ఇజ్రాయెల్‌లో హంగ్‌.. నెతన్యాహూకు కలిసొచ్చేవి ఇవేనా? | Five Ways Out Of Israel Political Deadlock Most Are In Netanyahu Favour | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌లో హంగ్‌.. నెతన్యాహూకు కలిసొచ్చేవి ఇవేనా?

Oct 30 2026 9:23 AM | Updated on Oct 30 2026 10:21 AM

Five Ways Out Of Israel Political Deadlock Most Are In Netanyahu Favour

ఇజ్రాయెల్‌లో ఎన్నికల తుది ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఏ ఒక్క పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. దీంతో 120 మంది సభ్యులున్న పార్లమెంట్‌ (నెస్సెట్‌)లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 61 మంది సభ్యుల మద్దతును కూడగట్టడం రాజకీయ పార్టీలకు సవాలుగా మారింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌లో కొన్ని వారాల పాటు.. అవసరమైతే నెలల తరబడి రాజకీయ అనిశ్చితి కొనసాగే అవకాశముంది.

ఇజ్రాయెల్‌ పార్లమెంటు నెసెట్‌లో మొత్తం 120 స్థానాలు ఉండగా ఎన్నికల్లో నెతన్యాహూ నేతృత్వంలోని కూటమికి 53 స్థానాలు మాత్రమే దక్కాయి. గాడీ ఐసన్‌కోట్‌ కూటమికి 48, అరబ్‌ పార్టీల కూటమి రామ్‌కు 19 స్థానాలు లభించాయి. అధికారం కావాలంటే 61 స్థానాలు అవసరం. ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరికీ అవకాశం లేని నేపథ్యంలో ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే నెతన్యాహూ నేతృత్వంలోని కూటమి అరబ్‌ పార్టీలతో జత కట్టేది లేదని స్పష్టం చేశాయి. మరోవైపు, గాడీ ఐసన్‌కోట్‌ నేతృత్వంలోని కూటమి నెతన్యాహూ వ్యతిరేక పార్టీలను కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం.

ఎన్నికల ఫలితాల్లో ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు సంక్లిష్టంగా మారనున్నాయి. రాజకీయ, సిద్ధాంతపరమైన విభేదాలు ఉండటంతో ఏకాభిప్రాయానికి రావడం అంత సులభం కాదు. అయినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు ఐదు అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే 12 వారాల్లోగా పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుపై ఒక నిర్ణయానికి రాకపోతే ఇజ్రాయెల్‌లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.

1. నెతన్యాహూ నేతృత్వంలో ఐక్య ప్రభుత్వం
నెస్సెట్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించిన లికుడ్‌ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడటం ఒక అవకాశం. ఇందులో గాడి ఐసెన్‌కోట్‌కు చెందిన యాషర్‌ పార్టీ, అవిగ్డోర్‌ లీబర్‌మన్‌ నేతృత్వంలోని ఇజ్రాయెల్‌ అవర్‌ హోమ్‌, నఫ్తాలీ బెన్నెట్‌కు చెందిన టుగెదర్‌ వర్గం వంటి మధ్యేవాద, మితవాద పార్టీలను కలుపుకోవచ్చు. ఈ పార్టీలన్నీ కలిసి వస్తే 66 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే నెతన్యాహూ తన సహజ రాజకీయ మిత్రపక్షాలైన అతివాద, అల్ట్రా ఆర్థడాక్స్‌ యూదు పార్టీలను వదులుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా ఎన్నికల సమయంలో ఓటర్లకు ఇచ్చిన ప్రధాన హామీని పక్కన పెట్టాల్సి వస్తుంది.

నెతన్యాహూను గద్దె దించుతామని ప్రచారం చేసిన పార్టీలు ఆయన నాయకత్వంలోనే పనిచేయాల్సి ఉంటుంది. అయితే వారాల తరబడి చర్చలు జరిగినా ఏ కూటమికీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం దక్కకపోతే చివరి ప్రయత్నంగా ఐక్య ప్రభుత్వం ఏర్పడవచ్చు. ఇరాన్‌తో మరోసారి యుద్ధం మొదలైనా, ఇతర శక్తులతో ఉద్రిక్తతలు పెరిగినా రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉంది.

2. నెతన్యాహూతో అధికార మార్పిడి ఒప్పందం
ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా లికుడ్‌ నిలవడంతో పాటు, రాజకీయ కూటముల పరంగా కూడా నెతన్యాహూ వర్గానికే ఆధిక్యం లభించింది. ఈ నేపథ్యంలో ప్రధాని పదవిని మరో నేతతో పంచుకునేందుకు నెతన్యాహూ అంగీకరించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయితే ఐసెన్‌కోట్‌ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమితో ఒప్పందం కుదుర్చుకుని ప్రధాని పదవిని నిర్ణీత కాల వ్యవధిలో మార్చుకునే విధానానికి అంగీకరించే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేం. ఈ ప్రతిపాదన అమలైతే ప్రతిపక్ష నేతలు మరోసారి తమ ఎన్నికల హామీలకు భిన్నంగా వ్యవహరించాల్సి ఉంటుంది. నెతన్యాహూతో కలిసి అధికారాన్ని పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

3. ప్రతిపక్ష పార్టీలను చీల్చి మెజారిటీ సాధించే యత్నం
ప్రస్తుతం నెతన్యాహూ కూటమికి 53 స్థానాలు మాత్రమే ఉన్నాయి. గతంలో ఈ కూటమికి 64 మంది సభ్యుల బలం ఉండేది. అయినప్పటికీ ఇజ్రాయెల్‌ రాజకీయాల్లో అత్యంత వ్యూహాత్మక నేతల్లో ఒకరిగా నెతన్యాహూకు పేరుంది. ప్రతిపక్ష పార్టీల్లో చీలికలు తీసుకొచ్చి, కొందరు సభ్యులను తనవైపు తిప్పుకోవడం ద్వారా మెజారిటీ సాధించేందుకు ఆయన ప్రయత్నించవచ్చు.

గతంలోనూ నెతన్యాహూ ఇలాంటి రాజకీయ వ్యూహాలను అమలు చేశారు. 2022 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రత్యర్థి కూటమిలోని సభ్యులను తనవైపు ఆకర్షించి రాజకీయంగా పైచేయి సాధించారు. అయితే అప్పట్లో ఆయన ఎదుర్కొన్న కూటమికి మెజారిటీ చాలా స్వల్పంగా ఉండటంతో కొద్దిమంది సభ్యులు వైదొలిగినా ఆ ప్రభుత్వం బలహీనపడే పరిస్థితి ఉండేది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిపక్షాన్ని చీల్చడం అంత సులభం కాకపోవచ్చు.

4. ఐసెన్‌కోట్‌ నేతృత్వంలో మైనారిటీ ప్రభుత్వం
ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు ఐజాక్‌ హెర్జోగ్‌ తొలుత ఐసెన్‌కోట్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తే ఆయన మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించవచ్చు. యాషర్‌ పార్టీతో పాటు టుగెదర్‌, డెమోక్రాట్స్‌, ఇజ్రాయెల్‌ అవర్‌ హోమ్‌ పార్టీల మద్దతుతో ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. ఈ కూటమికి 48 స్థానాలు ఉండగా, అరబ్‌ పార్టీలైన రామ్‌, జాయింట్‌ లిస్ట్‌ బయట నుంచి మద్దతు ఇస్తే మొత్తం బలం 67కు చేరుతుంది. తద్వారా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ లభిస్తుంది.

అయితే ఎన్నికల ప్రచారంలో అరబ్‌ పార్టీలను ప్రభుత్వంలో భాగస్వాములుగా చేసుకోబోమని ఐసెన్‌కోట్‌ హామీ ఇచ్చారు. ఇప్పుడు వారి మద్దతు తీసుకోవాలంటే ఆ హామీకి విరుద్ధంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా 2023 అక్టోబర్‌ 7న హమాస్‌ దాడి తర్వాత ఇజ్రాయెల్‌లోని అరబ్‌ మైనారిటీల పట్ల ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో అరబ్‌ పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని ప్రజలకు వివరించడం ఐసెన్‌కోట్‌కు కష్టమే.

అరబ్‌ పార్టీల మద్దతును వ్యతిరేకిస్తూ నెతన్యాహూ ఇప్పటికే ప్రచారం చేశారు. మరోవైపు మధ్యేవాద, వామపక్ష భావజాలం కలిగిన డెమోక్రాట్స్‌ పార్టీ మాత్రం అరబ్‌ పార్టీలను ప్రభుత్వంలో భాగస్వాములుగా చేర్చుకోవాలని బహిరంగంగా పేర్కొంది. రామ్‌, జాయింట్‌ లిస్ట్‌ పార్టీలు కూడా ఐసెన్‌కోట్‌ కూటమితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిచ్చాయి. 2021లో బెన్నెట్‌ ప్రభుత్వంలో రామ్‌ పార్టీ భాగస్వామిగా చేరింది. ఇజ్రాయెల్‌ చరిత్రలో ఒక స్వతంత్ర అరబ్‌ పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో చేరడం అదే తొలిసారి. అయితే ఆ ప్రభుత్వం కేవలం 18 నెలలకే కూలిపోయింది.

5. మరోసారి ఎన్నికలు
ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ ముందుకు రాకపోతే ఇజ్రాయెల్‌లో మరోసారి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. వచ్చే వారం ఎన్నికల తుది ఫలితాలను అధికారికంగా ప్రకటించిన తర్వాత అధ్యక్షుడు ఐజాక్‌ హెర్జోగ్‌ వివిధ పార్టీల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతారు. అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేతను ఎంపిక చేసి ఆ బాధ్యత అప్పగిస్తారు.

ఆ నేత విఫలమైతే మరో నాయకుడికి అవకాశం కల్పిస్తారు. ఆ ప్రయత్నం కూడా విఫలమైతే నెస్సెట్‌ మరో అభ్యర్థిని ఎన్నుకోవచ్చు. ఈ మొత్తం ప్రక్రియకు సుమారు 100 రోజుల గడువు ఉంటుంది. ఆ వ్యవధిలో ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే మరోసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే మళ్లీ ఎన్నికలకు వెళ్లకుండా అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నించాలని అధ్యక్షుడు హెర్జోగ్‌ ఇప్పటికే పిలుపునిచ్చారు. తనతో జరిగే సంప్రదింపులకు అన్ని పార్టీలు సానుకూల దృక్పథంతో రావాలని కోరారు. తాజా ఫలితాల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో రాజకీయ ప్రతిష్టంభనకు ఎలాంటి పరిష్కారం లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: ఇజ్రాయెల్ ఎన్నికల్లో సంచలనం.. విదేశీ శక్తుల జోక్యం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement