‘యోగి’ మార్క్ రూల్స్: నమాజ్‌లు, బలులు బ్యాన్ | No open prayers or animal sacrifice in public CM Yogi | Sakshi
Sakshi News home page

‘యోగి’ మార్క్ రూల్స్: నమాజ్‌లు, బలులు బ్యాన్

May 25 2026 1:37 PM | Updated on May 25 2026 1:46 PM

No open prayers or animal sacrifice in public CM Yogi

లక్నో: బక్రీద్ పండుగ సమీపిస్తున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం  కఠినమైన నిబంధనలను అమలులోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలను పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పది కీలక ఆదేశాలను జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు, జంతు బలులపై స్పష్టమైన ఆంక్షలు విధిస్తూ ఆయన తీసుకున్న ఈ నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి.

బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షలు
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జారీచేసిన ఆదేశాల ప్రకారం, ఈద్-ఉల్-అధా సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నమాజ్ నిర్వహించకూడదు. రోడ్లను దిగ్బంధించి ప్రార్థనలు చేయడం నిషిద్ధం. ఒకవేళ నమాజ్ చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటే, వారు మసీదుల లోపల లేదా ఈద్గాల వద్ద షిఫ్టుల వారీగా ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి మతపరమైన ప్రక్రియలు చేయకూడదని  ప్రభుత్వం తేల్చిచెప్పింది.

జంతు బలులపై కఠిన నిబంధనలు
పండుగ సందర్భంగా జంతు బలుల విషయంలో ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి జంతు బలులు నిర్వహించకూడదని, కేవలం నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే ఈ ఆచారాలను నిర్వహించాలని సీఎం ఆదేశించారు. అంతేకాకుండా, నిషేధిత జంతువుల వధను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. పండుగ తర్వాత బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు పేరుకుపోకుండా, తగిన పారిశుద్ధ్య ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

నిఘా, భద్రతా చర్యలు
రాష్ట్రంలోని సున్నిత ప్రాంతాల్లో శాంతిని కాపాడేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించనున్నారు. డ్రోన్లు, సిసిటివి కెమెరాల ద్వారా ప్రతి కదలికను అధికారులు పర్యవేక్షిస్తారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అల్లరి మూకల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పాత ఘటనలను పరిగణనలోకి తీసుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. పండుగను శాంతియుతంగా జరుపుకునేలా స్థానిక శాంతి కమిటీలతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement