పదవీ విరమణ ఫలాలు ప్రభుత్వ దయాదాక్షిణ్యం కాదు | AP High Court Slams Withholding of Employees Retirement Benefits | Sakshi
Sakshi News home page

పదవీ విరమణ ఫలాలు ప్రభుత్వ దయాదాక్షిణ్యం కాదు

Aug 30 2026 4:27 AM | Updated on Aug 30 2026 4:27 AM

AP High Court Slams Withholding of Employees Retirement Benefits

సుదీర్ఘ సేవలకు ఉద్యోగులు సంపాదించుకున్న విలువైన హక్కు 

పాలనాపరమైన జాప్యాలకు ఉద్యోగులు బాధితులు కాకూడదు 

ఏపీ, తెలంగాణ హౌసింగ్‌ బోర్డుల విభజన వ్యవహారంపై హైకోర్టు ఉద్ఘాటన 

త్వరగా విభజన ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రానికి ఆదేశాలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రా­ల హౌసింగ్‌ బోర్డుల మధ్య ఆస్తులు, అప్పుల విభజన ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ వివాదాన్ని కారణంగా చూపి ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలను తెలంగాణ హౌసింగ్‌ బోర్డు నిలిపేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఉద్యోగులకు అందించే పదవీ విరమణ ప్రయోజనాలు ప్రభుత్వ దాతృత్వం, ఉదారత, దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండవని తేల్చి చెప్పింది. 

పదవీ విరమణ ప్రయోజనాలన్నవి సుదీర్ఘ సేవలకు ఉద్యోగులు సంపాదించుకున్న అత్యంత విలువైన హక్కు అని తేల్చి చెప్పింది. ప్రావిడెంట్‌ ఫండ్‌ బకాయిల విషయంలో ఇది మరింత బలంగా వర్తిస్తుందని స్పష్టం చేసింది. పరిపాలనాపరమైన జాప్యాలకు, సంస్థాగత వివాదాలకు ఉద్యోగులు బాధితులుగా మారడానికి వీల్లేదంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల తీర్పు వెలువరించారు.  

8 వారాల్లో చెల్లింపులు జరపాలి: తెలంగాణ హౌసింగ్‌ బోర్డుకు ఆదేశాలు 
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ హౌసింగ్‌ బోర్డులో పనిచేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన దాదాపు రూ.­8.77కోట్ల జీపీఎఫ్‌ నిధులు తెలంగాణ హౌసింగ్‌ బోర్డు ఆ«దీనంలో ఉన్నాయన్న హైకోర్టు, రాష్ట్ర విభజన ముందు నాటి పిటిషనర్ల జీపీఎఫ్‌ బకాయిలను వడ్డీతో సహా ఎనిమిది వారాల్లో చెల్లించాలని ఆ రాష్ట్ర బోర్డును ఆదేశించింది. నిర్ణీత గడువులోగా జీపీఎఫ్‌ బకాయిలను విడుదల చేయకుంటే ఉద్యోగులు పదవీ విరమణ చేసిన నాటి నుండి సొమ్ము చెల్లించే వరకు 12శాతం వార్షిక వడ్డీని అదనంగా చెల్లించాల్సి ఉంటుందని తెలంగాణ హౌసింగ్‌ బోర్డుకు తేల్చి చెప్పింది.  కోర్టు ఆదేశాల మేరకు చేసే ఈ చెల్లింపులను ఇరు రాష్ట్రాల హౌసింగ్‌ బోర్డుల మధ్య జరిగే ఆస్తులు, అప్పులు పంపిణీ సమయంలో సర్దుబాటు చేసుకోవచ్చని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు.  

వ్యాజ్యం వివరాలు ఇవీ.. 
2014 ఏపీ పునర్వీభజన చట్టం ప్రకారం ఉమ్మడి హౌసింగ్‌ బోర్డు.. ఏపీ హౌసింగ్‌ బోర్డు–తెలంగాణ హౌసింగ్‌ బోర్డుగా విడిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హౌసింగ్‌ బోర్డులో 40 ఏళ్ల పాటు సేవలు అందించిన పలువురు ఉద్యోగులు రాష్ట్ర విభజన అనంతరం ఏపీ హౌసింగ్‌ బోర్డులో తమ సేవలను కొనసాగించారు. ఈ ఉద్యోగుల్లో కొందరు 2018–­21 మధ్య కాలంలో పదవీ విరమణ చేశారు. వీరు ఏపీ హౌసింగ్‌ బోర్డు నుంచి తాము పనిచేసిన కా­లానికి జీపీఎఫ్‌ బకాయిలను పూర్తిగా పొందారు. 

అయితే పునర్వీభజనకు ముందు ఉమ్మడి హౌసింగ్‌ బోర్డులో పనిచేసిన కాలానికి వారి నుంచి సేకరించిన జీపీఎఫ్‌ నిధులన్నీ కూడా తెలంగాణ హౌసింగ్‌ బోర్డు పరిధిలోని బ్యాంకు ఖాతాల్లోనే ఉండిపోయాయి. ఈ జీపీఎఫ్‌ బకాయిలను, ఇతర పదవీ విరమణ ప్రయోజనాలను చెల్లించకపోవడంతో పలువురు  విశ్రాంత ఉద్యోగులు 2021– 2022 మధ్య హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫున తేలప్రోలు శ్రీచరణ్‌ చేసిన వాదనలతో హైకోర్టు పూర్తిగా ఏకీభవించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement