ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్రారంభ కార్యక్రమంలో ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు
గ్రీన్ స్కిల్స్–అప్లైడ్ ఏఐ కేంద్రం ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు
తొలిరోజే 100 ఉద్యోగ ఆఫర్లు.. యువత కోసం ఏఐ ఫర్ మై సిటీ చాలెంజ్
సాక్షి, హైదరాబాద్/రాయదుర్గం: కృత్రిమ మేధ (ఏఐ), పర్యావరణహిత ఆవిష్కరణల్లో జెన్‌జీ తరం కీలకపాత్ర పోషించనుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. సాంకేతికతను వ్యాపారాభివృద్ధికే పరిమితం చేయకుండా ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యల పరిష్కారానికి వినియోగించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లో గ్రీన్ స్కిల్స్ అండ్ అప్లైడ్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఆయన ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్, 1ఎం1బీ, మైటీ స్టార్టప్ హబ్ భాగస్వామ్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
అప్లైడ్ ఏఐ, గ్రీన్ ఫార్మా, సౌరశక్తి, విద్యుత్ వాహనాలు, పవన విద్యుత్ రంగాల్లో పట్టభద్రులకు శిక్షణ అందించనున్నారు. ఈ సందర్భంగా 1ఎం1బీ జాబ్స్ ఎక్స్‌ప్రెస్ ద్వారా తొలిరోజే 100 ఉద్యోగ ఆఫర్లను ప్రకటించారు. సహజవనరుల లభ్యత, నాణ్యత భవిష్యత్ తరాలకూ అందేలా యువత ఇప్పటి నుంచే సాంకేతిక పరిష్కారాలు అభివృద్ధి చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు. నగరాల సమస్యలకు యువత ఏఐ ఆధారిత పరిష్కారాలు రూపొందించేలా ఏఐ ఫర్ మై సిటీ చాలెంజ్‌ను ఆయన ప్రారంభించారు.
పరిశ్రమలతో అనుసంధానం కోసం 1ఎం1బీ ఎనిమిది సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందని.. 2030 నాటికి దేశవ్యాప్తంగా ఐదు కేంద్రాల ద్వారా లక్ష మందికి ఏఐ, హరిత నైపుణ్యాల్లో శిక్షణ అందించాలనేది లక్ష్యమని ఫౌండేషన్ వ్యవస్థాపకులు మానవ్ సుబోధ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ ఎండీ రాజీవ్ కుమార్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ సీఈఓ సర్వేశ్ సింగ్, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ, యువ ఆవిష్కర్తలు పాల్గొన్నారు.


