
బ్యాంకాక్: మయన్మార్ ముస్లిం మైనారిటీ వర్గం రోహింగ్యాలు ప్రయాణిస్తున్న పడవలు మునిగి 427 మంది మృతి చెందినట్లు ఐక్యరాజ్యసమితి శరణార్థి విభాగం (యూఎన్‌హెచ్‌సీఆర్) తెలిపింది. ఈ నెల 9, 10వ తేదీల్లో మయన్మార్ తీరానికి సమీపంలో ఈ దారుణ విషాదం చోటుచేసుకుందని పేర్కొంది. పడవల మునకకు కారణాలు, కచ్చితంగా ఎందరు జల సమాధి అయ్యారనే వివరాలను తెలుసుకునేందుకు కృషి కొనసాగుతోందని వివరించింది.
ఈ నెల 9వ తేదీన పడవ మునిగి 267 మంది ప్రాణాలు కోల్పోగా అందులోని కేవలం 66 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని, 10వతేదీన మరో పడవ మునగ్గా 247 మంది రోహింగ్యాలు చనిపోగా, 21 మంది మాత్రమే ప్రాణాలు దక్కించుకున్నారని యూఎన్‌హెచ్‌సీఆర్ వివరించింది. సజీవులైన వారు బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్‌లో ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరానికి, మయన్మార్‌లోని రఖైన్ ప్రాంతానికి తిరిగి వెళ్లిపోయారని పేర్కొంది.