రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్‌లో ఇటీవల జరిగిన ఓ చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గురువారం సాయంత్రం మందమర్రి సీఐ పర్స రమేష్, పట్టణ ఎస్సై శ్రీధర్ వివరాలు వెల్లడించారు. గోదావరిఖని చెందిన గాజంగి శ్రావణి, మంచిర్యాలకు చెందిన లాస్యకు గతంలో పరిచయం ఉంది. లాస్య శ్రావణిని మభ్యపెట్టి ఈ నెల 2న రామకృష్ణాపూర్‌కు తీసుకొచ్చింది. శ్రావణి టాయిలెట్‌కు వెళ్తున్న సమయంలో వెనుక నుంచి ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడు లాగేసుకుని అక్కడే పడి ఉన్న మొబైల్‌ఫోన్‌ను దొంగిలించి పారిపోయింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న రామకృష్ణాపూర్ పోలీసులు సీసీ కెమెరాలు, సాంకేతిక సాయంతో ఆధారాలు సేకరించారు. దొంగిలించిన సొమ్మును అమ్మేందుకు వచ్చిన లాస్యను గురువారం మంచిర్యాలలో పట్టుకుని పుస్తెలతాడు, మొబైల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. లాస్య భర్త, కుమారుడిని వదిలి జల్సాలకు అలవాటుపడి దొంగతనాలు చేస్తోందని సీఐ వివరించారు. నిందితురాలిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.


