పదవులను వేరే వాళ్లకు ఇచ్చేయండి
పనిచేయకుండా హైదరాబాద్‌లో ఉంటే ఏం లాభం?
తెలంగాణ అంటే హైదరాబాద్ ఒక్కటే కాదు..
బీజేపీ నేతలకు సునీల్ బన్సల్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: క్షేత్రస్థాయిలోకి వెళ్లి పనిచేయని వారికి పోస్టులెందుకని బీజేపీ నాయకులపై ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ బన్సల్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. మీ వల్ల కాకపోతే మీ పదవులను వేరే వాళ్లకు ఇవ్వొచ్చు కదా అని ఆయన ఘాటుగా చెప్పినట్లు తెలిసింది. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలకు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసేందుకు శనివారం ఒక హోటల్‌లో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో, ఆ తరువాత పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో బన్సల్ స్థాయిలో మాస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది.
తెలంగాణ అంటే ఒక్క హైదరాబాద్ కాదని, రాష్ట్ర కార్యాలయం చుట్టూరా తిరిగితే వచ్చేదేమీ లేదని చెప్పారు. క్షేత్రస్థాయికి వెళ్లకుండా ఇక్కడ నాయకుల చుట్టూ తిరిగితే పార్టీ ఎలా ఎదుగుతుందని మండిపడ్డారు. నాయకులు బహిరంగ సభల్లో మాట్లాడే దానికంటే క్షేత్రస్థాయిలో చిన్న సమూహాలతో కలిసి, వారితో మమేకమై మాట్లాడితే ఆ ప్రభావం వేరుగా ఉంటుందని హితబోధ చేశారు. పార్టీ నాయకత్వం ఇచ్చిన కార్యక్రమాలను సక్రమంగా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రతీ ఎన్నిక కీలకమే..
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని, రాబోయే ప్రతీ ఎన్నిక కీలకమేనని సునీల్ బన్సల్ చెప్పారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయకుండా ఆశలు పెంచుకోవడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు పార్టీ పదవులకు రాజీనామా చేసి, వారి వారి నియోజకవర్గాల్లో పనిచేసుకోవాలని చెప్పారు. ఇకపై తాను రాష్ట్రంలోనే ఉండి పూర్తిస్థాయి సమయం కేటాయించనున్నట్లు చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వేదికను ఇప్పటి నుంచే తయారు చేసే ప్రక్రియలో భాగంగానే బన్సల్ కాస్త కఠినంగానే మాట్లాడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేయాలనుకున్న వారిలో ముగ్గురు చొప్పున ఎంపిక చేసిన పేర్లను అధిష్టానానికి పంపించనున్నారు. ఈ నెలాఖరు నాటికి బీజేపీ జాతీయ నాయకత్వం ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పోకడలను తిప్పికొడుతూ క్షేత్రస్థాయిలో పోరాటాలు ఉధృతం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. నవంబర్ 1 నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు చేసే పాదయాత్రతోపాటు, మరో ఐదు చోట్ల ఈ కార్యక్రమాలు నిర్వహించాలని అధిష్టానం సూచించింది. కరీంనగర్, సిద్దిపేటలో ఈ కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళిక సిద్ధం చేసింది.
కాగా, హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో మహా పాదయాత్రలు చేస్తామని, పాదయాత్రల తేదీలు, వేదికలు త్వరలో ఖరారు చేస్తామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతంరావు చెప్పారు. నీటి సమస్యకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. మండల, జిల్లా స్థాయిలో ప్రజా ఉద్యమాలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సహ ఇన్‌చార్జీలు అభయ్ పాటిల్, రేఖా శర్మ, పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శులు మధుకర్, దశరథ్‌తోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.


