పల్లె నెత్తిన నీటి పిడుగు | User charges for drinking water in villages | Sakshi
Sakshi News home page

పల్లె నెత్తిన నీటి పిడుగు

Aug 30 2026 4:49 AM | Updated on Aug 30 2026 4:49 AM

User charges for drinking water in villages

గ్రామాల్లో తాగునీటికి యూజర్‌ చార్జీలు వసూలు

ఉత్తర్వులు విడుదల చేసిన చంద్రబాబు సర్కారు   

మంచినీటి పథకాల నిర్వహణ విధివిధానాలు ఖరారు 

తాగునీటి పథకాల నిర్వహణ బాధ్యతలను  గ్రామ కమిటీలకు అప్పగిస్తూ ఆదేశాలు 

గ్రామీణులపై రూ.1,037 కోట్లు భారం

సాక్షి, అమరావతి: గ్రామాల్లో తాగునీటి పథకాల నిర్వహణకు యూజర్‌చార్జీలు (పన్ను) వసూలు చేసుకోవాలంటూ చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో గ్రామీణులపై రూ. 1,037 కోట్ల భారం పడుతోంది. ఆయా పథకాల నిర్వహణకు అయ్యే మొత్తానికి సంబంధించి కేటాయించిన 16వ ఆర్థిక సంఘం నిధులు, పంచాయతీ అదనంగా సమకూర్చే నిధులు సరిపోని పక్షంలో మిగిలిన మొత్తాన్ని ఆ గ్రామ పరిధిలో తాగునీటి సరఫరా చేసే ఇళ్ల యజమానుల నుంచి వసూలు చేసుకోవాలని పేర్కొంది. 

ఈ మేరకు ‘జేజేఏం–2.0 కార్యాచరణ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ తాగునీటి సరఫరా పథకాల వార్షిక కార్యాచరణ ప్రణాళికల విధివిధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. గ్రామ పంచాయతీ, మండల స్థాయిలో ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేసుకోవాలని పేర్కొంది.  

గ్రామ కమిటీలకు తగిన సహకారం 
పంచాయతీ ఏర్పాటు చేసిన  గ్రామ నీరు, పారిశుధ్య కమిటీ తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ బాధ్యతను కలిగి ఉంటుందని ఆ ఆదేశాల్లో పేర్కొంది. జిల్లా స్థాయిలో ఉండే జిల్లా కమిటీ, సాంకేతిక నిపుణుల విభాగాలు గ్రామ కమిటీలకు తగిన సహకారం అందించాలని పేర్కొంది. దీనికి సంబంధించి గ్రామ పంచాయతీ నుంచి కలెక్టర్‌ స్థాయి వరకు నిర్వహించాల్సిన విధులను ఆదేశాల్లో వివరించారు.

నీటి పథకాల నిర్వహణకురూ.1,680 కోట్లు వ్యయం
‘ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ’కు సంబంధించిన పాలసీ పేరిట చంద్రబాబు ప్రభుత్వం కొన్ని నెలల కిందట విడు­దల చేసిన నోటిఫికేషన్‌లో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు, బోర్లు నిర్వహణ, మరమ్మతులకు ఏడాదికి రూ. 1,680.29 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. అందులో రూ. 1,036.97 కోట్ల మొత్తాన్ని ప్రజల నుంచి యూజర్‌ చార్జీల రూపంలో వసూలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 

అప్పటి అంచనా ప్రకారం.. గ్రామీణ ప్రాంతంలో ఒక్కొక్క ఇంటి నుంచి ఏడాదికి రూ. 240 నుంచి రూ.320 చొప్పున పన్ను రూపేణ వసూలు చేయాలని లెక్క కట్టారు. రెండు కంటే ఎక్కువ గ్రామాలకు ఒకే రక్షిత మంచినీటి పథకం ఉంటే ప్రతి ఇంటిపై నెలకు రూ. 26.66 చొప్పున ఏడాదికి రూ. 320, అలాగే గ్రామ పరిధిలో అంతర్గతంగా చిన్న రక్షిత తాగునీటి పథకం ఉన్నచోట ప్రతి ఇంటి నుంచి నెలకు రూ. 20 వంతున ఏడాదికి రూ. 240 వసూలు చేయాలని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement