ఇజ్రాయెల్‌లో ఐక్యరాజ్యసమితికి చెందిన యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (UNRWA) ప్రధాన కార్యాలయాన్ని ఇజ్రాయెల్ దళాలు బుల్డోజర్లతో కూల్చివేశాయి. హమాస్ గ్రూప్‌తో ఐరారాకు సంబంధాలున్నాయంటూ తూర్పుజెరూసలెంలో కార్యాలలయాన్ని ఇజ్రాయెల్ నేలమట్టం చేసింది. షేఖ్ జర్రాలోని తమ ప్రాంగణంలోకి ఇజ్రాయెల్ దళాలు ప్రవేశించి తమ సిబ్బందిని కార్యాలయం నుంచి బలవంతంగా బయటకు తరలించాయని యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ ‘ఎక్స్’ వేదికగా పేర్కొంది. కార్యాలయంపై బుల్డోజర్ల దాడి ఐక్యరాజ్యసమితిపై జరిగిన దాడిగా అభివర్ణించింది.
దాడితో అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజసమితి హక్కులను ఇజ్రాయెల్ ఉల్లంఘించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ స్పందిస్తూ.. ఈ కూల్చివేతను తీవ్రంగా ఖండించారు. కూల్చివేతను తక్షణమే నిలిపివేయాలని.. ఆ భవనాన్ని తిరిగి ఐక్యరాజ్యసమితికి అప్పగించాలని ఇజ్రాయెల్‌ను కోరారు.
కాగా, హమాస్ గ్రూప్‌తో ఐక్యరాజ్యసమితి సంస్థకు సంబంధాలున్నాయని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. తమ దేశంలో బహిష్కరించిన ఆ సంస్థపై కొత్త చట్టం ప్రకారమే కూల్చివేతలు చేపట్టామని ఆ దేశ విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ 1950 నుంచి పనిచేస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో నిరాశ్రయులైన పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పించి సేవలందిస్తోంది. ఐరాస సంస్థ తమ దేశంలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకూడదని గతంలో ఆదేశించిన టెల్‌అవీవ్.. ఇటీవల ఓ చట్టం కూడా తీసుకొచ్చి ఆ సంస్థను నిషేధించిన సంగతి తెలిసిందే.


