ఆసిఫాబాద్‌అర్బన్: వేసవి ఎండల నేపథ్యంలో లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యం వచ్చే నెలలోనే పంపిణీ చేయాలని రాష్ట్రాలకు కేంద్ర పౌరసరఫరాల శాఖ లేఖలు రాసింది. ఈ క్రమంలో తెల్లరేషన్ కార్డుదారులకు ఏప్రిల్‌లోనే మూడు నెలల బియ్యం అందనుంది. గోదాముల నుంచి బియ్యాన్ని రేషన్ షాపులకు సరఫరా చేయనున్నారు.
జిల్లాలో ప్రస్తుతం 15 మండలాల పరిధిలో 315 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఆయా దుకాణాల పరిధిలో 1,63,765 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 13,389 అంత్యోదయ కార్డులకు 43,821 యూనిట్లకు 468.615 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. అలాగే 1,50,356 ఆహార భద్రత కార్డులకు 4,95,204 యూనిట్లకు 2690.928 మెటిక్ టన్నులు, 20 అన్నపూర్ణ కార్డులకు 0.200 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుంది. ప్రతినెలా సుమారు 3519.743 మెట్రిక్ టన్నుల బియ్యం చొప్పున మూడు నెలలకు కలిపి సుమారు 10559.229 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయనున్నారు.
జిల్లా ప్రజలకు మేలు
గతేడాది వర్షాకాలంలో వరదలు, ప్రకృతి విపత్తులను దృష్టిలో ఉంచుకుని జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన కోటాను ఒకేసారి పంపిణీ చేశారు. అలాగే వేసవిలో ఎండలు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మరోసారి మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో మారుమూల గిరిజన గ్రామాల్లోని లబ్ధిదారులకు మేలు జరగనుంది. తిర్యాణి మండలంలోని పల్లెలతోపాటు పలు గ్రామాల్లో స్థానికంగా రేషన్ దుకాణాలు లేవు. ఐదారు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి బియ్యం తెచ్చుకుంటున్నారు. ఒకేసారి బియ్యం అందిస్తే వీరికి దూరభారం తగ్గనుంది. మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయడం చేస్తే రవాణా చార్జీల ఖర్చు తగ్గి, హమాలీలు, డీలర్లకు కలిసివచ్చే అవకాశం ఉంది. అయితే బియ్యం నిల్వ చేయడం సమస్యగా మారనుంది. బియ్యం తీసుకునేందుకు ఒక కార్డుదారుడు మూడుసార్లు వేలిముద్ర వేయాలి. గతంలో జిల్లాలో సిగ్నల్, సర్వర్ సమస్యతో ఒక్కో కార్డుదారుడికి సుమారు 20 నిమిషాల సమయం పట్టింది. కేంద్రాల వద్ద పడిగాపులు తప్పలేదు. ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పౌరసరఫరాల శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
ఉత్తర్వులు అందలేదు
ఏప్రిల్‌లో ఒకేసారి మూడు నెలలకు సంబంధించిన బియ్యం పంపిణీ చేయడంపై ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటాం. ప్రతీ రేషన్‌కార్డు దారుడు ఈ నెల చివరి వరకు తప్పకుండా ఈ కేవైసీ చేయించుకోవాలి.
– వసంతలక్ష్మి,జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి


