జెరూసలేం: ఇజ్రాయెల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తికాకముందే ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ.. అక్కడి అరబ్ పార్టీలు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డాయంటూ ఆరోపణలు చేసింది. అంతేకాదు అరబ్ పార్టీలు ఇజ్రాయెల్‌ను ‘ఇస్లామీకరణ’ చేయాలని చూస్తున్నాయంటూ నెతన్యాహు వ్యాఖ్యానించారు.
ఇప్పటివరుకు జరిగిన సుమారు 93 శాతం ఓట్ల లెక్కింపు ఆధారంగా నెతన్యాహు కూటమికి 53 సీట్లు, ప్రతిపక్ష కూటమికి 48 సీట్లు వచ్చినట్లు ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి. అరబ్ పార్టీలన్నిటికీ కలిపి 19 సీట్లు వచ్చే అవకాశముంది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.
అరబ్ పార్టీలపై అక్రమాల ఆరోపణలు
మంగళవారం జరిగిన ఎన్నికల్లో అరబ్ పార్టీలకు చెందిన పోలింగ్ కేంద్రాల్లో లంచాలు, బెదిరింపులు, హింస, నకిలీ పత్రాలు, ఒకటి కంటే ఎక్కువసార్లు ఓటు వేయడం వంటి అక్రమాలు జరిగినట్లు లికుడ్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు పోలీసులతో పాటు సంబంధిత ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు కూడా ఆ పార్టీ వెల్లడించింది. అయితే ఈ ఆరోపణలు స్వతంత్రంగా నిర్ధారణ కాలేదు.
మళ్లీ ఎన్నికలు తప్పవా?
ఒకవేళ ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే ఇజ్రాయెల్‌లో మరోసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అప్పటివరకు నెతన్యాహు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగే అవకాశం ఉంది. అయితే ప్రతిపక్ష నేత గాడి ఐసెన్‌కోట్ అరబ్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డెమోక్రాట్స్ నేత యైర్ గోలన్ సూచించారు. ఇక ఈ ఎన్నికల్లో దాదాపు 77.7 శాతం పోలింగ్ నమోదైంది. 2023 అక్టోబర్ 7న జరిగిన హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్‌లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలు కావడంతో ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా ఈ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.
ఇదీ చదవండి: రేవంత్ రాసిన రాజ్యాంగమే తెలంగాణలో నడుస్తోంది: కేటీఆర్


