breaking news
Watery grave
-
నేపాల్ వరదల్లో వేయి దాటిన మ*రణాలు
కఠ్మాండు: నేపాల్ దిగువ ప్రాంతాలపై జలఖడ్గంతో దండయాత్ర చేసిన వరద విలయం ధాటికి జల సమాధి అయిన అమాయకుల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది. నేపాల్‌ను ముంచెత్తిన మెరుపు వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మంగళవారానికి 1,050కి పెరిగింది. భోటె కోశీ, త్రిశూలి నదీ ప్రవాహాల వెంట ఉన్న 8 జిల్లాల్లో ఇప్పటిదాకా 12,000 మందిని కాపాడినప్పటికీ అన్వేషణ, సహాయక చర్యల్లో ఇంకా గుట్టలకొద్దీ మృతదేహాలు బురద మట్టిలో బయటపడుతున్నాయి. భద్రపరిచేందుకు సరిపడా ఫ్రీజర్లు లేక, బురదకొట్టుకుపోయిన దారుల్లో తరలించే ఆస్కారం లేక కొన్ని మృతదేహాలను సమీప కొండల్లోనే బుల్డోజర్లతో గోతులు తీసి కప్పేస్తున్నారు.మరోవైపు ఆస్పత్రుల వద్ద మృతదేహాలు తమ వారివేనంటూ ఒకరికి మించి ఎక్కువ మంది బంధువులు రావడంతో అధికారులు మృతదేహాలతోపాటు అందరి డీఎన్ఏ శాంపిళ్లను తీసుకుంటున్నారు. దీంతో మృతదేహాల అప్పగింత సైతం ప్రహసనంగా మారింది. అంతెత్తున్న దూసుకొచి్చన బురద వరదలో గల్లంతైన వారి సంఖ్య మంగళవారానికి 4,400 దాటింది. వీరిలో 600 మందిదాకా విదేశీయులు, 83 మంది పోలీసులు, సైనికులు, సాయుధ సిబ్బంది ఉన్నారు. 5 జిల్లాల్లో 16 లక్షల మంది మెరుపు వరదలకు తీవ్రంగా ప్రభావితులయ్యారు.బురద మట్టిని తొలగిస్తూ భారత సొరంగ నిపుణుల బృందం ఎట్టకేలకు ఛిలిమి సొరంగం, లాంగ్‌టాంక్ సొరంగంలో 185 మీటర్ల మేర లోపలికి వెళ్లేందుకు దారి సిద్ధంచేయగల్గిందని నేపాల్‌లో భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ తెలిపారు. వేర్వేరు ప్రాంతాల్లో 163 మంది భారతీయులను కాపాడి తరలించినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్«దీర్ జైశ్వాల్ తెలిపారు. వేర్వేరు చోట్ల నదుల ప్రవాహ ఉధృతిని ప్రత్యక్షంగా చూసేందుకు పలు చోట్ల సీసీటీవీ కెమెరాలను అధికారులు బిగించారు. తాజా పరిస్థితిపై నేపాల్ ఇందన శాఖ మంత్రి విరాజ్ భక్త శ్రేష్ట సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్వేషణ, సహాయక చర్యల్లో 21,300 మంది నిమగ్నమయ్యారు. -
వరద బురదలో విల విల!
కఠ్మాండు: మెరుపులా వచ్చి పడిన వరద బురద విలయంలో పారిపోయేందుకు క్షణమైనా సమయంలేక జల సమాధి అయిన అభాగ్యుల సంఖ్య అమాంతం పెరిగింది. నేపాల్–టిబెట్ సరిహద్దు మంచుకొండల నుంచి ముంచుకొచ్చిన జల ప్రళయంలో మరణించిన వారి సంఖ్య శనివారానికి ఏకంగా 675 దాటింది. 320 మంది విదేశీయులుసహా 2,426 మందికిపైగా జనం జాడ తెలీడంలేదని నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో 183 మంది భారతీయులున్నారు. టిబెట్ వైపు ఏడుగురు చనిపోగా 554 మంది జాడ తెలీడంలేదని చైనా పేర్కొంది. భోటె కోశీ నదీపరీవాహక ప్రాంతంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు, నదిలో అంతకంతకూ పెరుగుతున్న నీటి మట్టాలు మళ్లీ స్థానికులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. వర్షం, బురద, చీకటిని సైతం లెక్కచేయకుండా బాధితులను కాపాడాలనే ఏకైక సంకల్పంతో 15 వేల మందికిపైగా సైనికులు అవిశ్రాంతంగా అన్వేషణ, సహాయక చర్యలను కొనసాగిస్తుండటంతో వందలాది మందిని భవన శిథిలాలు, బురద మేటల నుంచి కాపాడగలిగారు. అడవుల్లో తలదాచుకున్న వారికి హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలను అందించారు. కాపాడిన వాళ్లను హెలికాప్టర్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు టిబెట్‌లోని ఛోచెన్ నది, పురెఫు నదుల సంగమం వద్ద ఏర్పడిన వరద సరస్సులో నీటిమట్టాలు ప్రమాదకరస్థాయిలో కొనసాగడంతో మరోమారు జలఖడ్గం దూసుకొచ్చే ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికలతో దిగువ నేపాల్వాసుల్లో భయాందోళనలు మరింత పెరిగాయి. సరస్సులో నీటి రంగు మారుతోందని, ఈ లెక్కన ఏ క్షణంలోనైనా కట్ట తెంచుకుని భారీస్థాయిలో నీరు కిందకు ఉగ్రరూపంలో ప్రవహించవచ్చని నేపాల్ ప్రభుత్వాన్ని చైనా అప్రమత్తంచేసింది. సరస్సు కట్టుతెంచుకుంటే సెకన్‌కు 500 ఘనపు మీటర్ల నీరు మెరుపువేగంతో కిందకు దూసుకొచ్చి ప్రళయం సృష్టిస్తుందని అధికారులు హెచ్చరించారు. దిగువ ప్రాంతాల వాళ్లు తాత్కాలికంగా ఎగువ అడవిలోకి వెళ్లి తలదాచుకోవాలని సూచించారు. తమ వారిని కోల్పోయి ఇల్లు, వాహనాలు, సామగ్రి కొట్టుకుపోవడంతో పలువురు జీవచ్ఛవాలుగా మారిపోయిన హృదయవిదారక దృశ్యాలు పలు చోట్ల దర్శనమిచ్చాయి. వరద ప్రభావిత 8 జిల్లాల్లో ఇప్పటిదాకా 2,465 మందిని రక్షించారు. వీరిలో 113 మంది భారతీయులు సహా మొత్తంగా 163 మంది విదేశీయులు ఉన్నారు. టిబెట్‌లోని గ్యిరోంగ్ కౌంటీలో 1,000 మందిని కాపాడారు. 8జిల్లాల్లో ఇప్పటిదాకా 669 మృతదేహాలు లభ్యమయ్యాయి. రంగంలోకి భారత సొరంగ బృందం రాసువాలోని త్రిశూలి 3ఏ జలవిద్యుత్ కేంద్రాన్ని బురదమట్టి సగానికిపైగా కప్పేయడంతో లోపల చిక్కుకున్న దాదాపు 100 మంది సిబ్బందిని కాపాడేందుకు, రంధ్రం పెట్టేందుకు డ్రిల్లింగ్ యంత్రాలతో భారతీయ నిపుణులు రంగంలోకి దూకారు. భారత్‌లో సొరంగ సంబంధ సమస్యల్ని పరిష్కరించే 14 మందితో కూడిన నిపుణుల బృందాన్ని రప్పించారు. ఉత్తరాఖండ్‌లో మూడేళ్ల క్రితం సిల్క్యారా–బార్కోట్ సొరంగం కూలిన ఘటనలో 17 రోజుల తర్వాత 41 మంది సిబ్బందిని సురక్షితంగా కాపాడిన టన్నెల్ రెసూ్క, మెడికల్ టీమ్ శనివారం ఘటనాస్థలికి చేరుకుంది. అంతర్జాతీయ సొరంగ నిపుణుడు ఆర్నాల్డ్ డెక్స్తోనూ నేపాల్ అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్షా సమావేశం జరిపారు. నేపాల్ ఆర్మీ, పోలీసులు, సాయుధ బలగాలతో కూడిన 82 మంది బృందం శుక్రవారం రాత్రి నుంచి బురదను తొలగిస్తూ లోపలికి సొరంగం లోపలికి వెళ్లేందుకు శతథా కృషిచేస్తోంది. ఇప్పటిదాకా త్రిశూలి, రసువాసహా పలు హైడ్రోపవర్ ప్రాజెక్టుల నుంచి 191 మంది సిబ్బందిని కాపాడారు. మరోవైపు రాజధాని కఠ్మాండును దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే మగ్లింగ్–కఠ్మాండు జాతీయరహదారిని శనివారం పునరుద్దరించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు ఆహారం, ఔషధాలు, వైద్య ఉపకరణాలుసహా పలు రకాల సామగ్రిని భారత్ శనివారం సైతం తరలించింది. దీంతో ఇప్పటిదాకా భారత్ నుంచి నేపాల్‌కు 57.6 టన్నుల మేర వరదసాయం అందింది. మిత్రదేశంపై చూపిస్తున్న మమకారానికి నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌదెల్, ఆర్థికమంత్రి స్వరి్ణం వాగ్లే భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎడతెగని వాన.. కష్టంగా రెస్క్యూ ఆపరేషన్ అత్యంత ప్రభావితప్రాంతాల్లో సహా యక చర్యలకు కుండపోత వర్షాలు అడ్డంకిగా మారాయి. వరద ముంపు ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చని శనివారం నేపాల్ వాతావరణ శాఖ హెచ్చరించింది. కోశీ, భాగమతి, గండకీ, లుంబినా, సుందర్పశ్చిమ్ ప్రావిన్స్‌ల్లో, కర్నాలీ కొండ ప్రాంతాల్లో అతి వర్షసూచన ఉందని వాతావరణ శాఖ అధికారి హరిప్రసాద్ దహాల్ చెప్పారు. బురదమయంగా మారిన ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు పడితే కష్టమని రెస్క్యూ బృందాలు పేర్కొన్నాయి. దాతృత్వ సంస్థల నుంచి వెల్లువెత్తిన విరాళాలు వరదలో నాశనమైన రోడ్లు, వంతెనలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, మౌలిక సదుపాయాల పునరుద్దరణకు ఏకంగా రూ.48,000 కోట్లు అవసరం అవుతాయని నేపాల్ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో తీవ్ర దుఖంలో మునిగిపోయిన బాధితుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు, సహాయక, అన్వేషణ కార్యక్రమాలకు తమ వంతు సాయం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా దాతలు ముందుకొస్తున్నారు. భారత్, బ్రిటన్, ఆ్రస్టేలియా, అమెరికా, చైనా, ద.కొరియా. ఐరోపా సమాఖ్య, ప్రపంచబ్యాంక్ ఆర్థిక సాయానికి నడుంబిగించాయి. -
అంతులేని విషాదం.. 392 దాటిన మరణాలు
కఠ్మాండు/న్యూఢిల్లీ/బీజింగ్: హిమాలయాల దేశం నేపాల్‌లో మెరుపు వేగంతో దూసుకొచ్చిన భారీ వరద, బురద నీటితో జలసమాధి అయిన అమాయకుల సంఖ్య అమాంతం పెరిగింది. లెండే నది, భోటెకోశీ నదీ పరీవాహక ప్రాంతాలను అమాంతం ముంచేస్తూ దిగువ గ్రామాలు, పట్టణాలను మరుభూములుగా మార్చేస్తూ కొనసాగిన జలవిధ్వంసంతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య గురువారానికి 392 దాటింది. ప్రకృతి అందాలను చూసేందుకు దేశవిదేశాల నుంచి వచ్చిన దాదాపు 1,500 మంది పర్యాటకులు, స్థానికుల జాడ గల్లంతైంది. వీరిలో 290 మంది భారతీయులు సైతం ఉన్నారు. ఎటుచూసినా ఐదు అడుగుల ఎత్తులో మేటవేసిన బురదలో ఇల్లు, రోడ్డు నామరూపాల్లేకుండా పోయాయి. డజను జలవిద్యుత్ కేంద్రాలు పూర్తిగా వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. ఉగ్రరూపం దాల్చిన నది కాస్తంత ఉపశమించడంతో ప్రవాహంలో మరికొన్ని మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. దీంతో తమ వారిని విగతజీవులుగా చూసిన ఆప్తులు, బంధువులు దిక్కులు పిక్కటిల్లేలా రోదించడంతో ఆ ప్రాంతంలో శ్మశాన వాతావరణం అలుముకుంది. వేలాదిగా చెట్లు కూలాయి. పెద్ద సంఖ్యలో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. వంతెనలు కాగితం పడవల్లా వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. మరోవైపు కాలంతో పోటీపడుతూ నేపాల్ సైనికులు, పోలీసులు, వలంటీర్లు, స్థానికులు యుద్ధ ప్రాతిపదికన అన్వేషణ, సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. శిథిలాల కుప్పలుగా మారిన దుకాణసముదాయాలు, ఇళ్ల నుంచి మృతదేహాలను వెలికితీసి బంధువులకు అప్పగిస్తున్నారు. జలం కంటే రెండింతలు శక్తివంతమైన ద్రవరూప సిమెంట్ తరహాలో భీకర వరద అలలు పోటెత్తడంతో విధ్వంసం ఊహించనంతగా జరిగిందని శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు. వంతెనలు, రహదారులు నాశనంకావడంతో భూతల మార్గంలో రెస్క్యూ ఆపరేషన్లు క్లిష్టంగా మారాయి. దీంతో గత్యంతరంలేక హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలను చేపడుతున్నారు. బాధితుల జాడ కోసం డ్రోన్ల దండును రంగంలోకి దింపారు. 800 మందికిపైగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు గల్లంతైన తమ వారి జాడ కోసం ఆప్తులు ఆస్పత్రుల వద్ద కళ్లు కాయలు కాచేలా వెతుకుతున్నారు. రక్షించే పనిలో మోదీ సర్కార్ టిబెట్‌లోని మానససరోవర్తోపాటు ఆధ్యాత్మిక, పుణ్యక్షేత్ర యాత్రల కోసం నేపాల్‌కు విచ్చేసిన వందలాది మంది భారతీయులను రక్షించి ఎలాగైనా స్వదేశానికి తరలించేందుకు మోదీ సర్కార్ నడుం బిగించింది. నేపాల్ ఆర్మీకి తోడుగా భారత్‌నుంచి జాతీయ విపత్తుస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) బృందాలను పంపిస్తోంది. నేపాల్ ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం, టూర్ ఆపరేటర్లతో కాఠ్మాండులోని భారత ఎంబసీ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన, గల్లంతైన వారి జాడ కోసం అహరి్నశలు శ్రమిస్తోంది. గురువారం నాటికి త్రిశూలి–1 జలవిద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న 84 మంది భారతీయులను కాపాడినట్లు భారతవిదేశాంగశాఖ తెలిపింది. తమిళనాడుకు చెందిన 21 మందిని సైతం రక్షించారు. రసువాలో 11 మంది భారతీయులు సహా 27 మంది విదేశీ పర్యాటకులును గురువారం కాపాడారు. గాయపడిన విదేశీయులను ఆర్మీ సాయంతో కఠ్మాండుకు హెలికాప్టర్లలో తరలించి ఆస్పత్రుల్లో చేరి్పంచారు. దక్షిణాది రాష్ట్రాలతోపాటు పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు చెందిన యాత్రికులను వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్ స్పష్టంచేశారు. టిబె ట్లో చిక్కుకుపోయిన 200 మంది భారతీయులను తీసుకొస్తామని ఆయ హామీ ఇచ్చారు.కొనసాగుతున్న భారత సాయం జలవిద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకుపోయి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో దిగువ ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది. మౌలిక వసతులు సైతం దెబ్బతిన్న ఆ ప్రాంత ప్రజల కోసం భారత్ మానవతా సాయం కింద 10 టన్నుల సహాయక సామగ్రిని పంపించింది. ఆహారం, ఔషధాలు, జనరేటర్లు, దుప్పట్లు ఇలా మరో 37.5 టన్నుల సామగ్రినీ తరలించారు. మరోవైపు 28, 29వ తేదీల్లో ‘భారత్–నేపాల్ మైత్రి బస్ సేవా’ సరీ్వసులను నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రపంచ బ్యాంక్, భారత్, ఐక్యరాజ్యసమితి, అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియా, చైనా,పలు దేశాలు, అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సంఘం, దాతృత్వ సంస్థలు ధన, వస్తు, ఔషధ, వలంటీర్ల రూపంలో సాయం అందిస్తున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో షా పర్యటన యువ ప్రధాని బాలేంద్ర షా గురువారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితుల కుటుంబాలను పరామర్శించారు. ఆర్థికసాయం చేస్తామని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నువాకోట్ జిల్లాలోని బిదూర్ మున్సిపాలిటీలో సహాయక చర్యలను ప్రధాని స్వయంగా పర్యవేక్షించారు. మరోవైపు టిబెట్‌లోనూ ఇదే వరద విలయం సృష్టించడంతో చైనా ప్రధాని లీ క్వియాంగ్ సైతం గురువారం గిరోంగ్ టౌన్షిప్లో పర్యటించారు. రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు.భారత్‌కు కొట్టుకొచ్చిన మృతదేహాలు!! ఉత్తరప్రదేశ్‌లోని గండక్ నదీప్రవాహంలో మూడు మృతదేహాలు కొట్టుకొచ్చినట్లు ఉత్తరప్రదేశ్ అధికారులు వెల్లడించారు. నేపాల్‌ను దాటాక వరద ప్రవాహం భారత్‌లోకే వస్తుంది. దీంతో అక్కడి నుంచే ఈ మృతదేహాలు వచ్చాయని అధికారులు భావిస్తున్నారు. గండక్ నదీప్రవాహంలో వీటిని కనుగొన్నట్లు రాష్ట్ర విపత్తు స్పందన దళ సభ్యుడు, కానిస్టేబుల్ బ్రిజ్మోహన్ తెలిపారు. రాష్ట్రంలోని కుషీనగర్ జిల్లాలోని నారాయణి నదిలోనూ వరద ఉధృతి పెరిగే ఆస్కారముందని అధికారులు తెలిపారు. మరోవైపు బిహార్‌లో ఆరు జిల్లాల్లోని నదీ పరీవాహక దిగువ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మ రోవైపు ఈశా ఫౌండేషన్‌కు చెందిన డజన్ల మంది సభ్యుల జాడ గల్లంతైందని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆవేదన వ్యక్తంచేశారు. -
427 మంది రోహింగ్యాల జల సమాధి
బ్యాంకాక్: మయన్మార్ ముస్లిం మైనారిటీ వర్గం రోహింగ్యాలు ప్రయాణిస్తున్న పడవలు మునిగి 427 మంది మృతి చెందినట్లు ఐక్యరాజ్యసమితి శరణార్థి విభాగం (యూఎన్‌హెచ్‌సీఆర్) తెలిపింది. ఈ నెల 9, 10వ తేదీల్లో మయన్మార్ తీరానికి సమీపంలో ఈ దారుణ విషాదం చోటుచేసుకుందని పేర్కొంది. పడవల మునకకు కారణాలు, కచ్చితంగా ఎందరు జల సమాధి అయ్యారనే వివరాలను తెలుసుకునేందుకు కృషి కొనసాగుతోందని వివరించింది. ఈ నెల 9వ తేదీన పడవ మునిగి 267 మంది ప్రాణాలు కోల్పోగా అందులోని కేవలం 66 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని, 10వతేదీన మరో పడవ మునగ్గా 247 మంది రోహింగ్యాలు చనిపోగా, 21 మంది మాత్రమే ప్రాణాలు దక్కించుకున్నారని యూఎన్‌హెచ్‌సీఆర్ వివరించింది. సజీవులైన వారు బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్లో ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరానికి, మయన్మార్‌లోని రఖైన్ ప్రాంతానికి తిరిగి వెళ్లిపోయారని పేర్కొంది. -
36 మంది జలసమాధి
బహరాంపూర్: పశ్చిమ బెంగాల్లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆర్టీసీ బస్సు వంతెన పై నుంచి కాలువలోకి పడిపోవడంతో పది మంది మహిళలు సహా మొత్తం 36 మంది దుర్మరణం చెందారు. బస్సు నదియా జిల్లాలోని షికార్పూర్ నుంచి మాల్దాకు వెళ్తుండగా ముర్షీదాబాద్ జిల్లాలోని దౌల్తాబాద్ పరిధిలో ఆరు గంటలకు ప్రమాదం జరిగింది. సహాయక చర్యలు అందించేందుకు పోలీసులు ఆలస్యంగా వచ్చారంటూ స్థానికులు నిరసన చేపట్టి, ఓ పోలీస్ వాహనానికి నిప్పంటించారు. ఆ మంటలను ఆర్పడానికి వచ్చిన అగ్నిమాపక యంత్రంపైనా వారు దాడి చేశారు. కాలువలోని బస్సును గుర్తించి క్రేన్ల సాయంతో బయటకు తీయడానికి ఎనిమిది గంటలు పట్టిందని అధికారులు చెప్పారు. 32 మృతదేహాలను సిబ్బంది వెలికితీయగా, మరో రెండు నీటిలో కొట్టుకుపోయాయి. ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సీఎం మమతా బెనర్జీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పొగమంచు లేదా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే దుర్ఘటన జరిగి ఉండొచ్చని ఆమె అన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ. 1 లక్ష, స్పల్ప గాయాలైన వారికి రూ. 50 వేల నష్టపరిహారాన్ని ఆమె ప్రకటించారు. -
34 మంది శరణార్థులు జలసమాధి
రోమ్: శరణార్థులతో కిక్కిరిసిన ఒక పడవ మధ్యధరా సముద్రంలో మునిగిపోయిన ఘటనలో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఈ ప్రమాదం జరిగిందని, ఇప్పటివరకు 34 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నామని, 150 నుంచి 200 మంది వరకు గల్లంతయ్యారని ఇటలీ కోస్ట్‌గార్డ్ అధికారులు వెల్లడించారు. దాదాపు 500 నుంచి 700 మంది శరణార్థులు ఒక చెక్కపడవపై మధ్యధరా సముద్రాన్ని దాటాలని ప్రయత్నిస్తుండగా లిబియా తీరం నుంచి 20 నాటికల్ మైళ్లు ప్రయాణించిన తరువాత ఈ ప్రమాదం జరిగింది. ఒక పెద్ద కెరటం పడవని బలంగా తాకడంతో డెక్‌పైన ఉన్నవారు, పడవలో ఉన్నవారు అదుపు తప్పి సముద్రంలో పడిపోయారు.


