విశ్వ వీక్షణకు మూడో కన్ను!  | SpaceX Falcon Heavy to launch NASA Roman telescope from Florida | Sakshi
Sakshi News home page

విశ్వ వీక్షణకు మూడో కన్ను! 

Aug 30 2026 5:27 AM | Updated on Aug 30 2026 5:27 AM

SpaceX Falcon Heavy to launch NASA Roman telescope from Florida

విశ్వరహస్యాలను ఛేదించేందుకు మరో మహా ప్రయత్నం మొదలు కానుంది! హబుల్, జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోపులకు వందరెట్లు ఎక్కువ ప్రాంతాన్ని చూడగల టెలిస్కోపు ప్రయోగానికి నాసా, స్పేస్‌ఎక్స్‌లు సిద్ధమవుతుండటం దీనికి కారణం. అన్నీ సవ్యంగా సాగితే నేడు అమెరికాలోని ఫ్లారిడాలోని కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి స్పేస్‌–ఎక్స్‌ ఫాల్కన్‌ హెవీ రాకెట్‌పై ఈ టెలిస్కోపు భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరానికి పయనం కానుంది. 

లగ్రాంజ్‌ పాయింట్‌–2గా పిలిచే చోటు నుంచి విశ్వంపై ఓ కన్నేయనుంది ఈ టెలిస్కోపు. ఈ ప్రాంతంలో సూర్యుడు, భూముల గురుత్వ శక్తి దాదాపు సమానంగా ఉండటం వల్ల టెలిస్కోపు స్థిరంగా ఒకే చోటులో ఉండగలదు. కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌లోని 39ఏ లాంచ్‌ కాంప్లెక్స్‌లో ఆదివారం ఉదయం 7.26 గంటలకు జరగనున్న ఈ ప్రయోగానికి సన్నాహకాలు జోరుగా సాగుతున్నాయి. నాసా మొట్టమొదటి ప్రధాన ఖగోళ శాస్త్రవేత్త ‘నాన్సీ గ్రేస్‌ రోమన్‌’పేరు ఈ టెలిస్కోపునకు పెట్టారు. ‘మదర్‌ ఆఫ్‌ హబుల్‌’గా నాన్సీ గ్రేస్‌ రోమన్‌కు పేరు. 

విశాల విశ్వం రహస్యాలను ఛేదించేందుకు నాసా ఉపయోగిస్తున్న టెలిస్కోపుల్లో నాన్సీ గ్రేస్‌ రోమన్‌ మూడోది. హబుల్‌ టెలిస్కోపు సుమారు 36 ఏళ్లుగా భూమికి 500 కిలోమీటర్ల ఎత్తులోంచి విశ్వ గవాక్షంగా పనిచేస్తోంది. సుమారు 2.4 మీటర్ల వెడల్పుతో ఉన్న దర్పణం (లెన్స్‌)తో సుదూర పాలపుంతలు, నక్షత్ర మండలాలు (నెబ్యులే), గ్రహాలను దృశ్య, పరారుణ కాంతుల్లో చూస్తూ ఫొటోలు పంపుతోంది. 

నాసా 2021లో ప్రయోగించిన జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోపు భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజ్‌ పాయింట్‌–2 నుంచి విశ్వం ఏర్పడిన తొలినాళ్ల నాటి పాలపుంతలు, సౌర కుటుంబానికి ఆవల ఉన్న గ్రహాలు (ఎక్సోప్లానెట్లు), వాటి వాతావరణాల సమాచారాన్ని సేకరిస్తోంది. తాజాగా ప్రయోగిస్తున్న నాన్సీ గ్రేస్‌ రోమన్‌ టెలిస్కోపు దృశ్యకాంతితోపాటు పరారుణ కాంతిలోనూ విశ్వాన్ని చూడగలదు. హబుల్, జేమ్స్‌ వెబ్‌లతో పోలిస్తే ఇది వంద రెట్లు ఎక్కువ ప్రాంతాన్ని చూడగలదు. ఎక్సోప్లానెట్ల లెక్కలు, కృష్ణ శక్తి, కృష్ణ పదార్థం (డార్క్‌ ఎనర్జీ, డార్క్‌ మ్యాటర్‌) రహస్యాలను తేల్చడం దీని లక్ష్యాల్లో కొన్ని.  

ప్రయోగ లక్ష్యాలు 
→ కృష్ణ పదార్థం, విశ్వ వ్యాపనానికి కారణమైన కృష్ణ శక్తిపై పరిశీలన (మహా విస్ఫోటం తరువాత విశ్వం అంతకంతకూ విస్తరిస్తోంది. దీన్నే విశ్వవ్యాపనం అంటాం) 
→ ఎక్సోప్లానెట్ల లెక్కలు, చిత్రాలు. 
→ వందల కోట్ల పాలపుంతలను గుర్తించి విశ్వం ఆకారానికి ఒక రూపు? 

ప్రధాన పరికరాలు
1. వైడ్‌ ఫీల్డ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ 
300 మెగాపిక్సెళ్ల డిజిటల్‌ కెమెరాలా పనిచేస్తుంది ఇది. హబుల్‌ కంటే వందరెట్లు ఎక్కువ ప్రాంతాన్ని చూసేందుకు అవకాశం కలి్పస్తుంది. అదే సమయంలో రెజల్యూషన్‌లో పెద్ద మార్పు ఉండదు. పాలపుంతల సర్వేకు, కృష్ణ శక్తి, వందలకోట్ల నక్షత్రాలు, పాలపుంతల అధ్యయనానికి ఉపయోగిస్తారు. 

2. కరోనాగ్రాఫ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ 
బలహీనమైన కాంతితో ప్రకాశించే ఎక్సోప్లానెట్ల ఫొటోలు తీసే సమయంలో నక్షత్ర కాంతిని నిరోధిస్తుంది. ఎక్సోప్లానెట్లపైన వాతావరణాన్ని, వెలుతురు కారణంగా కనిపించని గ్రహాలను గుర్తించేందుకూ సాయపడుతుంది.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement