బంగ్లాదేశ్‌లో హిందూ టీచర్‌ను కొట్టి చంపిన వైనం.. ఎందుకంటే? | Hindu School Teacher Mediating Land Dispute Beaten To Death | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌లో హిందూ టీచర్‌ను కొట్టి చంపిన వైనం.. ఎందుకంటే?

Oct 27 2026 8:27 PM | Updated on Oct 27 2026 8:31 PM

 Hindu School Teacher Mediating Land Dispute Beaten To Death

Representative image

ఢాకా: బంగ్లాదేశ్‌లో భూవివాదాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం చేస్తుండగా 55 ఏళ్ల హిందూ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యారు. దినాజ్‌పూర్ జిల్లాలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివాదంలో ఉన్న ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించిన ఉపాధ్యాయుడిపై దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు.

మృతుడిని మనోరంజన్ రాయ్‌గా గుర్తించారు. ఆయన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సహాయ ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. భూమికి సంబంధించిన వివాదంపై ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో ఆయన జోక్యం చేసుకున్నారు. ఈ క్రమంలో పరిస్థితి అదుపు తప్పి ఆయనపై దాడి జరిగినట్లు సమాచారం.

ఈ ఘటనపై బంగ్లాదేశ్ హిందూ సమ్మిలన్ సంఘం సోమవారం తీవ్రంగా ఖండించింది. ఆ దేశంలోని హిందూ మైనారిటీ వర్గానికి ప్రాతినిధ్యం వహించే ఈ సంస్థ.. మనోరంజన్ రాయ్ హత్యను సాధారణ నేరంగా మాత్రమే చూడలేమని పేర్కొంది. సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.కె. రాయ్ మాట్లాడుతూ.. ఈ హత్య చట్టబద్ధ పాలనపై, మానవత్వంపై, మతసామరస్య బంగ్లాదేశ్ స్ఫూర్తిపై జరిగిన దాడి అని వ్యాఖ్యానించారు.

ఈ ఘటనలో పాల్గొన్న వారందరినీ వెంటనే అరెస్టు చేసి, వారికి కఠినమైన శిక్ష విధించాలని సంఘం డిమాండ్ చేసింది. మృతుడి కుటుంబానికి భద్రత కల్పించడంతోపాటు తగిన పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరింది. దేశవ్యాప్తంగా హిందువుల భూములను ఆక్రమించడం, వారిని వేధించడం వంటి ఘటనలను అరికట్టేందుకు ప్రభుత్వం సమర్థమైన చర్యలు తీసుకోవాలని సంఘం విజ్ఞప్తి చేసింది. హిందువుల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టాలని కోరింది.

భూవివాదాలు పరిష్కరించే క్రమంలో హింసకు పాల్పడే ఘటనలు స్థానికంగా శాంతిభద్రతలపై ఆందోళనలను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో మనోరంజన్ రాయ్ హత్య కేసులో నిందితులందరినీ గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటారా? బాధిత కుటుంబానికి భద్రత, పరిహారం కల్పించాలన్న డిమాండ్లపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది కీలకంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement