బంగ్లాదేశ్ క్రికెట్‌లో తీవ్ర విషాదం నెలకొంది. యువ ఫాస్ట్ బౌలర్ మెహెదీ హసన్ హృదోయ్ (18) కన్నుమూశాడు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్ లూకేమియాతో పోరాడుతున్న మెహెదీ.. శనివారం ఢాకాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచాడు. మెహెదీ హసన్ హృదోయ్ 'ఛటోగ్రామ్ డివిజన్ అండర్-18' జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
హృదోయ్ మృతిపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. "యంగ్ క్రికెటర్ మెహెదీ హసన్ హృదోయ్ లూకేమియాతో మరణించడం ఎంతో బాధాకరం. అండర్-18 స్థాయిలో అతని బౌలింగ్ నైపుణ్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి.
ఈ కష్టసమయంలో అతని కుటుంబ సభ్యులకు, ఆప్తులకు బీసీబి తరఫున సానుభూతి తెలియజేస్తున్నాం. అతని ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాం" అని బీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఆర్ధిక సాయం చేసినా దక్కని ప్రాణం
కాగా హృదోయ్ వైద్య చికిత్స ఖర్చుల కోసం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు రూ. 5 లక్షల టాకాలు ఆర్థిక సహాయాన్ని కూడా అందజేసింది. బోర్డుతో పాటు క్రీడా మంత్రిత్వ శాఖ కూడా సహకరించినప్పటికీ, వ్యాధి తీవ్రత పెరగడంతో వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. ఎంతో ప్రతిభ ఉన్న ఒక యువ క్రికెటర్‌ను కోల్పోవడం బంగ్లాదేశ్ క్రికెట్‌కు తీరని లోటు.


