 48 సీట్లు దక్కాయి. దీంతో ఏ పక్షానికీ స్పష్టమైన మెజారిటీ లభించలేదు. నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ 27 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఐసెన్‌కాట్ నేతృత్వంలోని యాషర్ పార్టీ 21 స్థానాలతో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించింది.
అరబ్ పార్టీల చేతిలో కీలక సంఖ్యాబలం
ప్రభుత్వ ఏర్పాటులో అరబ్ పార్టీల పాత్ర కీలకంగా మారింది. జాయింట్ లిస్ట్‌కు 11 స్థానాలు, మన్సూర్ అబ్బాస్ నేతృత్వంలోని రామ్ పార్టీకి 8 స్థానాలు వచ్చాయి. ఈ రెండు పార్టీలకు కలిపి 19 మంది సభ్యుల బలం ఉంది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే వీరి మద్దతు అవసరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ ప్రయత్నాలకు అవిగ్డోర్ లీబర్‌మన్ అడ్డంకిగా మారారు. ఆయన నేతృత్వంలోని ఇజ్రాయెల్ బీటెనూ పార్టీకి ఏడు స్థానాలు వచ్చాయి. అరబ్ పార్టీల మద్దతుపై ఆధారపడే ప్రభుత్వంలో తాము భాగస్వాములం కాబోమని లీబర్‌మన్ స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో ప్రతిపక్షాల ఐక్యతపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ మరోసారి ఎన్నికలకు వెళ్లకుండా రాజకీయ పార్టీలు పరిష్కారం కనుగొనాలని ప్రయత్నిస్తున్నారు. అయితే అరబ్ పార్టీల మద్దతు తీసుకోవడంపై ప్రతిపక్షాల్లోనే భిన్నాభిప్రాయాలు ఉండటంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది.
Israeli protesters are calling for an Arab-Jewish unity government https://t.co/ZT1pfpLpzt
— Voice of Freedom 2.0 🇿🇦 🇵🇸 🇾🇪 (@capemalay3) October 29, 2026
ఇదీ చదవండి: ట్రంప్‌కు బిగ్ షాక్.. అమెరికా కళ్లుగప్పి ఇరాన్ భారీ స్కెచ్!


