మీ పెట్టుబడులు రెండింతలు చేయండి... పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు
రక్షణ రంగానికి తెలంగాణ సురక్షితం
దేశం ఆయుధాలను దిగుమతి చేసుకునే స్థితి నుంచి సూపర్ పవర్‌గా ఎదగాలి
అదే మా ఆశయం.. మీ పెట్టుబడులకు నాది పూచీ...మీకు ఏమి కావాలో చెప్పండి.. చేయడానికి రెడీ
రాష్ట్రంలో రాజకీయ పారీ్టల విధానాల మధ్య విభేదాలు ఉండొచ్చు.. కానీ రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ లేదు
త్వరలోనే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 2.0 తెస్తాం
రక్ష ఎక్స్‌పో–2026 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే మీకు నేను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటా. మీకు ఏమి కావాలో చెప్పండి చేయడానికి రెడీ. మీ పెట్టుబడులు రెండింతలు చేయండి. దేశం ఆయుధాలను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఆయుధ రంగంలో సూపర్ పవర్‌గా ఎదగాలి. రక్షణ రంగంలో ప్రపంచస్థాయిలో అగ్రగామిగా భారత్‌ను చూడాలన్నది నా ఆకాంక్ష. యుద్ధానికి అవసరమైన సాంకేతికతను దిగుమతి చేసుకునేస్థాయి నుంచి రక్షణ సాంకేతిక ఎగుమతులు చేసే దేశంగా భారత్ ఎదగాలి. యుద్ధం కోసమే కాకుండా, శాంతిని కాపాడేందుకు కూడా ఆయుధాలు అవసరం. శత్రువులు యుద్ధానికి దిగకుండా నిరోధించే శక్తి కూడా మనకు ఒక వ్యూహాత్మక ఆధిక్యాన్ని ఇస్తుంది. దేశ రక్షణ పరిశ్రమకు తెలంగాణ అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా ఎదగాలి. మీ పెట్టుబడులకు నాది పూచీ. మీ పెట్టుబడులకు రెట్టింపు లాభాలు పొందేలా ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. లక్ష్యాన్ని సాధించడానికి నా నుంచి మీకు ఎలాంటి సహకారం కావాలో చెప్పండి. నేను చేస్తాను’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రక్ష ఎక్స్‌పో–2026 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో భాగంగా శనివారం రాత్రి తాజ్ ఫలక్‌నుమాలో రక్షణ, వాయు, అంతరిక్ష పరికరాల ఉత్పత్తి సంస్థలకు చెందిన పారిశ్రామికవేత్తలు, రక్షణ రంగ ప్రముఖులకు ఇచ్చిన విందు సందర్భంగా రేవంత్ మాట్లాడారు.
నైపుణ్య యువత తెలంగాణలో ఉంది...
‘భారత్‌లో హైదరాబాద్ ఒక వ్యూహాత్మకమైన ప్రదేశంగా కీలకమైన స్థానంలో ఉంది. హైదరాబాద్ అత్యంత సురక్షితమైన నగరం. అనేక ముఖ్యమైన పరిశోధనా సంస్థలకు నిలయం. భారత సైన్యం, వైమానిక దళాలకు సంబంధించిన అనేక ముఖ్యమైన వ్యూహాత్మక కేంద్రాలు ఇక్కడున్నాయి. దక్షిణ భారతదేశంలో సముద్రతీరం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ. అయినప్పటికీ, భారత నౌకాదళానికి రాష్ట్రం కీలకమైన సేవలు అందిస్తోంది. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో అత్యంత తక్కువ పౌనఃపున్యాల నౌకాదళ రాడార్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రక్షణ, వాయు, అంతరిక్ష రంగాల్లోని పరిశ్రమల్లో పనిచేయడానికి అత్యంత నిపుణులైన యువత అవసరం ఉందని, ఆ యువత తెలంగాణలో లభిస్తారని చెప్పారు.
అందుకోసం తాము స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి.. దానిని పారిశ్రామికవేత్త చేతిలో పెట్టామన్నారు. ‘రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ లేదుం. రాజకీయంగా, సైద్ధాంతికంగా భిన్నాభిప్రాయాలున్నా.. పెట్టుబడులు, అభివృద్ధి విషయంలో మాకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. కీలక రంగాల్లో ఉన్న వారంతా పెద్ద పెద్ద లక్ష్యాలతో ఆలోచనలు చేయాలి. మన దగ్గర తెలివైన, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, అవసరమైన వనరులున్నాయి. త్వరలోనే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 2.0ను విడుదల చేయబోతున్నాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రం 2047 నాటికి మూడు ట్రిలియన్‌ల ఎకానమీగా మార్చడానికి మీ అందరి సహకారం అవసరమన్నారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో జరగబోయే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో మిమ్మల్ని మళ్లీ కలుస్తా అని రేవంత్ అన్నారు.
అంతర్జాతీయ అవకాశాలు: భట్టి
పెట్టుబడులకు భరోసా, పరిశ్రమలకు నిరంతర విద్యుత్, వేగవంతమైన అనుమతులు, యువతకు నైపుణ్య శిక్షణతోపాటు స్థానిక సంస్థలకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణతోపాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, చిన్న పరిశ్రమలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పారిశ్రామిక రంగానికి నమ్మకమైన విద్యుత్ సరఫరా, పటిష్టమైన ఆర్థిక ప్రణాళికలు, పారదర్శకమైన ప్రభుత్వ విధానాలు కీలకమని చెప్పారు.
తెలంగాణ కీలక పాత్ర: మంత్రి ఉత్తమ్
అంతర్జాతీయ ఏరోస్పేస్ సంస్థలు, రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు, పరిశోధనా కేంద్రాలు, ప్రత్యేక విడిభాగాల తయారీ పరిశ్రమలతో హైదరాబాద్‌లో బలమైన పారిశ్రామిక వ్యవస్థ ఏర్పడిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. స్వదేశీ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, దేశీయ తయారీని విస్తరించడం, అంతర్జాతీయంగా పోటీపడగల పారిశ్రామిక సరఫరా వ్యవస్థలను నిర్మించడం వంటి భారతదేశ లక్ష్యాల సాధనలో తెలంగాణ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందన్నారు.
కొత్త చాప్టర్ ప్రారంభం: శ్రీధర్‌బాబు
రాష్ట్రంలో రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లోని పరిశ్రమల కొత్త చాప్టర్ ప్రారంభంకాబోతోందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. హైదరాబాద్‌లో ఎప్పటి నుంచో రక్షణరంగానికి చెందిన పలు పరిశ్రమలను దూరదృష్టితో మన పూర్వీకులు ప్రారంభించారని చెప్పారు. తెలంగాణలో నైపుణ్య యువతకు కొదవ లేదని, అంతర్జాతీయ సంస్థలకు సరిపడా నిపుణులను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, స్కైరూట్ సీఈవో పవన్‌కుమార్, భారత్‌ఫోర్జ్ అధిపతి బాబా కల్యాణ్, రక్షణ రంగ నిపుణులు, భారత సాయుధ దళాల అధికారులు మాట్లాడారు. రక్షణ, ఏరోస్పేస్, అంతరిక్ష, అంతర్గత భద్రత రంగాలకు చెందిన 90కిపైగా దేశీయ, అంతర్జాతీయ కంపెనీల ముఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.


