మహిళా ఉపాధ్యాయురాలిని కొనసాగించాలన్న హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: అధికారుల పొరపాటుకు ఎలాంటి తప్పు చేయని ఉపాధ్యాయురాలిని ఉద్యోగం నుంచి తొలగించడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ వీణ నియామకంలో ఆమె వైపు నుంచి మోసం లేదా తప్పిదం లేదంది. నియామకం అనంతరం ఆమెకు ఏర్పడిన హక్కులను పరిగణనలోకి తీసుకోకుండా, నోటీసు లేదా వివరణకు అవకాశం ఇవ్వకుండా తొలగించడం చట్టవిరుద్ధమని తేల్చిచెప్పింది. ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత మరో అభ్యర్థి వినతి ఆధారంగా దానిని తిరిగి తెరిచి, అప్పటికే నియమితురాలైన అభ్యర్థిని తొలగించడాన్ని తప్పుబట్టింది.
మరో అభ్యర్థిని నియమించాలనుకుంటే అందుబాటులో ఉన్న ఖాళీలో కొనసాగించవచ్చని పేర్కొంది. ఖాళీ లేకపోతే, ఖాళీ ఏర్పడే వరకు సూపర్‌న్యూమరరీ పోస్టు ద్వారా ఆయనను కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. అందుకోసం వీణను ఉద్యోగం నుంచి తొలగించాల్సిన అవసరం లేదంటూ.. ఆమె పిటిషన్‌ను అనుమతించింది. ఎనిమిది వారాల్లో ఆమెను అన్ని అనుబంధ ప్రయోజనాలతో పునర్నియమించాలని అధికారులను ఆదేశించింది.
తొలగింపు ఉత్తర్వుల రద్దు
ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన సబావత్ వీణ డీఎస్సీ–2024లో 67.37 మార్కులతో 226వ ర్యాంకు సాధించారు. ఎస్జీటీగా ఎంపికై మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలంలోని మొరంబావి తండా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 2024, అక్టోబర్ 16న విధుల్లో చేరారు. అయితే, అదే సామాజిక వర్గానికి చెందిన డి.వినోద్‌కుమార్‌కు అధిక మార్కులు, మెరుగైన ర్యాంకు ఉన్నాయన్న కారణంతో గతేడాది జూలై 10న అధికారులు ఆమె సర్వీసును రద్దు చేశారు. దీనిని సవాల్ చేస్తూ వీణ హైకోర్టులో పిటిషన్ వేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కాజా శరత్ అధికారుల పొరపాటుకు ఆమెను బాధ్యురాలిని చేయలేరంటూ వీణ తొలగింపు ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పునిచ్చారు.


