భైంసా: నిర్మల్ జిల్లా బాసరలోని ఆర్జీయూకేటీలో విద్యార్థులను పోలీసులు, యాజమాన్యం వేధిస్తున్నాయని, బెదిరింపులకు దిగుతున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంపై హైదరాబాద్‌లో తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌కు గురువారం ఫిర్యాదు చేసినట్లు ఆప్ నేతలు తెలిపారు. విద్యార్థులు కనీస సౌకర్యాల కోసం ప్రశ్నిస్తే కేసులు పెడతామని, వారి భవిష్యత్తును నాశనం చేస్తామని బెదిరించడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన యాజమాన్యం, పోలీసులు వారిని భయపెట్టడం సరైన విధానం కాదని ఆప్ నేతలు విమర్శించారు. కొన్నేళ్లుగా బాసర ట్రిపుల్ ఐటీలో చోటుచేసుకున్న వరుస విద్యార్థుల మరణాలు, ప్రస్తుతం విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర భవిష్యత్తు అయిన విద్యార్థుల ప్రాణరక్షణ, విద్యా హక్కుల పరిరక్షణ కోసం ఈ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.


