ఇది కొత్వాల్ గూడ పరిధిలోని రెడీమిక్స్ ప్లాంటు. పూర్తిగా 111 జీఓ పరిధిలో ఉంటుంది. ఇక్కడ నిర్మాణాలకే కాదు పరిశ్రమలకు, ప్లాంట్లకు అనుమతుల్లేవు. కానీ పలు సంస్థలు ఇక్కడ సుమారు ఇరవై వరకు ఆర్‌ఎంసీ ప్లాంట్లను ఏర్పాటు చేశాయి. కళ్లముందే పెద్దఎత్తున క్వారీ తవ్వకాలు చేపడుతున్నా..క్రషర్ మిషన్లు, రెడీమిక్స్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నా పట్టించుకునే నాథుడే కరువమయ్యాడు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రేటర్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. భూముల ధరలు ఆకాశాన్నంటాయి. రియల్టర్లు ప్రభుత్వ, ప్రైవేటు భూములే కాదు వాగులు, వంకలు, ఎత్తైన కొండలు, గుట్టలను కూడా వదలడం లేదు. తక్కువ ధరకు వాటిని కొను గోలు చేసి లేక్‌వ్యూల పేరుతో ఎత్తైన నిర్మాణాలు చేపడుతున్నారు. వీటికి గ్రానైట్, కంకర, రోబోసాండ్ పెద్ద మొత్తంలో అవసరం ఉంటుంది. వీటి కొనుగోలుకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుండటంతో రియల్ ఎస్టేట్ కంపెనీలు పక్కనే ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లోని కొండలు, గుట్టలపై కన్నేశాయి. ఇందుకు అధికారంలో ఉన్న కొంత మంది పెద్దల సహకారం కూడా లభిస్తుండటంతో యథేచ్ఛగా తవ్వకాలు చేపడుతున్నాయి. పైసా ఖర్చులేకుండానే విలువైన మట్టిని తమ సైట్‌లోకి తరలిస్తున్నాయి.
జిలెటిన్‌స్టిక్స్‌తో కొండలను పిండి చేస్తున్నాయి. అక్కడే క్రషర్ మిషన్లు, రెడీమిక్స్ ప్లాంట్లను ఏర్పాటు చేసి, నిర్మాణాలకు అవసరమైన ముడిసరుకునంతా సమకూర్చుకుంటున్నాయి. అక్రమ మైనింగ్‌తో ప్రభుత్వ ఆదాయానికి పెద్దమొత్తంలో గండి పడుతోంది. ఒక్క శంషాబాద్ మండల పరిధిలోనే 20 అక్రమ ఆర్‌ఎంసీ ప్లాంట్లు ఉన్నట్లు అంచనా. వీటిలో ఏ ఒక్కదానికి కూడా మైనింగ్ లీజు సహా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, లోకల్ బాడీ నుంచి నిరభ్యంతర పత్రం, తెలంగాణ విద్యుత్ తనిఖీ ప్రధాన అధికారి, రెవెన్యూ శాఖల నుంచి కనీస అనుమతులు లేవంటే ఆశ్చర్య పోనవసరం లేదు.
కోకాపేట్‌లో..
కొంత మంది తీసుకున్న అనుమతులకు భిన్నంగా తవ్వకాలు చేపడుతుంటే.. మరికొంత మంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు తవ్వకాలకు పాల్పడుతున్నారు. కనీసం లీజు అనుమతులు కూడా తీసుకోకుండా రూ.కోట్ల విలువైన సహజ సంపదను కొల్లగొడుతున్నారు. కోకాపేటలోని విలువైన ప్రభుత్వ భూమిలో పరిమితికి మించి తవ్వకాలు చేపట్టారు. మొబైల్ క్రషింగ్ ప్లాంట్‌కు పరి్మషన్ తీసుకుని ఫిక్స్‌డ్ క్రషింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారనే ఆరోపణలున్నాయి. 15 లక్షల క్యూబిక్ మీటర్ల మైనింగ్ చేపట్టి, ప్రభుత్వానికి కనీస ఫీజును కూడా చెల్లించడం లేదు. ఈవిషయంపై శంషాబాద్ తహసీల్దార్ రవీందర్ దత్తు మాట్లాడుతూ.. ఇప్పటికే ఐదు ప్లాంట్లను సీజ్‌చేశామని తెలిపారు. మిగిలిన వాటిని కూడా రెండు మూడు రోజుల్లో సీజ్ చేస్తామని వివరించారు.
అక్రమ క్రషర్ మాఫియా కనిపించడం లేదా?
శంషాబాద్: జీవో 111 పరిధిలో చిన్న ఇల్లు కట్టడానికి సైతం అనుమతించని అధికారులకు అనుమతులు లేని అక్రమ క్రషర్ మాఫియా ఎందుకు కనిపించడంలేదని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. కొత్వాల్‌గూడ అసైన్డ్ భూముల్లో కొనసాగుతున్న క్రషర్ ప్లాంటును ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలోని నిజనిర్ధాణ కమిటీ గురువారం మధ్యాహ్నం పరిశీలించింది. మంత్రి పొంగులేటికి కుమారుడు నగరంలో నిర్మాణం చేస్తున్న ఆకాశహరŠామ్యలకు ఇక్కడ ఉన్న రాఘవ కన్‌స్ట్రక్షన్ సంస్థ ద్వారానే మెటీరియల్ సరఫరా జరుగుతోందన్నారు.
రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి అడ్డగోలుగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. అక్రమ మైనింగ్‌లో సంబం«ధమున్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో గరీబోళ్ల ఇళ్లు కూల్చేసి ఆ ప్రాంతాన్ని గాజాలా మార్చారన్నారు. అక్రమ మైనింగ్ చేస్తుంటే ప్రశి్నంచని అడ్డుకోలేని పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం పెయిడ్ బ్యాచ్ కాదా అని నిలదీశారు. రాష్ట్రంలో ఏ ఒక్క కాంట్రాక్టును పొంగులేటి వదలడంలేదన్నారు. మొత్తం మీద రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు ఏఐసీసీకి ఏటీఎంలా మారిందని ఆయన ఆరోపించారు.


