మహబూబాబాద్: తొమ్మిది నెలల బిడ్డను వదిలి ఆత్మహత్య చేసుకోవడానికి మనసెలా వచ్చిందమ్మా.. అంటూ గ్రామస్తులంతా కంటతడిపెట్టిన ఘటన మానుకోట జిల్లా గార్ల మండలం సీతంపేట గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతంపేటకు చెందిన మోకాళ్ల శేఖర్ అదే గ్రామానికి చెందిన మహేశ్వరి (21) నాలుగేళ్ల ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
వీరికి 9 నెలల పాప శరణ్య, రెండేళ్ల కుమారుడు దేవాన్ష్ సంతానం. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఇంట్లో నుంచి వెళ్లిన మహేశ్వరి ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు సమీపంలో వెతకడం ప్రారంభించారు. ఈక్రమంలో సీతంపేట శివారు వ్యవసాయ బావిలో మహేశ్వరి మృతదేహం కనిపించడంతో స్థాని కు ల సాయంతో వెలికితీశారు. తల్లి మృతితో 9 నెలల చిన్నారి పాల కోసం ఏడుస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. అయితే మహేశ్వరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. మృతురాలి తల్లి బత్తుల వినోద ఫిర్యాదు మేరకు ఎస్సై సాయికుమార్.. మహేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భార్య మందలించిందని నమిలిగొండలో వ్యక్తి ఆత్మహత్య
స్టేషన్‌ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూ ర్ మండలంలోని నమిలిగొండకు చెందిన నీల కుమార్(42) పురుగుల మందుతాగి చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుమార్ భార్య నీల స్వప్న పోలీసులకు అందించిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి.. కుమార్ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. అయితే కొన్ని సంవత్సరాలుగా కుమార్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో మూడేళ్లుగా అనారోగ్యానికి గురయ్యాడు.
ఈనెల 21న రాత్రి కుమార్ మద్యం సేవించి ఇంటికి రావడంతో ఆరోగ్యం బాగాలేదు కదా.. మద్యం ఎందుకు తాగా వని భార్య మందలించింది. దీంతో వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి మనస్తాపంతో మద్యం మత్తులో పురుగుల మందు తాగి రాత్రి 11 గంటలకు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో భార్య, కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందు తూ శుక్రవారం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.


