జెరూసలేం: ఇజ్రాయెల్ పార్లమెంట్‌కు మంగళవారం జరిగిన ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఓటేసే అవకాశం ఉండగా, జనం ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. సాయంత్రం 6 గంటలకే 66.7 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. గత 50 ఏళ్లలో ఇదే అత్యధికమని అధికారులు తెలిపారు. గత 2022 ఎన్నికల్లో ఇదే సమయానికి 57.7 శాతం ఓటింగ్ మాత్రమే జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాగా, మంగళవారం టిమోరిమ్ ప్రాంతంలో సాయంత్రం 4 గంటలకే ఏకంగా 91.6 శాతం ఓటింగ్ నమోదు కావడం విశేషం. ప్రధాని నెతన్యాహూ, ప్రధాన ప్రత్యరి్థ, ఆర్మీ మాజీ చీఫ్ గాడి ఐసెన్‌కోట్ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.
మొత్తం 73 లక్షల మంది అర్హులైన ఓటర్లకు గాను సాయంత్రం 6 గంటల సమయానికి 50 లక్షల మంది ఓటేసినట్లు అధికారులు చెప్పారు. 120 సీట్లుండే పార్లమెంట్ నెస్సెట్‌లో అడుగు పెట్టాలంటే కనీసం 3.25 శాతం ఓట్లు లభించాల్సి ఉంటుంది. కాగా, పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూలు కనిపిస్తుండటం, విదేశాల్లో ఉంటున్న ఓటర్లు 80 వేల మంది వరకు తరలి రావడంతో పోలింగ్ సమయాన్ని పెంచాలని లికుడ్, షాస్ పార్టీలు కోరాయి. 2022 ఎన్నికల్లో 70 శాతం ఓటింగ్ నమోదు కాగా, ఈసారి 87 శాతం వరకు ఉంటుందని అంచనా. ఫలితాలను నవంబర్ 4వ తేదీన అధికారికంగా ప్రకటిస్తారు. అయితే, బుధవారం ఉదయానికే అనధికారిక ఫలితాల అంచనాలు వెలువడనున్నాయి.
వినాశనానికి అంచున ఉన్నాం: నెతన్యాహూ
సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతున్న నెత న్యా హూ, ఆయన భార్య సారా జెరూసలేంలోని ఓ పోలింగ్ స్టేషన్‌లో ఓటేశారు. పోలింగ్‌కు ముందు మంగళవారం ప్రధాని నెతన్యాహూ మాట్లాడుతూ... యూదు దేశం సర్వనాశనానికి అంచున ఉంది. సనాతన యూదులంతా తమ పనులన్నీ పక్కనబెట్టి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేయాలి’అంటూ పిలుపునిచ్చారు. ‘మా లికుడ్ పార్టీకి ఓటేయండి.. అరబ్ పార్టీలతో కూడిన ప్రభుత్వం రాకుండా చూడండి’అన్నారు. దీనిపై యుషర్ పార్టీ నేత, ప్రధాన ప్రత్యర్థి ఐసెన్ కోట్ తీవ్రంగా స్పందించారు. ఇజ్రాయెల్ వినాశనానికి అంచున ఉందంటూ ఓటర్లను భయపెట్టి, లాభం పొందేందుకు చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. గత ఎన్నికల ప్రచారసమయంలోనూ ఆయన ఇలాంటి అబద్ధాలే చెప్పారన్నారు.


