ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మిడ్జిల్, ఉప్పునుంతల, మక్తల్ ఎంపిక
స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రాజెక్టు అమలు
ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి సద్వినియోగం కావాలి
ఉన్నతాధికారులతో సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కరువు పరిస్థితులను ప్రజలు, రైతులు తట్టుకొనేలా శాశ్వత కరువు నివారణ చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జిల్, ఉప్పునుంతల, మక్తల్ మండలాలను ఎంపిక చేసింది. ఇందుకోసం రూ. 150 కోట్లు కేటాయించింది. రెవెన్యూ, గృహ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శనివారం సచివాలయంలో వ్యవసాయం, విపత్తుల నిర్వహణ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు నీటివనరులను సమర్థంగా వినియోగించుకోవడం, రైతు కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకున్నట్లు వివరించారు.
చారిత్రకంగా కరువు ప్రభావానికి గురవుతున్న ప్రాంతాలు, వర్షాధార వ్యవసాయం అధికంగా ఉన్న జిల్లాలు, సామాజిక–ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలు, రైతు కుటుంబాల జీవనోపాధి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ప్రాంతాలను ఎంపిక చేసినట్లు మంత్రి వెల్లడించారు. జాతీయ విపత్తుల నిర్వహణ నిధి (ఎన్‌డీఎఫ్) సహకారంతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు తెలిపారు. తెలంగాణలో కరువు–నిరోధక వ్యవసాయ విధానం అమలు, కరువుపీడిత ప్రాంతాల్లో శాశ్వత పరిష్కార మార్గాల అన్వేషణ, ప్రతిపాదిత ప్రాజెక్టు కార్యాచరణ, నిధుల సమర్థ వినియోగం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.
పకడ్బందీగా అమలు..
గ్రామీణ ఉపాధి, కుటుంబ ఆదాయాలు, సంప్రదాయ వృత్తులపైనా కరువు ప్రభావం పడుతుందని.. అందువల్ల ప్రతి వర్గానికి ప్రయోజనం చేకూరేలా, స్థానిక పరిస్థితులకు శాశ్వత పరిష్కారాలతో సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులకు మంత్రి పొంగులేటి సూచించారు. నిధుల వినియోగం, పనుల ఎంపిక, అమలు విధానం, క్షేత్రస్థాయి ఫలితాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టును పకడ్బందీగా అమలు చేయడానికి ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని గ్రామ, మండలస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతోపాటు వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను తగ్గించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఎంపిక చేసిన మండలాల్లోని ప్రతి గ్రామంలో గ్రామసభల ద్వారా ప్రజల అభిప్రాయాలు, స్థానిక అవసరాలకు అనుగుణంగా సమగ్ర కార్యాచరణ రూపొందించాలన్నారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి లక్ష్యాన్ని చేరేలా, పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వినియోగించాలని అధికారులకు సూచించారు.
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కల తీరుస్తాం
రాష్ట్రంలో ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టుల కలను సాకారం చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. చట్టపరమైన చిక్కులు లేకుండా, కుటుంబాలతో నివసించేందుకు అనువైన ప్రాంతంలో స్థలాలు అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ముఖ్యమంత్రి, సహచర మంత్రులతో పలుమార్లు చర్చించి జర్నలిస్టులకు స్థలాల కేటాయింపుపై సమీక్షించినట్లు పొంగులేటి తెలిపారు. గతంలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ఈ విషయంలో జర్నలిస్టులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.


