ఏపీలో విస్తరిస్తున్న సెలూన్ వ్యాపారం
మారుతున్న జీవనశైలి, స్వీయ రక్షణపై యువతలో వస్తున్న మార్పే కారణం
మూడేళ్లలో 5.78 శాతం వృద్ధి
రాష్ట్రంలో మొత్తం సెలూన్లు 7,020
ఇందులో 94.77 శాతం సింగిల్ ఓనర్ వ్యాపారాలే
బిజినెస్ డేటా నివేదిక వెల్లడి
ఈ రంగానికి ఉన్న డిమాండ్‌తో యువత కూడా దీనిపై దృష్టి
2033 నాటికి దేశంలో ఈ వ్యాపారం రూ.2,01,185 కోట్లకు చేరుతుందని అంచనా
ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ నివేదికలో వెల్లడి
విశాఖపట్నంలోని ఎండాడకు చెందిన శ్రీహరి వయసు 29 ఏళ్లు. బీటెక్ చదివాడు. అలాగే, అప్పలరాజు వయసు 32. ఎంబీఏ చదివాడు. వీరిద్దరూ మార్కెట్లో డిమాండ్ ఉన్న సెలూన్ రంగాన్ని గుర్తించి సుమారు 850 చదరపు అడుగుల స్థలంలో మొదట హెయిర్ కట్, బియర్డ్ గ్రూమింగ్, ఫేషియల్, హెయిర్ స్పా సేవలు ప్రారంభించారు. కస్టమర్ల అభిరుచి తెలుసుకున్న తర్వాత వీరు హెయిర్ కలర్, హెయిర్ ట్రీట్‌మెంట్స్, వెడ్డింగ్ గ్రూమింగ్ ప్యాకేజీలను జోడించారు. ఇక ప్రచారం కోసం పెద్ద మొత్తంలో ఖర్చుచేయకుండా సోషల్ మీడియాను ఉపయోగించారు. కొత్త హెయిర్‌స్టైల్స్, మేకోవర్ వీడియోలను స్థానికంగా ప్రచారం చేయడంతో క్రమంగా రిపీట్ కస్టమర్లు పెరిగారు. సేవల సంఖ్య కంటే కస్టమర్ మళ్లీ రావడమే వ్యాపారానికి బలంగా మార్చుకున్నారు.
బెజవాడకు చెందిన వంశీది తొలుత సాదాసీదా బార్బర్ షాపు. యువత అవసరాలను గుర్తించి మార్కెట్ డిమాండ్‌కు తగ్గట్లుగా తన వ్యాపారాన్ని మార్చుకున్నాడు. ఇప్పుడు పూర్తిగా మెన్స్ గ్రూమింగ్‌పై దృష్టిపెట్టాడు. సాధారణ హెయిర్ కట్‌తో ఆగకుండా బియర్డ్ డిజైనింగ్, హెయిర్ కలర్, ఫేషియల్, స్పా, పార్టీ–వెడ్డింగ్ గ్రూమింగ్ సేవలను ఒకేచోట అందుబాటులోకి తెచ్చాడు. వాట్సాప్ రిమైండర్లు, పండుగ ఆఫర్లు, కాంబో ప్యాకేజీలతో కస్టమర్లను రిపీట్ విజిట్లకు తీసుకురావడంపై దృష్టిపెట్టాడు. ‘బార్బర్ షాప్’ నుంచి ‘గ్రూమింగ్ స్టూడియో’గా మారడం ద్వారా పురుషుల్లో పెరుగుతున్న వ్యక్తిగత సంరక్షణ ఆసక్తిని వ్యాపార అవకాశంగా మలుచుకున్నాడు.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సెలూన్ పరిశ్రమ మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందుతోందనడానికి ఈ రెండు ఉదంతాలే ఉదాహరణ. మారుతున్న కస్టమర్ అవసరాలకు అనుగుణంగా సెలూన్ల సేవలూ మారుతున్నాయి. ఒకప్పుడు కేవలం హెయిర్ కట్‌తో పాటు షేవింగ్‌కే పరిమితమైన ఈ సెలూన్ల ఓనర్లు ఇప్పుడు మార్కెట్ డిమాండ్లతో హెయిర్ స్పా, స్కిన్ కేర్, హెయిర్ కలర్, మేకప్, గ్రూమింగ్ ప్యాకేజీలు అందుబాటులోకి తెస్తున్నారు.
మారుతున్న జీవనశైలి, స్వీయ రక్షణపై యువతలో అవగాహన పెరగడంతో ఈ వ్యాపారం ఇప్పుడొక విలాసవంతమైన సేవ నుండి నిత్యావసర సేవగా మార్పు చెందింది. మెట్రో నగరాల నుంచి పట్టణాల వరకు ఈ తరహా బ్యూటీ సేవలకు ఏటా డిమాండ్ పెరుగుతోంది. దీంతో కొత్తతరం వ్యాపార రంగాల్లో బ్యూటీ, గ్రూమింగ్ బిజినెస్ ఒకటిగా మారింది. ఫలితంగా ఉద్యోగం కోసం ఎదురుచూడటం కంటే ఈ రంగం వైపు కూడా నేటి యువత దృష్టిపెడుతోంది.
నగరాల్లోనే మూడో వంతు..
రాష్ట్రంలో 2025 అక్టోబరు నాటికి 7,020 బ్యూటీ సెలూన్లు ఉన్నట్లు ‘బిజినెస్ డేటా’ వెల్లడించింది. 2023తో పోలిస్తే ఇది 5.78 శాతం పెరుగుదల. ముఖ్యంగా ఇందులోని 6,653 సెలూన్లు (94.77 శాతం) సింగిల్ ఓనర్ వ్యాపారాలే కావడం విశేషం. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా మరో 500 వరకు సెలూన్లు ఏర్పాటైనట్లు అంచనా. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలోని సెలూన్ వ్యాపారంలో ప్రధాన నగరాల వాటా గణనీయంగా ఉంది.
విశాఖపట్నంలో 909, విజయవాడలో 718, గుంటూరులో 512 సెలూన్లు ఉన్నాయి. ఈ మూడు నగరాల్లోనే 2,139 సెలూన్లు ఉన్నాయి. అంటే.. రాష్ట్రంలోని మొత్తం సెలూన్లలో ఇవి సుమారు 30.5 శాతం. నగరాల్లో పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ యువతలో గ్రూమింగ్‌పై పెరుగుతున్న ఆసక్తి కొత్త మార్కెట్‌ను సృష్టిస్తోంది. పెద్ద బ్రాండ్లతో పాటు చిన్న స్థాయిలో వ్యాపారం ప్రారంభించే వారికి కూడా ఈ రంగంలో అవకాశాలున్నాయని సూచిస్తోంది.
సెలూన్ మార్కెట్ పైపైకి..
భారత సెలూన్ మార్కెట్ విలువ 2024లో సుమారు రూ.1,01,949 కోట్లుగా ఉన్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ (ఐబీఈఎఫ్) వెల్లడించింది. 2033 నాటికి ఇది రూ.2,01,185 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. దీర్ఘకాలంలో సుమారు 7.9 శాతం (సీఏజీఆర్ – కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్) వృద్ధి నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. మరోవైపు.. సెలూన్ వ్యాపారం యజమానికి మాత్రమే ఆదాయం ఇవ్వదు. హెయిర్ స్టైలిస్టులు, బ్యూటీషియన్లు, మేకప్ ఆర్టిస్టులు, రిసెప్షనిస్టులు, మేనేజర్లకు కూడా ఉద్యోగాలు కల్పిస్తుంది. అందుకే నైపుణ్య శిక్షణతో పాటు మార్కెటింగ్, కస్టమర్ మేనేజ్‌మెంట్, డిజిటల్ ప్రమోషన్‌పై అవగాహన ఉన్న యువత ఈ రంగంలో వేగంగా ఎదిగే అవకాశం ఉంది.
చిన్న పట్టణాల్లోనూ అవకాశాలు..
బ్యూటీ, పర్సనల్ కేర్‌పై వినియోగదారుల ఖర్చు పెరగడం, యువతలో గ్రూమింగ్‌పై ఆసక్తి, సోషల్ మీడియా ప్రభావం వంటి అంశాలు ఈ మార్కెట్ విస్తరణకు దోహదం చేస్తున్నాయి. విశాఖ, విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లో మార్కెట్ ఇప్పటికే పోటీగా మారింది. అయినా జిల్లా కేంద్రాలు, చిన్న పట్టణాలు, మండల కేంద్రాల్లో ఇంకా అవకాశాలు ఉన్నాయి. పెద్ద నగరాల్లో ఉన్న ప్రీమియం సేవలను స్థానిక అవసరాలకు తగ్గ ధరల్లో అందించగలిగితే చిన్న పట్టణాల్లోనూ మంచి కస్టమర్ బేస్ ఏర్పడే అవకాశం ఉంది.


