గుక్కెడు మంచినీళ్ల కోసం మున్ముందు ప్రపంచ ప్రజానీకం ఇక్కట్లు పడాల్సి ఉంటుందని నిపుణులు ఎప్పటినుంచో చేస్తున్న హెచ్చరికలు రేపో మాపో నిజం కాబోతున్నాయని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక హెచ్చరిస్తున్నది. మనిషికే కాదు... సమస్త జీవకోటికీ గాలి తర్వాత నీరే ప్రాణాధారం. కానీ మారుతున్న పర్యావరణం, పెరిగిపోతున్న కాలుష్యంతో పాటు మితిమీరిన వినియోగం కారణంగా నీరు శరవేగంతో అడుగంటి పోతున్నదని ఆ నివేదిక చెబుతోంది. ముంచుకురానున్న ఈ ప్రమాద తీవ్రతను తెలియ జెప్పేందుకు నివేదిక కొత్త పదాన్ని ఎంచుకుంది. జల సంక్షోభం, జలగండం వంటివి అలవాటైన పదాలు. సంక్షోభం అనడంలో దాన్ని అధిగమించగలమన్న భరోసా కూడా ఏదో ఒక మూల ఉంటుంది. గండం అని చెప్పడంలో గట్టెక్కగలమన్న విశ్వాసం ఎంతో కొంత ధ్వనిస్తుంది. కానీ ముంచుకురాబోయే ముప్పు ఇంకెంత మాత్రమూ సాధారణ మైనది కాదు. అందుకే ఆ ముప్పును ‘జల దివాళా’ అంటోంది నివేదిక.
ప్రకృతి మనకు వాన రూపంలో, మంచురూపంలో ప్రసాదించే జలరాశి ఆదాయంతో సమానమని, కానీ పొందుతున్న జలరాశిని మించి... చెప్పాలంటే అవసరాలను మించి నదులు, సరస్సులు, చిత్తడి నేలలు, భూగర్భ జలాశయాలు వగైరాల నుంచి మానవాళి పీల్చేస్తున్నదని నివేదిక రూపొందించిన ఐక్యరాజ్యసమితి యూనివర్సిటీకి చెందిన జల, పర్యావరణ, ఆరోగ్యసంస్థ డైరెక్టర్ కావే మదానీ అంటున్నారు. ఆదాయాన్ని మించి వ్యయం చేస్తే సర్వస్వం కోల్పోయిన విధంగానే కుంచించుకుపోతున్న నదీనదాలూ, సరస్సులు, అడుగంటుతున్న భూగర్భ జలాలు జీవకోటి మనుగడను ప్రశ్నార్థకం చేస్తాయని ఆయన భావన. కనీసం ఈ దశలోనైనా మేల్కొంటే ఆ దివాళాను నివారించటం సాధ్యమేనని ఆయన చెబుతున్నారు.
నివేదికను గమనిస్తే ప్రపంచీకరణకూ, ఆవిరైపోతున్న నీటి వనరులకూ ఉన్న అవినాభావ సంబంధం తెలుస్తుంది. ప్రపంచంలోని అతి పెద్ద సరస్సుల్లో 1990 తర్వాతే నీరు అడుగంటుతున్నదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రధాన భూగర్భ జలాశయాల్లో 70 శాతం క్షీణత కనబడుతోంది. యూరోపియన్ యూనియన్(ఈయూ) భూభాగంతో సరిసమానమైన చిత్తడి నేలలు గత 50 ఏళ్లలో అంతరించగా, 1970 దశకం నుంచి చూస్తే హిమానీనదాలు 30 శాతం మేర కొడిగట్టాయి. నీటి వ్యవస్థపై అంతగా ఒత్తిడి లేని ప్రాంతాల్లో సైతం కాలుష్యం వల్ల మంచినీటి కొరత ఏర్పడటాన్ని ఈ నివేదిక ఎత్తిచూపు తోంది. నీటి కోసం భవిష్యత్తులో దేశాల మధ్యా, దేశాల్లో ప్రాంతాల మధ్యా వైషమ్యాలు పెచ్చరిల్లే అవకాశం ఉండొచ్చని అంచనా వేస్తోంది.
నీటి వనరుల క్షీణత దాదాపు అన్ని ప్రాంతాలకూ వ్యాపించింది. ప్రతియేటా కనీసం ఒక నెలరోజులపాటు 400 కోట్లమంది ప్రజానీకం దాహార్తితో ఉంటున్నారు. అఫ్గాన్ రాజధాని కాబూల్ నగరం నీటి లభ్యతను పూర్తిగా కోల్పోనున్న తొలి ప్రపంచ నగరం కాబోతున్నదని నిపుణులంటున్నారు. మెక్సికో నగరమైతే ఏడాదికి 20 అంగుళాల చొప్పున నీరు కోల్పోతోందని చెబుతున్నారు. అమెరికాలోని లాస్ ఏంజెలెస్, లాస్ వేగాస్ నగరాలు, ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లలో నీటి పంపిణీకి పరిమితులు విధించక తప్పని స్థితి ఏర్పడినా పాలకులు మాత్రం వాటి విస్తరణను ఆపడం లేదు. 2003–2019 మధ్య ఇరాన్ 200 ఘున కిలోమీటర్ల (7,062 శతకోటి ఘనపుటడుగుల) నీటి నిల్వను కోల్పోయిందని అంచనా. పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా తీవ్ర వాతావరణ పరిస్థితుల వల్ల నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. దక్షిణాసియాలో పెరుగుతున్న పట్టణీకరణ నీటి వనరుల్ని దెబ్బతీస్తోంది.
మన దేశం సంగతికొస్తే ప్రపంచ జనాభాలో మనం 18 శాతం. కానీ ప్రపంచ స్వచ్ఛనీటిలో మన వాటా 4 శాతం. అమెరికా, చైనాల తర్వాత అత్యంత భారీగా భూగర్భ జలాలను వాడుతున్న దేశం మనది. గంగ, యమున, సబర్మతి నదుల్లో పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు నీరు వచ్చి కలుస్తున్నాయి. 56 శాతం జిల్లాల భూగర్భ జలాల్లో నైట్రేట్‌లు కలగలిసివుంటున్నాయని తేలింది. విచ్చలవిడి నీటి వినియోగం, జలకాలుష్యం నివారించటంతోపాటు భూగర్భజలాల పెంపునకు చర్యలు తీసుకుంటేనే సమితి నివేదిక చెప్పిన ‘జల దివాళా’ నుంచి మనల్ని మనం రక్షించుకోగలం. ముప్పు ముంచుకొచ్చే వరకూ పట్టనట్టు ఉండటం క్షేమం కాదు.


