అబుదాబి: అబుదాబి బిగ్ టికెట్ వీక్లీ ఈ-డ్రాలో భారతీయుడికి భారీ బహుమతి దక్కింది. బహ్రెయిన్‌లో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్న 45 ఏళ్ల అరుణ కృష్ణప్ప కిడియూర్ 200 గ్రాముల 24 క్యారెట్ల బంగారు కడ్డీని గెలుచుకున్నారు. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం దీని విలువ సుమారు రూ.25 లక్షలు. అక్టోబర్‌లో నిర్వహించిన మూడో వారపు డ్రాలో బహుమతులు గెలుచుకున్న నలుగురు భారతీయ ప్రవాసుల్లో ఆయన ఒకరు.
23 ఏళ్లుగా బహ్రెయిన్‌లోనే..
అరుణ కృష్ణప్ప కిడియూర్ గత 23 ఏళ్లుగా బహ్రెయిన్‌లో నివసిస్తున్నారు. అక్కడ ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్నారు. కొంతకాలంగా అబుదాబి బిగ్ టికెట్ లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నప్పటికీ.. గత నాలుగు నెలల నుంచి స్నేహితుల బృందంతో కలిసి డ్రాలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో సోమవారం ప్రకటించిన విజేతల జాబితాలో ఆయన పేరు కూడా వచ్చింది.
రూ.25 లక్షల విలువైన బంగారం
కిడియూర్ గెలుచుకున్న బంగారు కడ్డీ 200 గ్రాముల బరువు, 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగి ఉంది. దీని విలువ సుమారు 96,500 దిర్హామ్‌లు. భారత కరెన్సీలో దాదాపు రూ.25 లక్షలు. బహుమతి గెలుచుకున్న విషయం తెలిసినప్పుడు ఎంతో సంతోషంగా, ఆశ్చర్యంగా అనిపించిందని ఆయన తెలిపారు. ఈ మొత్తాన్ని ఎలా వినియోగించుకోవాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
మరో ముగ్గురు భారతీయులకూ బహుమతులు
ఈ డ్రాలో కిడియూర్‌తో పాటు మరో ముగ్గురు భారతీయులు కూడా బంగారు కడ్డీలను గెలుచుకున్నారు. వారిలో కేరళకు చెందిన 51 ఏళ్ల జిజోయ్ విశ్వన్ ఒకరు. ఆయన గత రెండు దశాబ్దాలుగా షార్జాలో నివసిస్తున్నారు. స్నేహితులతో కలిసి టికెట్ కొనుగోలు చేసిన ఆయన.. తన వాటా బహుమతిని భారత్‌లోని కుటుంబానికి సహాయం చేయడానికి వినియోగించాలని భావిస్తున్నారు.
ఒంటరిగా టికెట్ కొని గెలిచిన మానిషా
ముంబైకి చెందిన మానిషా హర్షల్ కసాత్ కూడా విజేతల్లో ఉన్నారు. ఆమె గత మూడేళ్లుగా బిగ్ టికెట్ డ్రాలో పాల్గొంటున్నారు. ఈసారి స్నేహితులతో కలిసి కాకుండా సొంతంగా టికెట్ కొనుగోలు చేసి బహుమతి గెలుచుకున్నారు. ప్రస్తుతం ఆమె షార్జాలో నివసిస్తున్నారు.
బెంగళూరు ఇంజినీర్‌కూ అదృష్టం
బెంగళూరుకు చెందిన సివిల్ ఇంజినీర్ సదాతుల్లా షరీఫ్ మరో విజేతగా నిలిచారు. ఆయన ఏడాది క్రితం దుబాయ్‌కు వెళ్లారు. ఓ విమానాశ్రయంలో బిగ్ టికెట్ డ్రా గురించి తెలుసుకున్నట్లు చెప్పారు. బహుమతి గెలుచుకున్న విషయం తెలిసినప్పుడు నమ్మలేకపోయానని, ఎంతో ఉత్సాహంగా అనిపించిందని ఆయన తెలిపారు. నలుగురు భారతీయులకు బంగారు బహుమతులు దక్కడం ప్రవాస భారతీయుల్లో ఆసక్తి రేకెత్తించింది. అయితే కిడియూర్ తన బహుమతిని ఎలా వినియోగించుకుంటారనేది ఇంకా తెలియజేయలేదు.
ఇదీ చదవండి: హోటల్ లీజు వివాదం.. ఐదుగురి హత్య!


