సీసీఎంబీ, మంగళూరు విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్/లాలాపేట: పశ్చిమ భారత తీరంలోని కొంకణ్ ప్రాంతానికి చెందిన ప్రజల మాతృ జన్యుమూలాలు సంక్లిష్టంగా ఉన్నట్లు సీసీఎంబీ, మంగళూరు విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. సారస్వత, సారస్వతేతర వర్గాలకు చెందిన 295 మంది కొంకణీ ప్రజల మాతృ వారసత్వాన్ని పరిశోధకులు విశ్లేషించారు.
మొత్తంగా వారి మాతృ జన్యుమూలాలు స్థానికంగానే ఉన్నప్పటికీ సారస్వత వర్గాల్లో పశ్చిమ యూరేసియా, స్టెప్పీ ప్రాంతాలకు అనుబంధమైన జన్యు వంశాల ప్రభావం కొంత అధికంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో కాంస్య యుగంలో దక్షిణాసియాకు జరిగిన వలసలు కేవలం పురుషుల ద్వారానే కాకుండా మహిళల ద్వారా కూడా జరిగి ఉండొచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.
యూరేసియాకు చెందిన 5 వేల మందికిపైగా వ్యక్తుల మైటోకాండ్రియల్ డీఎన్‌ఏతో పోల్చినప్పుడు కూడా కొంకణీ ప్రజల మాతృ జన్యు సమూహంలో దక్షిణాసియా, పశ్చిమ యూరేసియా వంశాల మిశ్రమం ఉన్నట్లు తేలింది. చివరి హిమయుగం గరిష్ట దశలో సమీప ప్రాచ్యంలో ఏర్పడిన పురాతన జన్య వంశాలు ఆ తర్వాతి కాలంలో దక్షిణాసియాలో కలిసిపోయి ఉండొచ్చని ప్రొఫెసర్ ముస్తక్ తెలిపారు.
ఇదీ చదవండి: ఇంటాయనకు శ్రీమతి బహుమతి!
ఖార్వీ, కుడుబి వంటి వృత్తి వర్గాల్లో చారిత్రకంగా జరిగిన వ్యవస్థాపక సంఘటనలు, దీర్ఘకాల అంతర్వివాహాల కారణంగా జన్యు వైవిధ్యంలో మార్పులు వచ్చినట్లు అధ్యయనం వెల్లడించింది. గౌడ సారస్వత బ్రాహ్మణులు, రోమన్ కాథలిక్కుల్లో ఇతర కొంకణీ వర్గాల కంటే జన్యు వైవిధ్యం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ పరిశోధన పశ్చిమ భారత తీరంలోని భాషా, సామాజిక చరిత్రను అర్థం చేసుకోవడంలో కీలకమని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్‌కుమార్ నందికూరి తెలిపారు.
ఇదీ చదవండి: ఏఐ ఆవిష్కరణల్లో జెన్‌జీదే కీలకపాత్ర


