సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ వాతావరణ శాఖ (ఐఎండీ) కార్యాలయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో కలకలం రేగింది. ఒక్కసారిగా ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. బేగంపేట ఆఫీస్‌లో 14 ఆర్డీఎక్స్ బాంబులను అమర్చినట్లు మెయిల్ రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. తనిఖీలు చేపట్టారు. బాంబు లేదని పోలీసుల తేల్చారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో హైకోర్టుతో పాటు పలు జిల్లా కోర్టులకు బాంబ్ బెదిరింపులు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.
గత నెలలో రాజమండ్రి జిల్లా కోర్టులో బాంబు ఉందంటూ బెదిరింపు రావడంతో కోర్టు భవనాన్ని ఖాళీ చేయించి డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. మరోవైపు నాంపల్లి సీబీఐ కోర్డుకు, కరీంనగర్ కోర్టుకు బాంబు బెదింరింపులు రావడంతో పోలీసులు హుటాహుటీన అక్కడికి చేరుకున్నారు. న్యాయవాదులను కోర్టు సిబ్బందిని బయిటకి పంపారు. అనంతరం డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. అయితే ఇటీవల తరచుగా కోర్టులకు, పాఠశాలలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలోని ఓ కోర్టు భవనంలో బాంబు పెట్టామంటూ బెదిరింపులు వచ్చాయి. అంతే కాకుండా తరచుగా విద్యాలయాలకు బెదిరింపులు వస్తున్నాయి.


