ప్రస్తుతం సెలబ్రిటీలు ప్రెగ్నెన్సీ విషయంలో సరికొత్త ట్రెండ్‌కు తెరలేపారు. సోనమ్ కపూర్, కత్రినా కైఫ్ తదితర ప్రముఖ తారలు 30 ఏళ్ల చివరలో లేదా 40 ఏళ్ల వయసులో మాతృత్వాన్ని స్వీకరించి, సరికొత్త ఆలోచనలకు పురిగొల్పారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులు 30 ఏళ్లు దాటాక గర్భధారణ ప్రక్రియను సాధ్యం చేస్తున్నప్పటికీ, ఈ వయసులో గర్భం దాల్చడం అనేది శరీరానికి ఒక సవాలుతో కూడుకున్న ప్రయాణమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
‘అడ్వాన్స్‌డ్ ఏజ్ ప్రెగ్నెన్సీ’ అంటే ఏమిటి?
వైద్య పరిభాషలో 35 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న మహిళలకు జరిగే ప్రసవాలను ‘అడ్వాన్స్‌డ్ మెటర్నల్ ఏజ్’ (ఏఎంఏ) అని పిలుస్తారు. ఇది ప్రమాదకరమని కాదుగానీ.. వయసు పెరిగేకొద్దీ శరీరంలోని హార్మోన్ల సమతుల్యత, అవయవాల పనితీరులో మార్పులు సహజం. ఈ మార్పులు ప్రసవ సమయంలో కొన్ని ఇబ్బందులకు దారితీయవచ్చు. సరైన వైద్య పర్యవేక్షణ, జీవనశైలి మార్పులతో ఈ ముప్పులను తగ్గించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
రక్తపోటుపై ప్రత్యేక దృష్టి
వయసు పైబడిన ప్రెగ్నెన్సీలలో డాక్టర్లు అత్యంత జాగ్రత్తగా గమనించే అంశం ‘బ్లడ్ ప్రెషర్’. వయసు పెరిగేకొద్దీ రక్తనాళాలు బిగుతుగా మారి, రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ‘ప్రీఎక్లాంప్సియా’ అనే స్థితికి దారితీయవచ్చు, దీనివల్ల కాలేయం లేదా మూత్రపిండాలపై ఒత్తిడి పడుతుంది. సరైన సమయంలో చికిత్స అందకపోతే, ఫిట్స్ రావడం లేదా ముందస్తు ప్రసవం వంటి తీవ్ర పరిణామాలు ఎదురుకావచ్చు.
గర్భస్రావం: మానసిక, శారీరక వేదన
దురదృష్టవశాత్తూ, వయసు పెరిగేకొద్దీ అండాల నాణ్యత తగ్గుతుంది? ఇది గర్భస్రావం లేదా పిండం ఎదుగుదలలో సమస్యలకు కారణమవుతుంది. 40 ఏళ్ల దాటిన మహిళల్లో క్రోమోజోమ్ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువ. ఇది శారీరక ఆరోగ్యానికే కాకుండా, మహిళల మానసిక స్థితిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. మళ్లీ గర్భం దాల్చడం లేదా ‘వైఫల్యాలు’ ఎదురైనప్పుడు ఆ బాధ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
గెస్టేషనల్ డయాబెటిస్ ముప్పు
వయసు పెరిగిన మహిళల్లో జీవక్రియ, ఇన్సులిన్ ప్రతిస్పందనలో వచ్చే మార్పుల వల్ల ‘గెస్టేషనల్ డయాబెటిస్’ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల ప్రసవ సమయంలో ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవడంలాంటివి సంభవించవచ్చు. అంతేకాకుండా భవిష్యత్తులో వారికి టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
ముందస్తు ప్రసవం మరియు రికవరీ
40 ఏళ్ల వయసులో గర్భం దాల్చిన వారిలో 37 వారాల కంటే ముందే ప్రసవం జరిగే అవకాశాలు అధికం. అకాలంగా జన్మించే శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ అవసరం కావచ్చు. ఇది తల్లికి మరింత మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. ప్రసవం తర్వాత రికవరీ కావడానికి కూడా ఎక్కువ సమయం పట్టవచ్చు. అధిక రక్తస్రావం, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి.
ప్రసవ సమయంలో అనిశ్చితి
ప్రసవం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వయసు పెరిగిన మహిళల్లో గర్భాశయ ముఖద్వారం, కండరాలు చిన్న వయసువారితో పోలిస్తే నెమ్మదిగా స్పందించవచ్చు. దీనివల్ల ప్రసవం ఆలస్యమయ్యేందుకు అవకాశముంది. శిశువు స్థానం లేదా తల్లి ఆరోగ్య పరిస్థితులను బట్టి ‘సిజేరియన్’ అవసరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 40 ఏళ్ల వయసులో మాతృత్వం అసాధ్యం కాకపోయినప్పటికీ, మరిన్ని జాగ్రత్తలు అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ‘యోగి’ మార్క్ రూల్స్: నమాజ్‌లు, బలులు బ్యాన్


