ఆట.. మీ జీన్స్‌లో ఉందా? | Gujarat launches sports genomics program | Sakshi
Sakshi News home page

ఆట.. మీ జీన్స్‌లో ఉందా?

Aug 30 2026 5:44 AM | Updated on Aug 30 2026 5:44 AM

Gujarat launches sports genomics program

డీఎన్‌ఏతో చాంపియన్ల తయారీ..

2030లో అహ్మదాబాద్‌లో జరిగే కామన్వెల్త్‌ క్రీడల్లో పతకాల సాధనకు గుజరాత్‌ కొత్త ప్రయోగం

క్రీడాకారుల ప్రతిభను వారి జన్యు, శారీరక, ప్రతిభా సమాచారంతో గుర్తించి శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ

ఒక చిన్న డీఎన్‌ఏ నమూనా.. దేశంలో ఒక పెద్ద క్రీడా భవిష్యత్తుకు క్లూ కానుంది! మన క్రీడాకారులు మైదానంలో చెమట చిందించక ముందే.. వారి జన్యువులను ల్యాబ్‌లో విశ్లేషించి ఎవరు భవిష్యత్‌ చాంపియన్లు కాగలరో గుర్తించే ప్రయత్నం మొదలైంది! ఎవరు ఏ క్రీడలో రాణించగలరు? ఎవరి శరీరం ఏ ఆటకు అనువుగా ఉంటుంది? ఎవరిలో ఎంత శక్తి దాగుంది? అనే ప్రశ్నలకు సమాధానాలను డీఎన్‌ఏలో వెతికే సరికొత్త ప్రయోగానికి గుజరాత్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

అహ్మదాబాద్‌ వేదికగా 2030లో జరగే కామన్వెల్త్‌ క్రీడల్లో చాంపియన్లుగా నిలిచే సత్తా ఉన్న వారెవరో వెలికితీసేందుకు దేశంలోనే తొలిసారిగా గుజరాత్‌ ప్రభుత్వం క్రీడా జీనోమిక్స్‌ కార్యక్రమాన్ని చేపట్టింది. క్రీడాకా­రుల జన్యు సమాచారాన్ని వారి శారీరక, క్రీడా ప్రదర్శన వివరాలతో అనుసంధానించి సమగ్ర ప్రొఫైళ్లను రూపొందించనుంది. వాటి ఆధారంగా క్రీడా ప్రతిభను గుర్తించడంతోపాటు అందుకు అనువైన క్రీడాశిక్షణను రూపొందించడం, క్రీడాకారులకు అనువైన క్రీడను ఎంపిక చేయడం, గాయాల నిర్వహణ వంటి అంశాలను మరింత మెరుగ్గా చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ కార్యక్రమాన్ని గుజరాత్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ఆ రాష్ట్ర బయోటెక్నాలజీ రీసెర్చ్‌ సెంటర్‌ అమలు చేస్తోంది. ఇందుకోసం గుజరాత్‌ అథ్లెట్‌ జీనోమ్‌ డేటాబేస్‌ను రూపొందించనుంది. ఇందులో క్రీడాకారుల జన్యు, శారీరక, క్రీడా ప్రదర్శనకు సంబంధించిన సమాచారాన్ని సమీకరిస్తారు. ‘‘క్రీడా ప్రతిభను గుర్తించి, క్రీడాకారులను అభివృద్ధి చేసేందుకు మరింత శాస్త్రీయ, ఆధారిత విధానాన్ని రూపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం’’ అని గుజరాత్‌ శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి అర్జున్‌ మోఢ్వాడియా తెలిపారు.

ఈ ఏడాది 2,000 డీఎన్‌ఏ నమూనాలు
మొదటి దశలో టెన్నిస్‌ క్రీడాకా­రుల నుంచి డీఎన్‌ఏ నమూనా­లను సేకరించనున్నారు. తదు­పరి దశలో ఆర్చరీ, ఫెన్సింగ్, జూడో, షూటింగ్‌ క్రీడాకారులను చేర్చనున్నారు. ఈ ఏడాది సుమారు 2,000 నమూనాలు, వచ్చే ఏడాది 10,000 నమూ­నాలు సేకరించి విశ్లేషించాలని గుజరాత్‌ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 14 ఏళ్లలోపు, 14 నుంచి 18 ఏళ్లలోపు, 18 ఏళ్లు పైబడిన క్రీడాకారుల కోసం వే­ర్వే­రు విభాగాలతో డేటాబేస్‌ రూ­పొందించనున్నారు. రాష్ట్ర, జాతీ­య స్థాయి చాంపియన్లకు ఇందులో ప్రాధాన్యం ఇవ్వను­న్నా­రు. అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బా­క్సిం­గ్, రెజ్లింగ్, జూడో, టెన్నిస్, తైక్వాండో, జిమ్నాస్టిక్స్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్, హాకీ, హ్యాండ్‌­బా­ల్, వాలీబాల్, బా­స్కెట్‌­బాల్, బ్యాడ్మింటన్, టేబు­ల్‌ టెన్నిస్, లాన్‌ టెన్నిస్, కబడ్డీ, ఖోఖో, ఆర్చరీ, షూటింగ్, చెస్‌ తదితర క్రీడలకు సంబంధించిన 
సమాచా­రా­న్ని డేటాబేస్‌లో చేర్చనున్నారు.

గాయాలు, శిక్షణపై కూడా ఉపయోగం
జన్యు లక్షణాలు కండరాల నిర్మాణం, ఓర్పు, జీవక్రియ, వ్యాయా­మానికి శరీరం స్పందించే తీరు, కోలుకునే వేగం, గాయాలకు గురయ్యే అవకాశాలు వంటి అంశాలతో ఏ మేరకు సంబంధం కలిగి ఉన్నాయో తెలుసుకునేందుకు స్పోర్ట్స్‌ జీనోమిక్స్‌ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ‘‘జన్యు, జీవసంబంధ సమాచారాన్ని సమీకరించడం ద్వారా ప్రతి క్రీడాకారుడికి మరింత సమగ్ర ప్రొఫైల్‌ను రూపొందించడమే గుజరాత్‌ నమూనా లక్ష్యం. తద్వారా క్రీడాకారుల ప్రతిభపై మరింత లోతైన అవగాహన లభిస్తుంది’’ అని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం కార్యదర్శి బి. భారతి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement