Israel: హంగ్‌ దిశగా ‘ఫలితాలు’.. నెతన్యాహుకు షాక్‌! | Netanyahu Faces Uncertain Future as Israel Exit Polls Show No Clear Majority | Sakshi
Sakshi News home page

Israel: హంగ్‌ దిశగా ‘ఫలితాలు’.. నెతన్యాహుకు షాక్‌!

Oct 28 2026 8:06 AM | Updated on Oct 28 2026 8:29 AM

Netanyahu Faces Uncertain Future as Israel Exit Polls Show No Clear Majority

జెరూసలెం: ఇజ్రాయెల్ పార్లమెంటరీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ దేశ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠకు తెరలేపాయి. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఛానల్ 13, ఛానల్ 12, ప్రభుత్వ ప్రసార సంస్థ కాన్ విడుదల చేసిన అంచనాల ప్రకారం.. మొత్తం 120 స్థానాలున్న పార్లమెంట్‌లో నెతన్యాహు కూటమికి సుమారు 50 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు 61 స్థానాలు అవసరం. మరోవైపు, మాజీ సైనికాధికారి గాడి ఐసెన్‌కోట్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమికి 52–53 స్థానాలు రావచ్చని అంచనా. అయితే i24NEWS ఎగ్జిట్ పోల్ మాత్రం నెతన్యాహు కూటమికి 55, ప్రతిపక్షానికి 49 స్థానాలు వస్తాయని పేర్కొంది. దీంతో ఏ కూటమికీ స్పష్టమైన ఆధిక్యం లేనట్లు కనిపిస్తోంది.

నెతన్యాహు పార్టీదే ఆధిక్యం.. కానీ మెజారిటీపై సందేహాలు
పార్టీల పరంగా నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది. ఛానల్ 13 అంచనాల ప్రకారం లికుడ్‌కు 25, ఐసెన్‌కోట్‌కు చెందిన యషార్ పార్టీకి 23 స్థానాలు రావచ్చు. ఛానల్ 12 అంచనాల్లో ఈ పార్టీలకు వరుసగా 24, 22 సీట్లు లభించే అవకాశముంది. కాన్ అంచనా ప్రకారం లికుడ్‌కు 25, యషార్‌కు 21 స్థానాలు రావచ్చు. అయితే అతిపెద్ద పార్టీగా నిలవడం మాత్రమే ప్రభుత్వ ఏర్పాటుకు సరిపోదు. మిగిలిన పార్టీల మద్దతుతో 61 మంది సభ్యుల బలాన్ని సమీకరించాల్సి ఉంటుంది. అరబ్ నేతృత్వంలోని పార్టీలకు 17–18 స్థానాలు రావచ్చని అంచనాలు చెబుతున్నాయి. ఈ పార్టీల మద్దతు లేదా ఓటింగ్‌కు దూరంగా ఉండే నిర్ణయం ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారవచ్చు. అయితే నెతన్యాహు, ఐసెన్‌కోట్ ఇద్దరూ ఈ పార్టీలతో అధికారిక భాగస్వామ్యానికి విముఖత వ్యక్తం చేశారు.

మరో ఎన్నికకు దారితీస్తుందా?
నెతన్యాహు కూటమికి మెజారిటీ సాధించడం కష్టమైతే, ప్రతిపక్షానికి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వవచ్చు. అయితే ప్రతిపక్ష పార్టీల మధ్య విభేదాలు తలెత్తితే ఆ ప్రయత్నం విఫలమయ్యే అవకాశముంది. అదే జరిగితే ఇజ్రాయెల్‌లో మరోసారి ఎన్నికలు నిర్వహించాల్సి రావచ్చు. నెతన్యాహు, ఐసెన్‌కోట్ కలిసి జాతీయ ఐక్యత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువగానే కనిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలపై ఐసెన్‌కోట్ స్పందిస్తూ.. ప్రజలు నెతన్యాహు ప్రభుత్వాన్ని తిరస్కరించారని పేర్కొన్నారు. అయితే నెతన్యాహు రాజకీయ మిత్రుడు గిడియోన్ సార్ మాత్రం ప్రతిపక్షం విజయోత్సవాలు చేసుకోవడం తొందరపాటేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపు ప్రారంభించగా, తుది లెక్కింపు అక్టోబర్ 30 నాటికి పూర్తవుతుందని, అధికారిక ఫలితాలను నవంబర్ 4న ప్రకటించనున్నట్లు సమాచారం. ఆ తర్వాత అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఉన్న నాయకుడిని నామినేట్ చేస్తారు. ఆ నాయకుడికి మెజారిటీ మద్దతు కూడగట్టేందుకు గరిష్ఠంగా 42 రోజుల సమయం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement