వరద బురదలో విల విల! | Nepal-Tibet border region have killed at least 675 people | Sakshi
Sakshi News home page

వరద బురదలో విల విల!

Aug 30 2026 5:38 AM | Updated on Aug 30 2026 5:38 AM

Nepal-Tibet border region have killed at least 675 people

నేపాల్‌లో 675 దాటిన మృతుల సంఖ్య ∙2,426 మంది జాడ గల్లంతు

వరద ‘సరస్సు’ఉప్పొంగుతుండటంతో పొంచి ఉన్న కొత్త ముప్పు 

సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని హెచ్చరిక 

విపత్కర పరిస్థితుల్లోనూ అలుపెరగక శ్రమిస్తున్న ఆర్మీ, పోలీసులు, వలంటీర్లు 

జలవిద్యుత్‌ కేంద్రం సొరంగం వద్ద కొనసాగుతున్న రెస్క్యూ 

భారత్‌చేస్తున్న సాయానికి కృతజ్ఞత తెలిపిన నేపాల్‌ అధ్యక్షుడు 

రంగంలోకి విదేశీ సహాయక బృందాలు 

పొంచి ఉన్న కుండపోత వర్షాలు

కఠ్మాండు: మెరుపులా వచ్చి పడిన వరద బురద విలయంలో పారిపోయేందుకు క్షణమైనా సమయంలేక జల సమాధి అయిన అభాగ్యుల సంఖ్య అమాంతం పెరిగింది. నేపాల్‌–టిబెట్‌ సరిహద్దు మంచుకొండల నుంచి ముంచుకొచ్చిన జల ప్రళయంలో మరణించిన వారి సంఖ్య శనివారానికి ఏకంగా 675 దాటింది. 320 మంది విదేశీయులుసహా 2,426 మందికిపైగా జనం జాడ తెలీడంలేదని నేపాల్‌ ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో 183 మంది భారతీయులున్నారు. టిబెట్‌ వైపు ఏడుగురు చనిపోగా 554 మంది జాడ తెలీడంలేదని చైనా పేర్కొంది. 

భోటె కోశీ నదీపరీవాహక ప్రాంతంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు, నదిలో అంతకంతకూ పెరుగుతున్న నీటి మట్టాలు మళ్లీ స్థానికులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. వర్షం, బురద, చీకటిని సైతం లెక్కచేయకుండా బాధితులను కాపాడాలనే ఏకైక సంకల్పంతో 15 వేల మందికిపైగా సైనికులు అవిశ్రాంతంగా అన్వేషణ, సహాయక చర్యలను కొనసాగిస్తుండటంతో వందలాది మందిని భవన శిథిలాలు, బురద మేటల నుంచి కాపాడగలిగారు. అడవుల్లో తలదాచుకున్న వారికి హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలను అందించారు. 

కాపాడిన వాళ్లను హెలికాప్టర్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు టిబెట్‌లోని ఛోచెన్‌ నది, పురెఫు నదుల సంగమం వద్ద ఏర్పడిన వరద సరస్సులో నీటిమట్టాలు ప్రమాదకరస్థాయిలో కొనసాగడంతో మరోమారు జలఖడ్గం దూసుకొచ్చే ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికలతో దిగువ నేపాల్‌వాసుల్లో భయాందోళనలు మరింత పెరిగాయి. సరస్సులో నీటి రంగు మారుతోందని, ఈ లెక్కన ఏ క్షణంలోనైనా కట్ట తెంచుకుని భారీస్థాయిలో నీరు కిందకు ఉగ్రరూపంలో ప్రవహించవచ్చని నేపాల్‌ ప్రభుత్వాన్ని చైనా అప్రమత్తంచేసింది. 

సరస్సు కట్టుతెంచుకుంటే సెకన్‌కు 500 ఘనపు మీటర్ల నీరు మెరుపువేగంతో కిందకు దూసుకొచ్చి ప్రళయం సృష్టిస్తుందని అధికారులు హెచ్చరించారు. దిగువ ప్రాంతాల వాళ్లు తాత్కాలికంగా ఎగువ అడవిలోకి వెళ్లి తలదాచుకోవాలని సూచించారు. తమ వారిని కోల్పోయి ఇల్లు, వాహనాలు, సామగ్రి కొట్టుకుపోవడంతో పలువురు జీవచ్ఛవాలుగా మారిపోయిన హృదయవిదారక దృశ్యాలు పలు చోట్ల దర్శనమిచ్చాయి. వరద ప్రభావిత 8 జిల్లాల్లో ఇప్పటిదాకా 2,465 మందిని రక్షించారు. వీరిలో 113 మంది భారతీయులు సహా మొత్తంగా 163 మంది విదేశీయులు ఉన్నారు. టిబెట్‌లోని గ్యిరోంగ్‌ కౌంటీలో 1,000 మందిని కాపాడారు. 8జిల్లాల్లో ఇప్పటిదాకా 669 మృతదేహాలు లభ్యమయ్యాయి.  

రంగంలోకి భారత సొరంగ బృందం 
రాసువాలోని త్రిశూలి 3ఏ జలవిద్యుత్‌ కేంద్రాన్ని బురదమట్టి సగానికిపైగా కప్పేయడంతో లోపల చిక్కుకున్న దాదాపు 100 మంది సిబ్బందిని కాపాడేందుకు, రంధ్రం పెట్టేందుకు డ్రిల్లింగ్‌ యంత్రాలతో భారతీయ నిపుణులు రంగంలోకి దూకారు. భారత్‌లో సొరంగ సంబంధ సమస్యల్ని పరిష్కరించే 14 మందితో కూడిన నిపుణుల బృందాన్ని రప్పించారు. ఉత్తరాఖండ్‌లో మూడేళ్ల క్రితం సిల్‌క్యారా–బార్కోట్‌ సొరంగం కూలిన ఘటనలో 17 రోజుల తర్వాత 41 మంది సిబ్బందిని సురక్షితంగా కాపాడిన టన్నెల్‌ రెసూ్క, మెడికల్‌ టీమ్‌ శనివారం ఘటనాస్థలికి చేరుకుంది. 

అంతర్జాతీయ సొరంగ నిపుణుడు ఆర్నాల్డ్‌ డెక్స్‌తోనూ నేపాల్‌ అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్షా సమావేశం జరిపారు. నేపాల్‌ ఆర్మీ, పోలీసులు, సాయుధ బలగాలతో కూడిన 82 మంది బృందం శుక్రవారం రాత్రి నుంచి బురదను తొలగిస్తూ లోపలికి సొరంగం లోపలికి వెళ్లేందుకు శతథా కృషిచేస్తోంది. ఇప్పటిదాకా త్రిశూలి, రసువాసహా పలు హైడ్రోపవర్‌ ప్రాజెక్టుల నుంచి 191 మంది సిబ్బందిని కాపాడారు. 

మరోవైపు రాజధాని కఠ్మాండును దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే మగ్లింగ్‌–కఠ్మాండు జాతీయరహదారిని శనివారం పునరుద్దరించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు ఆహారం, ఔషధాలు, వైద్య ఉపకరణాలుసహా పలు రకాల సామగ్రిని భారత్‌ శనివారం సైతం తరలించింది. దీంతో ఇప్పటిదాకా భారత్‌ నుంచి నేపాల్‌కు 57.6 టన్నుల మేర వరదసాయం అందింది. మిత్రదేశంపై చూపిస్తున్న మమకారానికి నేపాల్‌ అధ్యక్షుడు రామచంద్ర పౌదెల్, ఆర్థికమంత్రి స్వరి్ణం వాగ్లే భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఎడతెగని వాన.. 
కష్టంగా రెస్క్యూ ఆపరేషన్‌ 
అత్యంత ప్రభావితప్రాంతాల్లో సహా యక చర్యలకు కుండపోత వర్షాలు అడ్డంకిగా మారాయి. వరద ముంపు ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చని శనివారం నేపాల్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. కోశీ, భాగమతి, గండకీ, లుంబినా, సుందర్‌పశ్చిమ్‌ ప్రావిన్స్‌ల్లో, కర్నాలీ కొండ ప్రాంతాల్లో అతి వర్షసూచన ఉందని వాతావరణ శాఖ అధికారి హరిప్రసాద్‌ దహాల్‌ చెప్పారు. బురదమయంగా మారిన ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు పడితే కష్టమని రెస్క్యూ బృందాలు పేర్కొన్నాయి.  

దాతృత్వ సంస్థల నుంచి వెల్లువెత్తిన విరాళాలు 
వరదలో నాశనమైన రోడ్లు, వంతెనలు, విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు, మౌలిక సదుపాయాల పునరుద్దరణకు ఏకంగా రూ.48,000 కోట్లు అవసరం అవుతాయని నేపాల్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో తీవ్ర దుఖంలో మునిగిపోయిన బాధితుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు, సహాయక, అన్వేషణ కార్యక్రమాలకు తమ వంతు సాయం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా దాతలు ముందుకొస్తున్నారు. భారత్, బ్రిటన్, ఆ్రస్టేలియా, అమెరికా, చైనా, ద.కొరియా. ఐరోపా సమాఖ్య, ప్రపంచబ్యాంక్‌ ఆర్థిక సాయానికి నడుంబిగించాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement